ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన సర్కారు.. దానికి ప్రధాన ప్రతిపక్షం బాసట సర్కారుపై అవిశ్వాసం పెట్టకుండా చంద్రబాబు వీధి నాటకాలు
వీటన్నింటినీ ఎండగట్టేందుకు జగన్ తరఫున షర్మిల పాదయాత్ర నాడు నైరాశ్యంలో ఉన్న రాష్ట్ర ప్రజలకు భరోసానిచ్చిన వైఎస్ పాదయాత్ర
వైఎస్ కోసం మరణించిన వారి కుటుంబాల కోసం జగన్ ఓదార్పుయాత్ర అవే అడుగుజాడల్లో వైఎస్ తనయ, జగన్ సోదరి షర్మిల పాదయాత్ర
విద్యుత్ చార్జీల బాదుడు, బషీర్‌బాగ్ కాల్పులు, అన్నదాతల ఆత్మహత్యలు, నేతన్నల ఆకలి చావులు.. రాష్ట్రమంతా కరువుకాటకాలు.. ఇంత జరుగుతున్నా.. చంద్రబాబు సర్కారు మొద్దునిద్ర.. ఇలాంటి సమయంలో ప్రజలకు ైధైర్యం చెప్పి భవిష్యత్తుపై భరోసా ఇవ్వడానికి మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం నిర్వహించారు. జనం గుండెల్లో నిలిచిన సుదీర్ఘ పాదయాత్ర అది. జనంతో మమేకమై వారి కష్టనష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుని.. అధికారంలోకొచ్చాక వాటన్నింటినీ తీర్చే పథకాలకు శ్రీకారం చుట్టారు వైఎస్. ఆ పథకాల అమలు తీరుతెన్నులను తెలుసుకోవడానికి (రచ్చబండ) వెళుతూనే మన నుంచి దూరమయ్యారు.
మహానేత వైఎస్ అకాల మరణం తట్టుకోలేక రాష్ట్రం తల్లడిల్లింది.. వందలాది మంది గుండెలాగిపోయాయి. అదిచూసి వైఎస్ కుమారుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హృదయం చలించిపోయింది. ఆ అభిమానుల కుటుంబాలను ఓదార్చేందుకు, అండగా నేనున్నానని చెప్పేందుకు స్వయంగా వస్తానని ఆయన నల్లకాలువ సభలో హామీ ఇచ్చారు. అయితే అనేక ఆంక్షలు.. అవరోధాలు.. కుట్రలు.. కుతంత్రాలు.. అయినా మాట తప్పలేదు. ఓదార్పుయాత్ర సాగించారు. జనం ఆయన్ను తమ గుండెల్లో పెట్టుకున్నారు. ఇది అధికార, ప్రతిపక్షాలకు కంటగింపుగా మారింది. అవి రెండూ కుమ్మక్కయి జగన్‌ను జనం మధ్య లేకుండా జై లుపాలు చేశాయి.
