YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 18 October 2012

లక్షలాది పాదాలు స్వచ్ఛందంగా ఒక్క చోట

ఓ మహాద్భుత ఘట్టం..
లక్షలాది పాదాలు స్వచ్ఛందంగా ఒక్క చోట
చేరిన సందర్భం..
జాతరా?.. తిరునాళ్లా?.. లేక ఒక
మహోత్సవమా ఇది?- అని వేన వేల కళ్లు
ఆశ్చర్యపోయిన సందర్భం..
ఎవ్వరూ పేరు పెట్టి పిలవకున్నా..
బీదాబిక్కీ, పేదా పెద్దా.. కూలీ, హమాలీ.. ప్రతి వర్గం
కదం తొక్కుతూ కదిలొచ్చాయి..
ఈ పాదయాత్ర మాది అనుకుంటూ లక్షలాది
పాదాలూ ఒక్కటై ముందుకు కదిలాయి..
యాత్ర సాగిన 15 కిలోమీటర్ల మేర చేయీ చేయీ కలిసి
అపురూప దృశ్యాన్ని ఆవిష్కరించాయి..
పాదయాత్రకొచ్చేవారి కోసం ఏర్పాట్లేవీ లేకున్నా..
నీళ్లు దొరకకున్నా.. తిండి తినకున్నా..
ఎన్ని గంటలైనా.. ఎంత ఎండైనా..
ఒక్క మనిషీ వెనుతిరగలేదు..
మా కోసమే కదా.. మా పాదయాత్రే కదా అన్న మాటే
ప్రతి నోటా! 


మరో ప్రజాప్రస్థానం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తోన్న ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కయిన తెలుగుదేశం పార్టీ కుట్ర రాజకీయాలకు నిరసనగా వైఎస్సార్ కుమార్తె షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర గురువారం మహా జాతరలా ప్రారంభమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి చేస్తున్న ఈ యాత్రకు అభిమానసందోహం స్వచ్ఛందంగా, ఉప్పెనలా తరలివచ్చింది. లక్షలాది మంది ఆత్మీయ నేస్తాల నడుమ షర్మిల ఇడుపులపాయలో తండ్రి పాదాల చెంత పాదయాత్ర ప్రారంభించారు.

జగనన్న నాయకత్వంలో రాజన్న రాజ్యం మళ్లీసాధ్యమంటూ నినదించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే ఈ ‘మరో ప్రజా ప్రస్థానం’ ధ్యేయమన్నారు. చేతగాని ప్రభుత్వాన్ని ఎందుకు దించడం లేదంటూ ప్రతిపక్ష పార్టీని నిలదీయడమే లక్ష్యమన్నారు. ప్రజాపక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని మాట ఇచ్చారు. ప్రజా క్షేమాన్ని పాలకులు గాలికి వదిలేసినప్పుడు మహానేత అడుగులతో ‘ప్రజా ప్రస్థానం’ పుడితే.. ప్రజాసంక్షేమ స్వప్నాలు కళ్ల ముందే కూలుతుంటే ఈ ‘మరో ప్రజా ప్రస్థానం’ పుట్టిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

మహానేతకు నివాళులర్పించి..
3 వేల కిలోమీటర్ల మేర సాగే ఈ సుదీర్ఘ పాదయాత్రను గురువారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ఉదయం 11.45కి వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు ఉదయం 10.25కు విజయమ్మ, వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వై.ఎస్.భారతితో కలిసి రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఆయనకు నివాళులర్పించారు. సర్వమత ప్రార్థనలు జరిపారు. అనంతరం అక్కడే ఉన్న వేదికపైకి 10.58కి చేరుకున్నారు. 

యాత్రకు స్వచ్ఛందంగా తరలివచ్చిన లక్షలాది మంది అభిమానుల చప్పట్ల హోరు మధ్య విజయమ్మ ‘మరో ప్రజా ప్రస్థానం’లో తొలి ప్రసంగం చేశారు. నాడు చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఘోర వైఫల్యం కారణంగా వైఎస్ ప్రజాప్రస్థానం చేపడితే.. నేడు కిరణ్ సర్కారు వైఫల్యాన్ని ఎండగట్టేందుకు మరో ప్రజాప్రస్థానం చేపట్టాల్సి వచ్చిందని వివరించారు. తన హయాంలో ఏమీ చేయలేని చంద్రబాబు ఇప్పుడు మోసపు మాటలు చెబుతున్నారని, అధికార కాంగ్రెస్‌ను నిలబెట్టేందుకు ఆ పార్టీతో కుమ్మక్కయ్యారని విశదీకరించారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ తాను జగనన్న వదిలిన బాణాన్ని అని ఉద్వేగంగా పేర్కొన్నారు.

విద్యార్థులతో ముచ్చటించి..
సరిగ్గా 11.45కు షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’లో అడుగు ముందుకేశారు. తల్లి విజయమ్మ, వదిన భారతి, పార్టీ నేతలు కొండా సురేఖ, శోభానాగిరెడ్డి, రోజా, వాసిరెడ్డి పద్మ, కొల్లి నిర్మలాకుమారి తదితరులు కదం కలపగా ప్రజాప్రస్థానంలో ముందుకు కదిలారు. తొలుత ట్రిపుల్ ఐటీకి వెళ్లారు. అక్కడ విద్యార్థులతో ముచ్చటించారు. అక్కడి విద్యార్థులు షర్మిలకు తమ బాధలు విన్నవించారు. ‘మాకు బోధన సిబ్బంది లేరు. అభివృద్ధి అసలే లేదు. వైఎస్ చనిపోయాక మమ్మల్ని పట్టించుకున్నవారే లేరు’ అని ఒక విద్యార్థి ఆవేదన వ్యక్తంచేశారు. ‘బోధన సిబ్బందికి అనుభవం లేదు. బీటెక్, ఎంటెక్‌లతో ఇక్కడ బోధన చేయిస్తున్నారు..’ అని మరో విద్యార్థిని వివరించారు. 

