‘దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేద విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం యథాతథంగా కొనసాగించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ధర్నా చేయడం సంతోషం... అయితే ఈ పథకం ఒక్కటే కాదు, ప్రజా సంక్షేమం కోసం ప్రారంభించిన ఆరోగ్యశ్రీ, 108, పెన్షన్ల పథకాలన్నీ వైఎస్‌వేనని చంద్రబాబు తొలుత అంగీకరించాలి... సమాజానికి వైఎస్ పథకాలు తప్ప గత్యంతరం లేదనీ, ప్రత్యామ్నాయం లేదనీ ఒప్పుకోవాలి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని పునఃప్రారంభించేటప్పుడు అది ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిందేననీ.. దానిపై పేటెంట్(హక్కు) ఆయనదేనని ధైర్యంగా ప్రకటించిన నాయకుడు వైఎస్ అనీ, అలాగే బాబు కూడా ఫీజుల పథకం వైఎస్‌దేనని చెప్పి ఆందోళనలకు పూనుకోవాలని సూచించారు. బడుగు విద్యార్థులు ఎలా చదువుకుంటున్నారు, ఎలా ఫీజులు చెల్లిస్తున్నారని తన తొమ్మిదేళ్ల పాలనలో ఏనాడూ ఆలోచించని చంద్రబాబు ఇప్పుడు ఫీజుల పథకం కోసం రోడ్డెక్కడం, వైఎస్ పథకాల అమలు కోసం ఆందోళన చేయడం చూస్తుంటే ఓవైపు ఆశ్చర్యం, మరోవైపు సంతోషం కలుగుతోందని ఆమె అన్నారు.
తిరుపతిలో టీడీపీ వారు విద్యుత్ సమస్యపై ఆందోళన చేయడాన్ని ప్రస్తావిస్తూ.. చంద్రబాబుకుగానీ ఆ పార్టీ వారికిగానీ ఫీజులు, విద్యుత్ పథకాల గురించి మాట్లాడ్డం కాదు కదా, ఉచ్ఛరించడానికి కూడా నైతికంగా అర్హత లేదని ఆమె ఎద్దేవా చేశారు. ఫీజుల పథకం అస్తవ్యస్తంగా తయారవడంతో విద్యార్థి లోకంలో నెలకొన్న తీవ్ర అసంతృప్తిని తమ పార్టీకి అనుకూలంగా మల్చుకునేందుకు రాజకీయ కోణంలో ఆందోళనకు దిగారే తప్ప మరొకందుకు కాదని ఆమె విమర్శించారు. బాబు పాలనలో స్కాలర్‌షిప్‌ల కోసం విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఫీజులు కట్టలేక ఎలా సతమతం అయ్యారో తెలిసిందేనని పద్మ అన్నారు. అలాగే విద్యుత్ సమస్యపై పోరాటం చేసే హక్కుగానీ, మాట్లాడే అర్హత గానీ బాబుకు లేవని చెప్పారు. ‘వైఎస్ ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్‌పై మీరు చేసిన వ్యాఖ్యలేమిటి? ఎంత హేళనగా మాట్లాడారో మర్చి పోయారా? అసలు మీ హయాంలో విద్యుత్ సంక్షోభం వచ్చినపుడు మీరు తీసుకున్న చర్యలేమిటి? రైతులపై కేసులు పెట్టింది, వారిని జైళ్లల్లో పెడతామని బెదిరించిందీ గుర్తు లేదనుకుంటున్నారా? అసలు బషీర్‌బాగ్‌లో విద్యుత్ ఉద్యమకారులపై జరిగిన కాల్పుల గురించి ఏం సమాధానం చెబుతారు?’ అని నిలదీశారు.
No comments:
Post a Comment