"...ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులలో నేను ఇది చేశాను. మళ్లీ అధికారం అప్పగిస్తే పరిస్థితిని ఫలానా విధంగా చక్కదిద్దగలను'' అని చెప్పవలసింది పోయి ఇష్టానుసారం హామీలు ఇవ్వడం వల్ల ప్రత్యర్థులు తనను పిట్టల దొరతో పోల్చే అవకాశం చంద్రబాబు ఇస్తున్నారు. తెలుగుదేశం సీనియర్ నాయకులు కొందరు వాస్తవాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లకుండా తాళం వేస్తున్నారు. నిర్మొహమాటంగా చెప్పాలనుకుంటున్నవారికి చంద్రబాబు అవకాశం ఇవ్వడం లేదు. దీంతో లోపాలను, తప్పులను సరిదిద్దుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు...''
"...సిగ్నల్స్ పేరిట పోరాటాలకు స్వస్తి చెప్పిన కె.సి.ఆర్. పట్ల సగటు తెలంగాణవాదుల్లో నమ్మకం సడలిన నేపథ్యంలో, రాజకీయ జె.ఎ.సి.తో జత కట్టడానికి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధపడుతోంది. తెలుగుదేశం-సి.పి.ఐ. రాజకీయ జె.ఎ.సి.తో జతకట్టి తెలంగాణ రాష్ట్ర సమితిని పక్కకు నెట్టే అవకాశాలు లేకపోలేదు...''
తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఏమిటి? ఆ పార్టీ శ్రేణులనే కాదు- పార్టీ అధినేతను కూడా వేధిస్తున్న ప్రశ్న ఇది! రాజశేఖర్ రెడ్డి మరణానంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష స్థానంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పుంజుకోవలసింది పోయి క్షీణించడం మొదలైంది.
జైలు పాలైనప్పటికీ, యువతతో పాటు కింది స్థాయి జనంలో జగన్ పట్ల క్రేజ్ ఏర్పడింది. దీంతో 2014 ఎన్నికలలో అధికారంలోకి రావడానికి గల అన్ని అవకాశాలనూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పరిశీలించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తన సహజ సిద్ధమైన స్వభావానికి భిన్నంగా వివాదాస్పద అంశాలపై స్పష్టత ప్రదర్శించడం ద్వారా కొన్ని వర్గాల ప్రజలనైనా దరి చేర్చుకోవాలన్న నిర్ణయానికి ఆయన వచ్చారు. ఎస్.సి. వర్గీకరణ విషయంలో గానీ, తెలంగాణ విషయంలో గానీ పార్టీ వైఖరిని స్పష్టంచేయడం ఇందులో భాగమే! అదే సమయంలో పార్టీకి మొదటి నుంచీ ఆయువుపట్టుగా ఉన్న బి.సి.లను తిరిగి దరిచేర్చుకోవడానికై ఆ వర్గాలను ఆకర్షించే పనిలో చంద్రబాబు పడ్డారు.
ఇంతటితో ఆగకుండా అక్టోబర్ రెండవ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 26వ తేదీ వరకు సుదీర్ఘంగా పాదయాత్ర చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. అయితే చంద్రబాబు తీసుకున్న, తీసుకోబోయే నిర్ణయాలు, చేపట్టనున్న పాదయాత్ర ఆయనను తిరిగి అధికారంలోకి తీసుకువస్తాయా? అన్న ప్రశ్న ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ శ్రేణులలోనే కాకుండా రాజకీయ వర్గాలలో కూడా నలుగుతోంది.
"చంద్రబాబు అధికారంలోకి వస్తే బాగానే ఉంటుంది- కానీ ప్రజలు ఆయనను విశ్వసించడం లేదే!'' అని పెదవి విరిచేవారి సంఖ్యా ఎక్కువగానే ఉంది. వాస్తవం కూడా ఇదే!
ప్రజల్లో ఆయన విశ్వసనీయత కోల్పోవడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నలకు ముందుగా సమాధానం లభించవలసి ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మరో విధంగా చంద్రబాబు వ్యవహరించడాన్ని ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఒడిసిపట్టుకుని చంద్రబాబు విశ్వసనీయతను దెబ్బతీయడంలో విజయం సాధించారు.
