YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 4 September 2012

స్థానిక సంస్థల ఎన్నికలు ముందు రిజర్వేషన్లు ఖరారు చేయాలన్న హైకోర్టు

అనంతరం 3 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశం
రిజర్వేషన్ల ఖరారుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేమంటున్న అధికారులు
ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలకు సర్కారు వెనుకంజ
బీసీలకు రిజర్వేషన్లు తగ్గడంపైనా మల్లగుల్లాలు
హైకోర్టు తీర్పునే అనుకూలంగా మలచుకునే అవకాశం
రిజర్వేషన్ల ఖరారుకు గడువు విధించని హైకోర్టు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రభుత్వం పంచాయతీరాజ్ ఎన్నికలు సమీప భవిష్యత్‌లో నిర్వహించే అవకాశమే కనిపించడం లేదు. ఎన్నికలకు వెనుకంజ వేస్తున్న ప్రభుత్వం హైకోర్టు తీర్పును తమకు అనుకూలంగా మార్చుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వెనుకబాటుతనంపై అధ్యయనానంతరం.. రిజర్వేషన్లు ఖరారు చేసి అప్పటినుంచి మూడు మాసాల లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అయితే రిజర్వేషన్ల ఖరారుకు ఎలాంటి గడువు విధించని నేపథ్యంలో.. ఈ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు ముగుస్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. రిజర్వేషన్ల ఖరారుకు ఎంత సమయం పడుతుందో కచ్చితంగా చెప్పలేమని, అందువల్ల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తామన్నది చెప్పడం కూడా సాధ్యం కాదని అధికారవర్గాలంటున్నాయి. 

బీసీ జనాభా గణన, ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ, వాటిని పరిశీలించి రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో పాటు ఆ తరువాత మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించడంతో.. అసలు రిజర్వేషన్ల ఖరారులోనే ప్రభుత్వం జాప్యం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గడువు నిర్ధారించనప్పటికీ అవసరమైతే.. రిజర్వేషన్ల ఖరారుకు మరింత సమయం కావాలని ప్రభుత్వం హైకోర్టును తరువాత కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎన్నికలు నిర్వహించాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి నిజంగా ఉంటే రెండునెలల్లోగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి, ఆ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించడానికి అవకాశం ఉంది. ఇందుకు తాము సుముఖంగా ఉన్నా.. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సర్కారే సుముఖంగా లేదని అధికారులంటున్నారు. హైకోర్టు తీర్పువల్ల బీసీల రిజర్వేషన్లు ఏకంగా పదిన్నర శాతం తగ్గుతున్న నేపథ్యంలో ఆ వర్గంతో వైరం ఎందుకు కొని తెచ్చుకోవాలనే అభిప్రాయంతోనూ రిజర్వేషన్ల ఖరారును జాప్యం చేసే అవకాశం ఉందని ఉన్నతస్థాయివర్గాలు తెలిపాయి. రిజర్వేషన్లను నిర్ణీత వ్యవధిలోగా పూర్తిచేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఎలాంటి గడువు విధించకపోవడాన్ని గుర్తు చేస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను సర్కారు ఆలస్యం చేస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం బీసీలకు 34%, ఎస్సీలకు 18.30%, ఎస్టీలకు 8.25% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రాజ్యాంగం మేరకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. 

10.55 శాతం తగ్గనున్న బీసీల రిజర్వేషన్లు

హైకోర్టు తీర్పు నేపథ్యంలో బీసీల రిజర్వేషన్లు 34% నుంచి 23.45 శాతానికి తగ్గనున్నాయి. 10.55% తగ్గించడం వల్ల రెండు జడ్పీ చైర్‌పర్సన్, 115 ఎంపీపీ చైర్‌పర్సన్ స్థానాలను బీసీలు కోల్పోవాల్సి వస్తుంది. హైకోర్టు తీర్పుతో రిజర్వేషన్లు తగ్గించకుండా ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. అయితే రిజర్వేషన్ల తగ్గింపుపై బీసీ సంఘాలు అప్పుడే ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతున్నాయి. రిజర్వేషన్లు తగ్గించి ఎన్నికలు నిర్వహించాలని చూస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని హెచ్చరిస్తున్నాయి. 

కాగా పంచాయతీరాజ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీపీ, జడ్పీ చైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లు రాష్ట్రం యూనిట్, పంచాయతీ సభ్యులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల రిజర్వేషన్లు జిల్లా యూనిట్‌గా ఖరారు చేస్తామని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. ఇదిలావుండగా ఇప్పటివరకు జనాభా ప్రాతిపదికన రాష్ట్రం యూనిట్‌గా తీసుకుని ఎస్టీల రిజర్వేషన్లు ఖరారు చేసేవారు. కానీ ఇకపై షెడ్యూల్ ప్రాంతంలోని పంచాయతీలు, మండలాల అధ్యక్ష పదవులు జనాభాతో సంబంధం లేకుండా పూర్తిగా ఎస్టీలకు రిజర్వ్ చేయనున్నారు. షెడ్యూలేతర ప్రాంతాల్లో ఎస్టీల జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. 

తద్వారా ఎస్టీలకు స్వల్పంగా రిజర్వేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సర్పంచుల రిజర్వేషన్లు ఇంతకు ముందు జిల్లా యూనిట్‌గా అమలు చేసేవారు. కానీ ఇకపై రాష్ట్ర యూనిట్‌గా అమలు చేయనున్నారు. కర్ణాటకలో స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు 50% దాటకుండా ఎన్నికలు నిర్వహించాల్సినప్పుడు..ఆయా జిల్లాల్లోని జనాభా ఆధారంగా ఎన్నికలు నిర్వహించారు. ఒక జిల్లాలో బీసీలకు 40% వరకు రిజర్వేషన్లు అమలైతే.. ఎస్సీలకు 7%, ఎస్టీలకు 3% రిజర్వేషన్లు కల్పించారు. ఇలా రిజర్వేషన్లు యాభై శాతం దాటకుండా జాగ్రత్తపడ్డారు. ఇదే విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయడం మినహా మరో మార్గం లేదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటివరకు రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉన్నందున ఎన్నికలు నిర్వహించలేకపోతున్నామని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అయితే ఇప్పుడు స్పష్టమైన తీర్పు ఇచ్చిన దరిమిలా ప్రభుత్వం ఈ వ్యవహారంలో ఎలా వ్యవహరిస్తుందో వేచిచూడాలి. హైకోర్టు తీర్పును గౌరవిస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానారెడ్డి చెప్పారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!