2000 నుంచి 2003 మధ్య కాలంలో రాష్ట్రంలో ఏర్పడిన తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితుల్లో ప్రజలు సంక్షోభంలో కూరుకు పోయినపుడు తానెందుకు పాదయాత్ర చేయాల్సి వస్తున్నదనే అంశంపై దివంగత రాజశేఖరరెడ్డి స్పష్టంగా కొన్ని మాటలు చెప్పారు. ‘ప్రభుత్వ వైఫల్యం వల్ల అన్ని రంగాల్లోనూ నైరాశ్యం నెలకొంది. బాధల్లో ఉన్న ప్రజలను ఆదుకోకుండా మొద్దు నిద్ర పోతున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని నిద్ర లేపి.. తద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రజాస్వామ్యంలో ఉన్న అన్ని సంప్రదాయక విధానాలను అవలంబించి ప్రతిపక్షంగా మేం విఫలమయ్యాం. ప్రజా సమస్యలపై అసెంబ్లీ స్తంభన, ధర్నాలు, నిరాహారదీక్షలు, రాస్తారోకోలు వంటి అన్ని శాంతియుత ఆందోళనలు చేశాం.
అయినా ప్రభుత్వాన్ని నిద్ర లేపలేకపోయాం. అందుకే ఇక ప్రజల్లోకే వెళ్లి నైరాశ్యంలో ఉన్న వారిని ఓదార్చి వారికి ఒక భరోసా ఇవ్వటానికి పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నాం’ అని ప్రకటించి ముందుకు వెళ్లారు. తొమ్మిదేళ్ల తర్వాత ఇప్పుడు కూడా దాదాపు అలాంటి పరిస్థితే నెలకొంది. 2003లో ప్రజా ప్రస్థానం పేరుతో వై.ఎస్ చేసిన పోరాటం అధికారపక్షం విధానాలపైనే! కానీ ఇపుడు షర్మిల చేస్తున్న పోరాటం, అధికార, ప్రతిపక్షాలు రెండింటిపైనా..! ప్రజా సమస్యలను ప్రభుత్వం అసలు పట్టించుకోవటం లేదు సరికదా.. వారిపై అన్ని రకాల చార్జీలు (విద్యుత్, ఆర్టీసీ చార్జీలు, గ్యాస్ ధర) పెంచి మోయలేని భారం మోపుతోంది. ఇలాంటి ప్రజాకంటక ప్రభుత్వాన్ని నిలదీసి, అవసరమైతే గద్దె దించాల్సిన ప్రతిపక్ష టీడీపీ తన బాధ్యత నుంచి పూర్తిగా పక్కకు తప్పుకుని.. ప్రభుత్వంతో కుమ్మక్కయిన విషయాన్ని ఆమె ఎండగట్టనున్నారు.
నిత్యం ప్రజల మధ్యే వైఎస్: 2003లో ప్రజాప్రస్థానం పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేసిన వైఎస్ ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూశారు. ఆ కష్టాలను బాగా అర్థం చేసుకున్న కారణంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అధికారంలో ఉన్నప్పటికీ వైఎస్ నిరంతరం ప్రజలతో మమేకమయ్యేవారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవటానికి రాజీవ్ పల్లెబాట, నగరబాటలతో పాటు రచ్చబండ కార్యక్రమాలు చేపట్టారు. 2009లో రెండోసారి కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో అధికారంలోకి తెచ్చిన వైఎస్.. ఆ తరువాత ప్రభుత్వ పథకాలు కిందిస్థాయిలో ఎలా అమలవుతున్నాయో తెలుసుకోవడానికి రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు బయల్దేరి హెలికాప్టర్ దుర్ఘటనలో అకాల మరణం చెందారు.
No comments:
Post a Comment