ఒక నాయకుడిగా స్థిర నిర్ణయాలు తీసుకోవలసిన చంద్రబాబు, పరిస్థితులను బట్టి గాలివాటుగా వ్యవహరించడం ఆయనకు అంతులేని నష్టాన్ని తెచ్చిపెట్టింది. ప్రతిపక్షంలో ఉన్న ఈ ఎనిమిదిన్నరేళ్ల కాలంలో ఆయన చేసిన వాగ్దానాలకు అంతే లేదు. తొమ్మిదేళ్లపాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి రాష్ట్ర స్థితిగతులు, ఆర్థిక పరిస్థితిపై పూర్తి అవగాహన ఉండి తీరాలి. అయితే చంద్రబాబు ఇందుకు భిన్నంగా ఆచరణ సాధ్యంకాని హామీలు కూడా ఇవ్వడం ప్రారంభించారు. ప్రజల అవసరాలను గుర్తించి వాటిని తీర్చితే గుర్తుపెట్టుకుంటారు గానీ, ఏది పడితే అది వాగ్దానం చేయడం వల్ల అసలుకే మోసం వస్తోంది.
2004 ఎన్నికలకు ముందు వరుసగా ఆరేళ్ల పాటు రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నందున రైతాంగాన్ని ఆకర్షించడానికి ఉచిత విద్యుత్ పథకాన్ని రాజశేఖర్ రెడ్డి అప్పుడు ప్రకటించి ప్రయోజనం పొందారు. ఇనుమును కొలిమిలో కాల్చిన తర్వాత సుత్తితో కొడితే వంగుతుంది. అలాగే ప్రజలకు నిజంగా ఏది అవసరమో గుర్తించి వాటిని తీర్చడమే రాజకీయ నాయకులు చేయవలసిన పని. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. దీంతో ఆయన మాటలకు విలువ లేకుండా పోయింది. అధికారానికి దూరంగా ఉన్నవాళ్లు ఏమి మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది.
తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా మాట్లాడటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
ఇప్పుడున్న పరిస్థితులలో రైతులకు ఏడు గంటలపాటు ఉచిత విద్యుత్ సరఫరా చేయడమే గొప్ప. అలాంటిది తాను ఏమి చేశానో గుర్తుచేయకుండా, రైతులు కోరకపోయినా మళ్లీ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి తొమ్మిది గంటలపాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తానని చంద్రబాబు హామీ ఇస్తున్నారు. ఇలాంటి ప్రకటనలే ఆయన కొంప ముంచుతున్నాయి. "ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులలో నేను ఇది చేశాను. మళ్లీ అధికారం అప్పగిస్తే పరిస్థితిని ఫలానా విధంగా చక్కదిద్దగలను'' అని చెప్పవలసింది పోయి ఇష్టానుసారం హామీలు ఇవ్వడం వల్ల ప్రత్యర్థులు తనను పిట్టల దొరతో పోల్చే అవకాశం చంద్రబాబు ఇస్తున్నారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కొందరు వాస్తవాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లకుండా తాళం వేస్తున్నారు. పరిస్థితులను నిర్మొహమాటంగా చెప్పాలనుకుంటున్నవారికి చంద్రబాబు అవకాశం ఇవ్వడం లేదు. దీంతో లోపాలను, తప్పులను సరిదిద్దుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఫలితంగా ఆయన ఏమి చేసినా కలసి రావడం లేదు. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా అధికారంలోకి రావాలని కోరుకోవడంలో తప్పు లేదు. రాజకీయాలలో ఉన్నవారు ఎవరైనా అధికారంలోకి రావాలనే కోరుకుంటారు. అయితే అందుకు తగిన రోడ్ మ్యాప్‌ను పకడ్బందీగా రూపొందించుకోవలసి ఉంటుంది. ప్రస్తుతం చంద్రబాబు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య విశ్వసనీయత.
ప్రజలు ఆయనను నమ్మకపోవడం! ఈ సమస్యను అధిగమించడానికి ఏమి చేయాలన్న దానిపై ముందుగా స్పష్టత ఏర్పరచుకోకుండా చంద్రబాబు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టినప్పటికీ ఉపయోగం ఉంటుందా? అన్న సందేహం సహజంగానే కలుగుతుంది. విషయాన్ని వివరించి చెప్పడంలో చంద్రబాబు పూర్! ప్రజలను ఆకట్టుకునే విధంగా ఆయన భాష గానీ, ఉపన్యాసం తీరు గానీ ఉండవు. హావభావాలు కూడా అలాగే ఉంటాయి. మనుషులతో స్వేచ్ఛగా, కలివిడిగా ఆయన కలిసిపోలేరు. 30 ఏళ్లుగా చంద్రబాబు ఉపన్యాసాలు విన్నవారికి ఆయన సహజంగానే బోర్ కొడతారు. తెలుగుదేశం పార్టీకి బలం, బలహీనత కూడా చంద్రబాబునాయుడే! అటు కాంగ్రెస్, ఇటు జగన్ పార్టీ అంటే ఇష్టంలేని వాళ్లు రాష్ట్రంలో ఉన్నారు. అయితే వారిలో కూడా చంద్రబాబు పట్ల నమ్మకం కుదరడం లేదు.
