YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 4 September 2012

రైతన్నకు మరో ఉరితాడు

రైతన్న కోసం ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఉరితాళ్లు చాలవన్నట్టుగా ఇప్పుడు యూరియా ‘కొరత’ విపత్తు వచ్చిపడింది. ఎరువుల కొరత లేదుగాక లేదంటూ అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఏలికలు నమ్మబలుకుతూనే ఉన్నారు. రైతులు ఎరువుల కొరతను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఉత్తరాంధ్రను జూన్ మొదటి వారంలోనే పలకరించే నైరుతి రుతువపనాల ఆగమనంతో రాష్ట్రంలో ఖరీఫ్ సీజను ప్రారంభం కావడం మనకు రివాజు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో ఉధృతమయ్యే రుతుపనాలతో పంటలు ఏపుగా ఎదిగి, రైతుల చెమట చుక్కలు బంగారు రాశులుగా మారుతాయి. జలాశయాలు, భూగర్భజలాలు జీవం నింపుకొని రబీకి స్వాగతం పలుకుతాయి. నేడు రాష్ట్రప్రభుత్వం పేరిట అస్తిత్వంలో ఉన్న వింత రాజకీయ జీవికి ఈ విషయాలేవీ పట్టినట్టు లేదు. 

లేకపోతే తొలకరికి ముందే సిద్ధం చేయాల్సిన ఎరువులకు సెప్టెంబర్‌లో కొరతేమిటి? యూరియా కోసం రైతుల తొక్కిసలాటలు, ఆందోళనలు ఏమిటి? ఈ వైపరీత్యానికి ఇప్పటికే ఓ రైతు గుండె, మరో రైతు తల పగిలాయి. ఇంకెలాంటి దుర్వార్తలను వినాల్సివస్తుందోనని భయపడాల్సి వస్తోంది. గత మూడేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కన్నెర్ర చేయడంతో రైతాంగం చావలేక బతకలేక బతుకుబండిని ఈడ్చుకువస్తోంది. వెన్ను విరిగిన రైతు మీద ఈ ఏడాది మిన్ను కూడా విరుచుకుపడింది. కనిపించినట్టే కనిపించి మొహం చాటేసిన నైరుతి... వాతావరణ శాస్త్రవేత్తలకు సైతం అంతుబట్టకుండా దోబూచులాడింది. దీంతో రాష్ట్రంలో ఖరీఫ్ విసీర్ణం గణనీయంగా కుంచించుకుపోయింది. ధైర్యంచేసి నాట్లేసిన రైతుల గుండెలు పగులుతుండగా ఆగస్టులో వరుణుడు దయదలచి తిరిగి ఆశలను చిగురింపజేశాడు. వర్షాధార ప్రాంతాలలోనేగాక కృష్ణాడెల్టా వంటి చోట్ల సైతం రైతాంగం రెండు నెలలు ఆలస్యంగానే అయినా నిబ్బరంగా ఖరీఫ్ సాగుకు ఉపక్రమించారు. వాతావరణ శాఖే తన అంచనాలను నమ్మలేని ఈ రోజుల్లో సెప్టెంబర్‌లో పుష్కలంగా వానలు కురుస్తాయన్న వార్తను నమ్మి సంబరపడుతున్నారు. రైతన్న మొహం మీద విరిసిన ఆ సన్నటి ఆశా రేఖను చూసి కళ్లు కుట్టాయన్నట్టుగా ‘యూరియా’ పామై కాటందుకుంటానంటోంది. 

