ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం. ఐటీ హైటెక్కునిక్కుల చంద్రబాబు పాలనను ఎండగడుతూ 2003 మండువేసవిలో ఆయన పాదయాత్ర చేయటం ఒక సాహసం. సామాన్యుల గడపగడపకూ వెళ్లిన వైఎస్‌ఆర్ నాడు ఒక ప్రభంజనాన్నే సృష్టించారు.
వైఎస్ బాటలోనే పయనించాలని నిర్ణయించుకున్న ఆయన కూతురు షర్మిల పాదయాత్ర ద్వారా ప్రభుత్వ అసమర్థతపై ధ్వజమెత్తనున్నారు. అంతకు మించి బాధ్యతారహితంగా, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కుటిల రాజకీయాలను ప్రజలకు వివరించేందుకు సిద్ధమయ్యారు.
తండ్రి లక్షణాలను పుణికిపుచ్చుకున్న షర్మిల పరిశీలకుల అంచనాలకు అందని రీతిలో 3000 కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మరో ప్రజాప్రస్థానం పేరుతో ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు నిర్వహించనున్న పాదయాత్రలో ప్రభుత్వ తీరును ఎండగట్టనున్నారు. ప్రజలతో మమేకం కానున్నారు. తండ్రి సమాధి ఉన్న ఇడుపుల పాయ నుంచి ఆమె పాదయాత్ర ప్రారంభించి, తండ్రి పాదయాత్ర ముగిసిన ఇచ్ఛాపురంలోనే తన పాదయాత్రను ముగించనున్నారు. ఈ నెల 18 నుంచి షర్మిల చేపట్టనున్న 'మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర' రూట్ మ్యాప్ ఖరారైంది.
ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర ఇచ్చాపురం వరకూ కొనసాగుతుంది. మొదటి రోజు ఆమె 13 కిలోమీటర్లు నడుస్తారు. మొదటి రోజు ఇడుపులపాయ నుంచి వీరన్నగట్టుపల్లె వరకూ నాలుగున్నర కిలోమీటర్లు షర్మిల పాదయాత్ర చేస్తారు. వీరన్నగట్టుపల్లె నుంచి కుమ్మరాంపల్లె వరకూ ఒకటిన్నర కిలోమీటర్లు, కుమ్మరాంపల్లె నుంచి వేంపల్లె వరకూ అయిదు కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు.
వేంపల్లి నాలుగు రోడ్ల కూడలి నుంచి రాజీవ్‌నగర్ కాలనీ వరకూ రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. దాంతో మొదటి రోజు పాదయాత్ర ముగుస్తుంది. రెండో రోజు రాజీవ్‌నగర్ కాలనీ నుంచి పాదయాత్ర మొదలుపెడతారు. నందిపల్లె, తాళ్లపల్లె, దుగ్గన్నపల్లె, అమ్మయ్యగారిపల్లె, చాగలేరు క్రాస్, వి.కొత్తపల్లె, గొందిపల్లె క్రాస్, వేముల మీదుగా 19 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. మూడోరోజు భూమయ్యగారిపల్లె క్రాస్ మీదుగా 'మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర' మొదలుపెడతారు.
దివంగత వైఎస్‌ను అభిమానించే ప్రతీ గుండె వైఎస్ షర్మిల చేయనున్న పాదయాత్రను మనస్ఫూర్తిగా స్వాగతిస్తోంది. అప్పటి వైఎస్ పాదయాత్రలో పాల్గొన్న నేతలు షర్మిల మరో ప్రస్థానానికి సిద్ధం అయ్యారు. ఆమె ప్రకటన వెలువడిన వెంటనే జిల్లా ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. కరువు కాటకాల్లో ఉన్న రాష్ట్రాన్ని రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సస్యశ్యామలం చేశారని, ఇప్పుడు అంతకంటే రెట్టింపు కష్టాలు అనుభవిస్తున్న తమను గట్టెక్కించడానికి షర్మిల మరో ప్రస్థానం కచ్చితంగా దోహదపడుతుందని భావిస్తున్నారు.
ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సాగే ఈ పాదయాత్రలో జనంతో మమైకం కానున్నారు షర్మిళ. ప్రజా సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక ధోరణికి నిరసన తెలుపుతూ నల్లబ్యాడ్జిలు, నల్లరిబ్బన్లు చేతికి కట్టుకుని ఆమె ముందుకు పయనం అవుతారు. ఈ పాదయాత్ర ఆద్యంతం ప్రజాసమస్యల సాధనే లక్ష్యంగా సాగనుంది.
చిన్నప్పటినుంచీ తన తండ్రి జన రాజకీయాలను దగ్గరుండి చూస్తున్న షర్మిలకు ప్రజల్లోకి వెళ్లడం, మాట్లాడడం కొత్త కాదు. ఇంటా బయటా నిరంతరం తన తండ్రి చుట్టూ వుండే ప్రజలను దగ్గరగా గమనించిన ఆమె ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొని పార్టీ విజయానికి కీలకపాత్ర పోషించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పలు సందర్భాల్లో అనేవారు.
తన జీవితాన్ని ప్రభావితం చేసిన ముగ్గురు మహిళలకు గురించి సమయమొచ్చినప్పుడల్లా ప్రస్తావించేవారు. తన తల్లి జయమ్మ, భార్య విజయలక్ష్మి, కూతురు షర్మిల తన జీవితంపై చూపిన ప్రభావం అపురూపమైనదని అనేవారు. అనేక సందర్భల్లో తన కూతురు షర్మిల సలహాలను తీసుకొన్న వైనాన్ని వివరించేవారు.
జనమే నిజం, ప్రజలే ముఖ్యమనుకునే వైఎస్‌ఆర్ స్ఫూర్తిని ఆలంబనగా చేసుకున్న షర్మిల పులివెందులలో అనాధ పిల్లల ఆశ్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. తండ్రి పోలికలే కాదు, ఆయన ఆలోచనల్ని వారసత్వంగా పొందిన షర్మిల మరో ప్రజాప్రస్థాన పాదయాత్రతో అధికార కాంగ్రెస్ అసమర్థ పాలనను, ఆ పాలనకు మద్దతుగా నిలిచిన చంద్రబాబు అవకాశవాద రాజకీయాలను ప్రశ్నించనున్నారు. మహానేత చూపిన మార్గంలోనే ఆయన కూతురు ప్రజల్లోకి రానున్నారు. ప్రజలకు మద్దతుగా నేనున్నానంటూ నిలవనున్నారు. జనాన్ని ఆకట్టుకునే గుణం తండ్రి నుంచి పుణికి పుచ్చుకున్న షర్మిల పాదయాత్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=50863&subcatid=0&categoryid=28
No comments:
Post a Comment