YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 8 September 2012

ఆ కథనాలు ‘పీటీఐ’ విశ్వసనీయతనే దెబ్బతీస్తాయి: వైఎస్సార్ కాంగ్రెస్

ఆ సంస్థ మా ఖండనను ఎందుకు ప్రకటించడంలేదు?
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవలాంటిది
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ కూడా
అందులో విలీనం కావాల్సిన ఖర్మ మాకు పట్టలేదు
వైఎస్సార్ కాంగ్రెస్‌ను దెబ్బకొట్టడానికి జరుగుతున్న 
కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు
బాబూ అవిశ్వాసం పెట్టు.. ఎవరు కుమ్మక్కయ్యారో తేలిపోతుంది

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో మునిగిపోతున్న పడవలాంటి కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాల్సిన ఖర్మ తమకు పట్టలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉంటాం తప్ప ఎట్టి పరిస్థితిలోనూ విలీనమయ్యే ప్రసక్తే ఉండదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ విలీనమయ్యే అవకాశముందన్నట్లుగా పీటీఐ వార్తా సంస్థ ఇచ్చిన కథనం అవాస్తవమని పేర్కొంటూ తాము ఆ సంస్థకు పంపిన ఖండనను ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన అధికార ప్రతినిధులు వాసిరెడ్డి పద్మ, హెచ్.ఎ.రెహమాన్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రజా సమస్యలపై విస్తృతంగా పోరాడుతూ ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్న ప్రతీసారి వైఎస్సార్ కాంగ్రెస్‌ను దెబ్బకొట్టడానికి కుట్రలు జరుగుతున్నాయి. 

జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలన్నింటినీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ఆయన్ను అక్రమంగా బంధించినప్పటికీ ప్రజా పార్టీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ నిరంతరం ప్రజల మధ్యే ఉంది, ఉంటుంది. మా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా రాత్రి, పగలును లెక్కచేయకుండా ప్రజాసమస్యలపై పోరాడుతూ భర్త, కొడుకు బాటలో నడుస్తున్నారు. ఇంతగా పోరాడుతున్నా మాకు కాంగ్రెస్‌లో విలీనం కావాల్సిన దుస్థితి పట్టలేదు’’ అని స్పష్టం చేశారు.

‘ఫీజు దీక్ష’కు లభిస్తున్న మద్దతును ఓర్వలేకే: పేద విద్యార్థుల కోసం శాచ్యురేషన్ పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు విజయమ్మ చేసిన ఫీజు దీక్షకు పెద్ద ఎత్తున మద్దతు లభించేసరికి ఓర్వలేక కొన్ని దుష్టశక్తులు బురదచల్లుతున్నాయని గోవర్ధన్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో తమపట్ల కొన్ని పత్రికలు, చానళ్లు చాలాకాలంగా పనిగట్టుకొని వ్యతిరేకంగా పనిచేస్తున్నా.. ప్రజలు ఏనాడూ వాటిని నమ్మలేదని గుర్తుచేశారు. 

పీటీఐ లాంటి సంస్థ కూడా విజయమ్మ ఇంటర్వ్యూకు వక్రభాష్యం చెప్పడం దురదృష్టకరమని, అందులో ఉన్న కొందరు కోవర్టుల వల్లే ఈవిధమైన కథనం వచ్చి ఉంటుందేమోనని సందేహం వ్యక్తం చేశారు. ఇలాంటి కథనాల వల్ల ఆ సంస్థకున్న విశ్వసనీయత దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. ‘తండ్రి ఆశయం కోసం జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వదిలి బయటకొచ్చి పార్టీ స్థాపించినప్పటినుంచి ఎక్కడా కూడా వెనక్కితగ్గకుండా ప్రజాసమస్యలపై ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ తన బాధ్యతను నిర్వర్తించకపోగా జగన్‌ను ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపైనే దృష్టిపెడుతోంది. కడప, పులివెందుల ఉప ఎన్నికల సమయంలో కూడా జగన్ బీజేపీలో కలిసిపోతున్నారంటూ దుష్ర్పచారం చేసింది. వారి అనుకూల మీడియా దాన్ని విస్తృతంగా ప్రచారం చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, జగన్‌మోహన్‌రెడ్డిని అపఖ్యాతి పాలుచేసేందుకు చంద్రబాబు నిరంతరం కుట్రలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో విలీనమవుతుందంటూ గోబెల్స్ ప్రచారం చేసినప్పటికీ ప్రజలు అవేవీ నమ్మలేదు. మా పార్టీ చిత్తశుద్ధిని గమనించి మా అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించారు. ఇవన్నీ జరిగాక కాంగ్రెస్‌లో మేం ఎందుకు కలుస్తాం’’ అని అన్నారు. 

చంద్రబాబు అవిశ్వాసం పెట్టు: కాంగ్రెస్‌తో ఎవరు కుమ్మక్కు అయ్యారో తేలాలంటే రానున్న శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని టీడీపీకి ఈ సందర్భంగా గోవర్ధన్ సవాల్ విసిరారు. విద్యార్థుల ఫీజు సమస్య, కరెంటు తీవ్రత పట్ల చంద్రబాబు ఉత్తి ప్రసంగాలను కట్టిపెట్టి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని సూచించారు. అప్పుడు ఎవరేంటో అసలు స్వరూపం బయటపడుతుందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ నేతలతో అవగాహన కుదుర్చుకున్నారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. అందుకే అప్పటి నుంచి బాబు విక్టరీ సింబల్‌కు బదులుగా ప్రజలకు హస్తం చూపిస్తున్నారని విమర్శించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!