సామాన్య జనంతో కలిసిపోయి, వారిని ఆకట్టుకునేలా మాట్లాడటం చంద్రబాబుకు ఇంతవరకు అలవాటు కాలేదు.
అక్కడిదాకా ఎందుకు- ప్రజల్లోకి వెళ్లినప్పుడు దగ్గరకు వచ్చిన వారిపై చనువుగా భుజంపై చేయి వేయడానికి కూడా ఆయన సిద్ధపడరు. ఇక్కడ ఒక విషయం గుర్తుచేయవలసి ఉంది. 2004 ఎన్నికలకు ముందు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన చంద్రబాబు వారి సమస్యలు ప్రస్తావించి పరిష్కరిస్తానని చెప్పవలసిందిపోయి, సత్యం కంపెనీ రామలింగరాజు తరహాలో 'మీరు కూడా పైకి రావాలి, డబ్బు సంపాదించాలి' అని చెబుతుండేవారు. అర్ధాకలితో, తాగునీరు, సాగునీటి సమస్యలతో అల్లాడుతున్న ప్రజల వద్ద ప్రస్తావించవలసిన అంశలేనా అవి? సందర్భ శుద్ధి లేకుండా మాట్లాడటం కూడా చంద్రబాబుకు ఉన్న మైనస్ పాయింట్లలో ఒకటి.
అదే సమయంలో గ్రామీణ ప్రజలతో మమేకం అవ్వడం ఎలాగో నేర్చుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా తన విశ్వసనీయతను పెంపొందించుకునే విధంగా హుందాగా వ్యవహరించాలి. తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిగా అధికారంలోకి వస్తే ఏమి చేయగలనో, ఏమి చేయలేనో స్పష్టంగా చెప్పగలగాలి. జగన్మోహన్ రెడ్డిని కాదని తనకు ఎందుకు పట్టం కట్టాలో ప్రజలకు అర్థమయ్యేట్టు వివరించగలగాలి. ఈ మార్పులకు సిద్ధపడకుండా నాలుగు నెలలు కాదు; ఆరు నెలలపాటు పాదయాత్ర చేసినా ఫలితం ఉండదు.
ఈ ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకోలేని పక్షంలో ఆయన రాజకీయ జీవితమే కాదు- తెలుగుదేశం పార్టీనే నమ్ముకుని ఉన్న ఎంతో మంది రాజకీయ జీవితం వైఫల్యంతో ముగుస్తుంది. 2004 ఎన్నికలకు ముందు రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్రతో చంద్రబాబు పాదయాత్రను సహజంగానే పోల్చుకుంటారు కనుక తాను తీసుకోవలసిన జాగ్రత్తలపై స్పష్టతతో ముందుకు వెళ్లడం చంద్రబాబుకు, ఆయన పార్టీకి మంచిది. తన స్వభావాన్ని, ఆంగికాన్ని మార్చుకోకుండా బి.సి. డిక్లరేషన్ ప్రకటించినా, తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా, మరో డిక్లరేషన్ ప్రకటించినా ఆశించిన ఫలితం రాదన్న వాస్తవాన్ని చంద్రబాబు దృష్టిలో పెట్టుకోవాలి.
పథకాల ప్రకటనలో పోటీపడే బదులు వాటి సాధ్యాసాధ్యాలను ప్రజలకు వివరించడం అవసరం.
వచ్చే ఎన్నికలలో మెదక్ జిల్లా నుంచి శాసనసభకు పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్న ఒక నాయకుడిని ఉద్దేశించి "ఆరు నెలల తరువాత టి.ఆర్.ఎస్. ఉంటుందో లేదో తెలియదు. అందువల్ల త్వరలో జరగబోయే ఎం.ఎల్.సి. ఎన్నికలకు పోటీ చేయడం మంచిది'' అని కె.సి.ఆర్. కుటుంబ సభ్యులు ఒకరు సూచించినట్టు ప్రస్తుతం ప్రచారంలో ఉంది. ఇక టి.ఆర్.ఎస్.ను కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి కె.సి.ఆర్. కూడా తహతహలాడుతున్నందున, అదే జరిగితే తమ రాజకీయ అవకాశాలు దెబ్బతింటాయని భావిస్తున్న టి.ఆర్.ఎస్. నాయకులు కొందరు తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకులతో సంప్రదింపులు ప్రారంభించారు.
రెండు నెలల క్రితం సీమాంధ్రలో జరిగిన ఉప ఎన్నికలలో ఒక్క స్థానం కూడా గెలవలేకపోవడంతో తెలంగాణలోనైనా అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది.
. "కొందరిని కొంత కాలమే మోసగించగలం. అందరినీ అన్ని వేళలా మోసగించలేం''
No comments:
Post a Comment