YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 8 September 2012

కాంగ్రెస్‌కు బీటలు

ప్రతి ఒక్కరిలో స్తబ్దత, నైరాశ్యం నెలకొన్నాయి
నేనూ అభద్రతా భావంతో ఉండాల్సిన పరిస్థితి
అందరం కలిసి పునర్నిర్మాణం చేసుకోవాలి
వీహెచ్ సదస్సులో చిరు సంచలన వ్యాఖ్యలు
పేలవంగా ముగిసిన ‘సేవ్ ది పార్టీ’ సదస్సు
 ‘‘కాంగ్రెస్‌కు కష్టకాలమొచ్చింది.. పార్టీ బీటలు వారుతోంది.. ప్రతి ఒక్కరిలో స్తబ్దత, నైరాశ్యం నెలకొన్నాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది’’ అని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆధ్వర్యంలో శనివారం జూబ్లీహాల్‌లో ‘సేవ్ ది పార్టీ’ పేరిట ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన సదస్సు ముగింపు సమయంలో హాజరైన చిరంజీవి పార్టీ పరిస్థితిపై ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘పార్టీలో ప్రధానంగా సమన్వయ లోపం ఏర్పడింది. తల్లిలాంటి పార్టీకి కష్టకాలం వచ్చింది. ఈ సమయంలో ఈ సదస్సు నిర్వహించడం శుభ పరిణామం. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నేను ఇంట్లోకి (కాంగ్రెస్) ప్రవేశించాక గాలివానలు, సునామీల్లాంటి ప్రకృతి వైపరీత్యాలు వ చ్చినా తట్టుకోగలిగేలా ఉండాలనుకున్నా. ఎందుకంటే ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే అందులో అంత సేఫ్‌గా ఉండొచ్చని అనుకుంటా.

కానీ ఈ రోజు ఇల్లు బీటలు వారేలా, గోడలు పగుళ్లు వచ్చేలా, రూఫ్ (పైకప్పు)లు చెల్లాచెదురవుతుంటే అభద్రతా భావంతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది’’ అని ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఈ ఇంటిని (కాంగ్రెస్‌ను) ఎవరో వచ్చి రిపేర్ చేయరని, అందరం కలిసి పున ర్నిర్మాణం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. మీడియా ఉందని తప్పొప్పులను సమీక్షించుకోకూడదనుకోవడం సరికాదన్నారు. బలహీనతల్లేని పార్టీలు లేవని, వాటిని అధిగమించడమే వివేకమని పేర్కొన్నారు.

పార్టీలో సమన్వయ లోపం ఉందనే విషయం హైకమాండ్ పెద్దలకు తెలుసునన్నారు. కార్యకర్తల్లో నెలకొన్న నైరాశ్యాన్ని పోగొట్టాల్సిన అవసరముందని తాను సోనియాగాంధీని కోరినట్లు చెప్పారు. ఈ విషయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని సూచించానన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు కమిటీ ఇచ్చిన నివేదికను అలాగే ఉంచారే తప్ప ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో లబ్ధి పొందుతూ అవతలి పార్టీకి మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు. ‘‘తినేది ఇక్కడ... పాడేది అక్కడా? ఇదేం న్యాయం, ధర్మం? ఇవేం ఎథిక్స్’’అని ప్రశ్నించారు. తాను బేషరతుగా ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసినప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అధిక నిధులు కేటాయించాలని, బీసీలకు అధిక సీట్లు ఇవ్వాలనే విషయంలో కొన్ని షరతులు పెట్టిన మాట వాస్తవమేన న్నారు. సోనియాగాంధీ 2014 ఎన్నికల్లో బీసీలకు అత్యధిక సీట్లు కేటాయిస్తారనే విషయంలో తనకు ఎలాంటి సందేహమూ లేదన్నారు.

ఒకరికి పదవిస్తే మిగిలిన వారు
పోతామంటున్నారట: వీహెచ్

వీహెచ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి డ్వాక్రా మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వటం లేదని మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంత్రి పదవిని వదిలేస్తే ఆ స్టయిలే వేరుగా ఉండేదన్నారు. మంత్రిగా ఉండటం వల్ల సీఎం వద్ద చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. సీఎం, మంత్రి పదవులు అనుభవిస్తున్న నాయకులు నామినేటెడ్ పదవులను మాత్రం భర్తీ చేయటం లేదన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ఒకరికి పదవిస్తే మిగిలిన వాళ్లు పార్టీని విడిచి వెళ్లేలా ఉన్నారని చెబుతున్నారన్నారు. రాజ్యసభ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావు రూపొందించిన ‘వైఎస్ పాదయాత్ర డైరీ’ ఆవిష్కరణ కార్యక్రమానికి హైకమాండ్ పెద్దలు హాజరు కావడాన్ని తాను సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు. సీబీఐ కేసులో ఐఏఎస్ అధికారి బి.పి.ఆచార్య కేవీపీ పేరును ప్రస్తావించడంతో ఆయనకు భయం పట్టుకుందన్నారు. రేపటి నుంచి తమకు చేతినిండా పని ఉందని, కేవీపీ ఎక్కడికి వెళ్లినా వదిలే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.

తుస్సుమన్న వీహెచ్ సదస్సు...

‘సేవ్ ది పార్టీ’ పేరుతో వీహెచ్ నిర్వహించిన సదస్సు పేలవంగా ముగిసింది. 1972 నుంచి ఇప్పటి వరకు యువజన కాంగ్రెస్‌లో పనిచేసిన నాయకులతో ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరు కావాలని సీఎం, పీసీసీ చీఫ్, మంత్రులు సహా పార్టీ ప్రజా ప్రతినిధులందరినీ ఆహ్వానించారు. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మినహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరూ హాజరు కాలేదు. గతంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసిన నాయకులు కూడా చాలామంది హాజరు కాలేదు. మాజీ మంత్రులు చిన్నారెడ్డి, వసంత నాగేశ్వరరావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి జి.నిరంజన్ వంటి కొద్దిమంది నాయకులు మాత్రమే వీహెచ్ నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు.

చిరంజీవి వస్తే ఎంత... రాకుంటే ఎంత?

జూబ్లీహాలులో జరిగిన యువజన కాంగ్రెస్ కార్యకర్తల మేథోమధనానికి ప్రముఖులు గైర్హాజరు కాకపోవటంపై వీహెచ్ అసంతృప్తి చెందారు. కొందరు నేతలతో చివరి ప్రయత్నంగా ఫోన్‌లో ఆహ్వానించేందుకు ప్రయత్నించారు. సమావేశం జరుగుతుండగా మధ్యాహ్నం 1.10 నిమిషాలకు ఒక్కసారిగా వేదికపై నుంచి జూబ్లీహాలు వెనక్కి వెళ్లి చిరంజీవికి ఫోన్ కలిపారు. తాను వేరే మీటింగ్‌లో ఉన్నాననీ రాలేనని ఆయన చెప్పారు. సామాజిక న్యాయం అంటూ గొప్పలు చెప్తావు కదా, ఆ అంశంపై మీటింగ్ పెడితే ఎందుకు రావంటూ ప్రశ్నించారు. రెండు నిమిషాలు వచ్చిపో అంటూ ఫోన్ పెట్టేసిన తర్వాత వీహెచ్ తన సన్నిహితులు గడ్డమీది నరేందర్ యాదవ్, శ్రీను, లక్ష్మణ్ గౌడ్, కన్నయ్యలాల్‌ల సమక్షంలో చిరంజీవిని తిట్టిపోశారు. ఆయన వస్తే ఎంత.. రాకుంటే ఎంత అంటూ విరుచుకుపడ్డారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!