YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 7 September 2012

పాలకుల నిర్లక్ష్యం రాష్ట్రంలో రైతుల పాలిట శాపం

'రైతు లేనిదే రాజ్యం లేదు. అన్నదాత కాడి కింద పడేస్తే దేశానికి అనర్థం తప్పదు. రైతే రాజు, రైతు దేశానికి వెన్నెముక, అన్నదాత,' అంటూ మన పాలకులు తరచూ ఊకదంపుడు ఉపన్యాసాలు గుప్పిస్తుంటారు. మరో అడుగు ముందుకేసి ‘కలకంఠి కంట కన్నీరొలికిన ఇల్లు - కర్షకుని కంట కన్నీరొలికిన దేశం సుభిక్షంగా మనజాలదని సందర్భం వచ్చినప్పుడల్లా ఉపమానాలతో వల్లెవేస్తూ ఉంటారు. మాటలతో పొద్దు పుచ్చటం వరకే! కానీ కర్షకుని కన్నీరు తుడిచే ప్రయత్నం మాత్రం పొరపాటున కూడా చేయరు.

నేటి పాలకుల నిర్లక్ష్యం రాష్ట్రంలో రైతుల పాలిట శాపంగా మారింది. అన్నపూర్ణగా పేరు తెచ్చుకున్న రాష్ట్రంలో ఇప్పుడు రైతులు అయ్యో రామచంద్ర అంటున్నారు. మూడేళ్లుగా రాష్ట్రం క్రాప్‌ హాలిడేకు చిరునామాగా మారిపోయింది. పాలకుల నిర్లక్ష్యంతో రాష్ట్రంలో వ్యవసాయమే ఇప్పుడు ప్రశ్నార్ధకమైంది. దాంతో రోడ్డున్న పడ్డ రైతన్న గొంతు చించుకుని అరిచినా అవి ఢిల్లీలోని కృషి భవన్‌కు వినపడటం లేదు. 

ప్రతికూల వాతావరణం కారణంగా వరుస నష్టాల్ని రైతులు భరించలేకపోతున్నారు. పంట పెట్టుబడులు సైతం చేతికి అందక గతేడాది 878 మండలాల్లో తీవ్రకరువు నెలకొని అన్నదాతలు ఆర్తనాదాలు చేశారు. రైతులను ఆదుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఎన్నోసార్లు దీక్ష చేశారు కూడా. అయినా ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ ప్రయోజనం శూన్యం.

వ్యవసాయానికి పెట్టుబడులు పెట్టలేక, పెట్టిన పెట్టుబడులు తిరిగిరాక, చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక రైతులు అల్లాడిపోతున్నారు. వానలు రాక, నీళ్లు లేక, దుక్కి తడవక, విత్తనాలు నాటక, నాటినా అవి మొలకెత్తక, మొలకెత్తినా అవి అంకురం దశలోనే మాడిపోయి రైతులు విలవిల్లాడిపోతున్నారు. భవిష్యత్తు తలచుకొని గుండె పగిలి చస్తున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో పురుగుల మందు తాగి పొలం గట్టునే ఒరిగిపోతున్నారు. 

ప్రభుత్వాలేమో మొసలి కన్నీరు కారుస్తూ రైతుల ఆత్మహత్యలకు పరిహారం ఏ పార్టీ ఎంతిచ్చిందో గొప్పలు చెప్పుకుంటున్నారు. తెచ్చిన అప్పులకు వడ్దీలు, అసలు కట్టలేక ఉరి పోసుకుంటున్నారు. ఈ పరిస్థితి ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దాదాపుగా దేశం మొత్తం ఇరవై సంవత్సరాలుగా, ఇంకా బాగా చెప్పాలంటే ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన అనంతరం దేశ రైతు దుస్థితి ఇదే ! 

రైతే రాజు, రైతు దేశానికి వెన్నెముక, అన్నదాత, రైతులేనిదే రాజ్యం లేదు అంటూ పొగడ్తలకు తక్కువేమీ లేవు. కానీ దేశానికి అన్నం పెడుతున్న రైతులు మాత్రం పిట్టల్లా రాలిపోయారు. ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ప్రభుత్వమూ రైతుల గురించే మాట్లాడుతున్నారు. 

ఎన్నికల ప్రణాళికల్లో వాగ్దానాలు, హామీల వర్షాలు కుండపోతగా కురుస్తాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఇప్పుడు రైతుల దుస్థితిపై రైతు పోరుబాట యాత్రలు చేస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏకంగా అవిశ్వాస తీర్మానాన్నే ప్రవేశపెట్టాడు. ప్రతీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నపుడు రైతు సమస్యల పై కన్నీరు కార్చేవారే.

గత ఏడాది ఖరీఫ్‌, రబీ సీజన్‌లు కలుపుకుని 35 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతింది. రాష్ట్రవ్యాప్తంగా కోటి 20 లక్షల రైతు కుటుంబాలు ఉండగా...అందులో 80 శాతం చిన్న, సన్నకారు రైతులే. కష్టాల నుంచి గట్టెక్కుతామనే నమ్మకం రైతులకు లేకపోవడంతో ఈ ఏడాది ఖరీఫ్‌ విస్తీర్ణం 2.5 లక్షల హెక్టార్లకు తగ్గిపోయింది. ఇటీవలి సంవత్సరాల్లో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులేర్పడ్డాయి. ఇప్పటికే 878 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. అంటే నాలుగింట మూడు వంతులకు పైగా రాష్ట్రం కరువు బారిన పడినట్లే. 

ఈ నేపథ్యంలో రైతులు వ్యవసాయం మానుకునే రోజులు ఎంతోదూరంలో లేవు. మన ప్రభుత్వాల వ్యవసాయ విధానాలే రైతుల ఉసురు తీసుకుంటున్నాయి. రైతు కూలీలు భారమైన తమ బతుకు బండిని లాగలేక పోతున్నారు. శాసనసభలో కరువుపై చర్చ జరిగినప్పుడు కేవలం 65 మంది సభ్యులు మాత్రమే ఉన్నారంటే సేద్యం పట్ల నేతల శ్రద్ధ ఏపాటిదో అర్థం అవుతోంది

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!