ఈ ఏడాది నిజానికి ఎరువులకు కొరత ఉండాల్సిన పనేలేదు. ప్రపంచ వ్యాప్తంగానే ‘ఎలినో’ ప్రభావంతో వర్షపాతం, పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గాయి. ఫలితంగా గిరాకీ తగ్గి అంతర్జాతీయ మార్కెట్లో డీఏపీ, పొటాష్, యూరియా ధరలు జూలై నాటికే 20 శాతానికి పైగా తగ్గాయి. ఎరువుల నిల్వలు గిరాకీని మించిపోయి ఉన్నాయి. రైతన్నల ఉసురులు పోతున్నా పట్టని బధిరాంధ పాలకులు ఫెర్టిలైజర్ కంపెనీలు, దిగుమతిదారులు, పంపిణీదారుల రాబోయే కష్టాలను ముందుగానే ఊహించి మరీ పట్టించుకున్నట్టుంది. గత ఏడాది రెండింతలకు పైగా పెరిగిన రసాయనిక ఎరువుల ధరలను ఈ ఖరీఫ్‌కు ముందే మళ్లీ పెంచారు. దీంతో డీఏపీ ధర బస్తా రూ.1,260కి, పొటాష్ ధర రూ.834కి, కాంప్లెక్స్ ఎరువుల ధర రూ.1,297కి పెరిగాయి. యూరియా ధర రూ.281కి పెరిగింది. ఎరువుల సబ్సిడీలను పూర్తిగా ఉపసంహరించాలన్న దృఢ సంకల్పంతో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఒక్క యూరియాపై తప్ప మిగతా ఎరువులపై సబ్సిడీకి మంగళం పాడేసింది. దీంతో భూసారాన్ని నశింపజేసే ప్రమాదం ఉందని తెలిసినా, రైతాంగం డీఏపీ లాంటి ఎరువులకు బదులుగా యూరియానే ఎక్కువగా వాడుతోంది. ఏమైతేనేం, నేటి కృత్రిమ కొరత పుణ్యమా అని బ్లాక్ మార్కెట్‌లో యూరియా ధరకు రెక్కలొచ్చాయి. రాష్ట్రంలో బస్తా ధర రూ.350 వరకు పలుకుతుంటే, రాష్ట్రం దాటించేస్తే ఇంకా ‘మంచి’ ధర పలుకుతోంది. యూరియా ఒక్కటే కాదు అన్ని ఎరువుల ధరలు గరిష్ట రిటైలు ధరల కంటే ఎక్కువకే అమ్ముతున్నారనేది బహిరంగ రహస్యం.

అలాంటి సమస్యలను పట్టించుకునే తీరుబడి మన రాష్ట్రప్రభుత్వానికి లేదు. సహజంగానే రైతాంగం కృత్రిమ కొరతను సృష్టించి లాభాలు పిండుకుంటున్నారని వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే ఈ వ్యవహారంలో అతి కీలకమైన అంశం మరొకటుంది. అది, కేంద్రం మన రాష్ట్రంపట్ల అనుసరిస్తున్న వివక్ష . ఖరీఫ్ కోసం రాష్ట్రప్రభుత్వం కోరింది 43.50 లక్షల టన్నుల ఎరువులయితే 41.55 లక్షల టన్నులతో సరిపుచ్చింది. సబ్సిడీకి లభించే యూరియా కోటాలోనే లక్ష టన్నుల మేరకు కోత విధించింది. ఖరీఫ్ కోసం మనకు 16.50 లక్షల టన్నుల యూరియాను కేటాయించగా అందులో ఇంకా 5 లక్షల టన్నులు అందనే లేదు. 

యూరియా కృత్రిమ కొరత పాపానికి అసలు సూత్రధారులు... ఎరువుల కంపెనీలు, దిగుమతిదారులు, పంపిణీదారులే. అంతకన్నా ముఖ్యంగా పిల్లి పాలు తాగుతుంటే కళ్లు మూసుకుని చూసే ఔదార్యాన్ని కనబరుస్తున్న కేంద్రంలోని పెద్దలే. తిలాపాపం తలాపిడికెడు అన్నటుగా ఇందులో మన రాష్ట్ర సర్కారు వారి నిర్వాకమూ తక్కువేమీ కాదు. అతి తరచుగా హస్తినకు వెళ్లివచ్చే మన రిమోట్ ముఖ్యమంత్రిగారు తమ సొంత కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర అవసరాలకు తగినంత ఎరువుల కోటాను ఎలాగూ సంపాదించలేకపోయారు.

కనీసం ఇస్తామన్న ఎరువులైనా సకాలంలో అందేలా చూడలేదు. అసలు అలాంటి విషయాలేవీ ఆయనకు పడుతున్న దాఖలాలే లేవు. అందుకేనేమో... కొరత లేనేలేదంటూ ఆయన సహచర సచివులు అదేపనిగా బుకాయిస్తున్నారు. యూరియా కోసం బారులుతీరి, తొక్కిసలాడుతున్న అన్నదాత గుండెల్లో పరుగులు తీస్తున్న ైరె ళ్ల చప్పుడు వారి చెవులకు వినిపించడం లేదు. అదను మీద అన్నదాతకు విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, రుణాలు, విద్యుత్తు అందించలేకపోతే వ్యవసాయంతోపాటూ, ఇప్పటికే ఈసురోమంటున్న ఆర్థికవ్యవస్థకు సైతం పట్టేది అథోగతేనన్న కనువిప్పు పాలకులకు ఎప్పుడు కలిగేనో ఏమో? విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల కొరతను సృష్టించి, నల్లబజారుకు తరలించే విషసర్పాలపైకి లేవలేని సర్కారువారి లాఠీ అన్నదాతపైకి లేవడానికి సదా సిద్ధంగా ఉంటోంది. ఈ మేర సర్కారువారి ‘సంసిద్ధత’ను ఇప్పుడు కళ్లారా మనం చూస్తున్నాం.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!