‘ల్యాబ్, ఫ్యాకల్టీ లేకుండా వట్టి సర్టిఫికెట్లతో మేం రేపు సమాజానికి ఏం ఒరగబెడతాం?’ అంటూ మరో విద్యార్థి ఆవేదన వెళ్లగక్కారు. ‘1:30 ఫ్యాకల్టీ ఉండాలి.. కానీ ఇక్కడ అలా లేదు. వైఎస్ ఉన్నప్పుడు నెలకోసారి ఇక్కడికి వచ్చేవారు. మేం పేదోళ్లమని ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంపికైన మమ్మల్ని ఇలా నిర్లక్ష్యంగా వదిలేస్తే ఎలా’ అంటూ ప్రశ్నించారు. దీనికి షర్మిల స్పందిస్తూ ‘వీళ్లు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వారనేనా ఇంత నిర్లక్ష్యం? నగర విద్యార్థులతో సమానంగా నెగ్గుకురావాలనే సదుద్దేశంతో ట్రిపుల్ ఐటీలు పెట్టారు. గొప్ప ఇంజనీర్లుగా తీర్చిదిద్దాలన్న ఆశయంతో పెట్టారు. రాజశేఖరరెడ్డి తరచూ వచ్చేవారని విద్యార్థులు చెబుతున్నారు. 

ఇప్పుడు ఎందుకు ఇంత చిన్నచూపు చూస్తున్నారు? వీరంతా బీదవారేననా? గ్రామీణులనేనా? మనకు రాజన్న రాజ్యం మళ్లీ రావాలి. జగనన్నతోనే రాజన్న రాజ్యం సాధ్యం. వైఎస్సార్‌సీపీకి మీ మద్దతు కావాలి. మీ మేలు కోరుతూ సెలవు తీసుకుంటున్నా..’ అంటూ అక్కడి నుంచి బయలుదేరారు. ఎండ వేడిలోనూ వడివడిగా అడుగులు వేశారు. ఇడుపులపాయ నుంచి వేంపల్లి మెయిన్‌రోడ్డు ఎక్కేసరికి ఆ రోడ్డుపై ఇరువైపులా బారులు తీరిన లక్షలాది జనం స్వాగతాలు పలికారు. కేరింతలు కొట్టారు. బంతిపూల వర్షం కురిపించారు. విజయమ్మ, షర్మిల, వైఎస్ భారతిని చూసేందుకు పోటీలు పడుతూ పరుగులుపెట్టారు.

10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..
ఇడుపులపాయ నుంచి వేంపల్లి వైపు సాగుతున్న పాదయాత్రలో లక్షలాది మంది జనం భాగస్వాములవడంతో ట్రాఫిక్ జామైంది. ఇడుపులపాయ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న వీరన్నగట్టుపల్లి వద్ద వంతెన ఉండడం, అక్కడ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు సిబ్బంది లేకపోవడం, వేలాది వాహనాలు రావడంతో ట్రాఫిక్ జామైంది. మరోవైపు ఇడుపులపాయ నుంచి మధ్యాహ్న భోజన స్థల వేదిక అయిన కుమ్మరాంపల్లి వరకు 7 కిలోమీటర్ల పొడవునా జనం సాగుతూనే ఉన్నారు. కుమ్మరాంపల్లికి అవతల 3 కిలోమీటర్ల వరకు జన ఉప్పెన పోటెత్తుతూనే ఉంది. మధ్యాహ్నం 2.20కి కుమ్మరాంపల్లి చేరుకున్న షర్మిల భోజనానికి ఉపక్రమించారు. తిరిగి సాయంత్రం 4.30 గంటలకు మళ్లీ పాదయాత్ర ప్రారంభించారు. కుమ్మరాంపల్లి దాటాక మదర్‌థెరిస్సా ట్రస్టుకు చెందిన వృద్ధులతో ముచ్చటించారు. వరిసాగు రైతులతో మాట్లాడి కష్టసుఖాలు తెలుసుకున్నారు. తమలపాకు తోట రైతులతో మాట్లాడారు.

ప్రస్తుతం పంటల పరిస్థితులను రైతులకు వివరించారు. ఎరువుల ధరలు, కరెంటు కోత, భూగర్భజలాలు ఎండిపోవడం వంటి సమస్యలను ఏకరువు పెట్టారు. గిట్టుబాటు ధర లేదని తమలపాకు రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఆకు తోటలను నిలువునా కొట్టివేస్తున్నామని కన్నీటిపర్యంతమయ్యారు. తరువాత వేంపల్లి దిశగా ముందుకు సాగారు. మార్గం మధ్యలో మహిళలు, వృద్ధులతో మాట్లాడుతూ సాయంత్రం 6.30కు వేంపల్లి నాలుగు రోడ్ల కూడలికి చేరుకున్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడి నుంచి రాజీవ్‌కాలనీ సమీపంలో ఉన్న రాత్రి బసకు 8.20 గంటలకు చేరుకున్నారు. షర్మిల ఇడుపులపాయ నుంచి కుమ్మరాంపల్లి వరకు 7 కిలోమీటర్లు, అక్కడి నుంచి వేంపల్లెలో బస స్థలం వరకు 8 కిలోమీటర్లు తొలిరోజు మొత్తం 15 కిలోమీటర్లు నడిచారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!