YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 5 September 2012

నేడు, రేపు ఫీజు దీక్ష

ఉదయం 10 గంటలకు ఇందిరాపార్కు వద్ద దీక్ష ప్రారంభం
ఫీజుల పథకాన్ని పరిమితులేమీ లేకుండా.. వైఎస్‌లాగా కొనసాగించాలని డిమాండ్
2011 ఫిబ్రవరిలో వారం పాటు 
ఇక్కడే ఫీజు దీక్ష చేసిన వైఎస్ జగన్.. ఒంగోలులోనూ ఒక రోజు నిరసన
ఇటీవల ఏలూరులో విజయమ్మ దీక్ష
అయినా మొద్దు నిద్ర వదలని సర్కారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: పేద, బడుగు వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే ఉదాత్తమైన ఆశయంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పోరుబాట పట్టారు. గురువారం ఆమె ఫీజు పోరు దీక్షను ప్రారంభించనున్నారు. గురు, శుక్రవారాలు రెండు రోజులపాటు చేపడుతున్న ఈ నిరాహార దీక్ష కోసం హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ (ఇందిరాపార్కు) వద్ద ఏర్పాట్లు పూర్తిచేశారు.

విజయమ్మ గురువారం ఉదయం 9.30 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు ధర్నా చౌక్‌కు చేరుకుని దీక్షలో కూర్చుంటారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎలాంటి పరిమితులు లేకుండా అర్హులైన పేదలందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వర్తింపజేయడంతో లక్షలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందారు. అలా ఆయన హయాంలో ఈ పథకం కింద లబ్ధి పొంది ఇంజనీరింగ్‌తో సహా పలు వృత్తి విద్యా కోర్సులను పూర్తి చేసుకున్న లక్షలాది మంది విద్యార్థులు ఉన్నతోద్యోగాల్లో చేరి తమ కుటుంబాలకు అండగా నిలబడ్డారు. 


ఇలాంటి బృహత్తరమైన పథకాన్ని ఎలాంటి పరిమితులు లేకుండా మునుపటి లాగే కొనసాగించాలన్న డిమాండ్ కోసం విజయమ్మ రెండు రోజుల దీక్షకు దిగనున్నారు. చదువును సామాజిక పెట్టుబడిగా భావిస్తూ వైఎస్ ప్రవేశపెట్టిన ఈ పథకం వెనుక ఉద్దేశాన్ని ఏమాత్రం గ్రహించలేకపోయిన ప్రభుత్వ పెద్దల కళ్లు తెరిపించి, ఈ పథకాన్ని ఎలాగైనా కాపాడుకోవాలన్న ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి 2011 ఫిబ్రవరి 18 నుంచి 24వ తేదీ వరకూ ఏడు రోజుల పాటు ఇదే ప్రదేశంలో నిరాహారదీక్షను చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఒంగోలులో ఈ ఏడాది జనవరి 4న కూడా విద్యార్థుల ఫీజుల సమస్యపైనే ఆయన ఒక రోజు ధర్నా చేశారు.

పోరు బాటలో విజయమ్మ

ఉప ఎన్నికల అనంతరం ప్రజలు తమపై మరింత బాధ్యతను ఉంచారని ప్రకటించిన విజయమ్మ అప్పటి నుంచి ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాటం చేస్తున్నారు. తాను జైల్లో ఉన్నప్పటికీ.. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయరాదని జగన్ చేసిన సూచనల మేరకు విజయమ్మ ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలకు నిరసనగా విజయవాడ ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయం వద్ద విజయమ్మ జూలై 17న ఒక రోజు మహాధర్నాలో పాల్గొన్నారు. నేతన్నలకు మద్దతుగా వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అదే నెల 23న ఆమె ధర్నా చేశారు. ఫీజులపై నెలకొన్న అనిశ్చిత పరిస్థితిని తొలగించాలని కోరుతూ ఏలూరులో ఆగస్టు 13, 14 తేదీల్లో రెండు రోజుల పాటు ఆమె దీక్ష చేశారు. అంతేకాక రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ఆమె పులివెందులలో జరిగిన మహాధర్నాలో కూడా పాల్గొన్నారు. 

ఏర్పాట్లు పూర్తి: ఫీజు పోరు దీక్షా శిబిరం ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర పార్టీ కార్యక్రమాల కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్ దీక్షా స్థలిలో మకాం వేసి ఏర్పాట్లను సమీక్షించారు. వేల మంది విద్యార్థులు, ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా వేదికను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!