జగనే లక్ష్యంగా కుమ్మక్కయిన అధికార, ప్రతిపక్షాలు ఆ కుతంత్రాల్లోనే కాలం గడుపుతూ ప్రజల సమస్యలను గాలికొదిలేశాయి. వైఎస్ ప్రతిష్టించిన సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించింది. పథకాలకు కోత పెట్టింది.. పన్నులు పెంచింది.. చార్జీల మోత మోగించింది.. సామాన్యుడి బతుకును దుర్భరం చేసింది. ఇలాంటి సర్కారును అవిశ్వాస తీర్మానంతో గద్దె దింపాల్సిన ప్రధాన ప్రతిపక్షమేమో అన్నివిధాలా మద్దతిస్తూ కాపాడుతోంది. పెపైచ్చు పాదయాత్రల నాటకమాడుతోంది. ఈ పరిస్థితుల్లో జగన్ తరఫున ప్రజలకు భరోసా ఇవ్వడానికి షర్మిల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
రాష్ట్ర రాజకీయాల్లో కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్న కుమ్మక్కు కుట్రలకు నిరసనగా.. ప్రజలను పట్టించుకోని ప్రభుత్వం, అధికారపక్షంతో సయ్యాటలాడుతున్న ప్రధాన ప్రతిపక్ష వైఖరిని ఎండగడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల చేపట్టనున్న మరో ప్రజాప్రస్థానం (పాదయాత్ర) గురువారం నుంచి ప్రారంభం కానుంది. దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లోనే సరిగ్గా తొమ్మిదేళ్ల తర్వాత ఆయన కుమార్తె షర్మిల ప్రజల్లోకి వెళ్లనుండటం సర్వత్రా ఉత్సుకత కలిగిస్తోంది. తన సోదరుడు జగన్‌ను ప్రజల మధ్య లేకుండా చేసి అక్రమంగా నిర్బంధించిన పాలకుల నీచ రాజకీయాలను ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిరంతరం జనం మధ్యనే ఉండేలా చేసేందుకు పాదయాత్రకు సిద్ధపడిన ఒక మహిళగా షర్మిల మరో చరిత్రను సృష్టించబోతున్నారు. 2003లో తన తండ్రి రాజశేఖరరెడ్డి ప్రజాసమస్యలపై అప్పటి చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని నిద్రలేపటం కోసం ప్రజల్లోకి వెళ్లారు. ఇపుడు షర్మిల తన తండ్రి కన్నా రెట్టించిన బాధ్యతతో అధికార, ప్రతిపక్షాల కుట్రలను ఛేదించటానికి ఆయన బాటలోనే అన్న తరఫున ముందుకు వెళుతున్నారు.
షర్మిల తొలిరోజుయాత్ర సాగేదిలా..
షర్మిల గురువారం ఉదయం పది గంటలకు తన మాతృమూర్తి వై.ఎస్.విజయమ్మ, వదిన వైఎస్ భారతి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్(సమాధి) వద్ద నివాళులర్పిస్తారు. ఇదే సందర్భంగా జరిగే సర్వమత ప్రార్థనల్లో పాల్గొంటారు. సరిగ్గా 11 గంటలకు షర్మిల తన పాదయాత్రను ప్రారంభిస్తారు. నడకను ప్రారంభించిన కొద్ది సేపటి కి.. పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తారు. విజయమ్మ కూడా తన కుమార్తె పాదయాత్ర ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో తన ప్రసంగంలో తెలియజేస్తారు. ప్రసంగాలు ముగిసిన తరువాత షర్మిల అక్కడికి సమీపంలోని ట్రిపుల్ ఐటీ విద్యార్థుల వద్దకు వెళ్లి కొద్దిసేపు ముచ్చటిస్తారు. ఆ తర్వాత తన పాదయాత్రను కొనసాగిస్తారు. వైఎస్సార్ ఘాట్ నుంచి వీరన్నగట్టు పల్లెకు(5.5 కి.మీ.), అక్కడి నుంచి కుమ్మరాంపల్లెకు(1.5 కి.మీ.) ఆ తరువాత సాయంత్రం వేంపల్లి నాలుగు రోడ్ల కూడలికి (5 కి.మీ.) షర్మిల చేరుకుని అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి 2 కిలోమీటర్ల సమీపంలోని రాజీవ్‌నగర్ కాలనీకి వెళ్లి సమీపంలో రోడ్డు పక్కన ఏర్పాటు చేసే తాత్కాలిక బసకు చేరుకోవడంతో తొలి రోజు 15 కిలోమీటర్ల యాత్ర పూర్తవుతుందని పాదయాత్ర సమన్వయ, కార్యాచరణ కమిటీ సభ్యుడు తలశిల రఘురామ్ తెలిపారు. షర్మిల బస కోసం రోడ్డు పక్కనే గుడారాలు వేస్తున్నట్లు చెప్పారు.
No comments:
Post a Comment