శ్రీకాకుళం, న్యూస్‌లైన్: విద్యుత్ సమస్యపై ఇటీవల వైఎస్సార్సీపీ నిర్వహించిన రాష్ట్ర బంద్ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ను గాయపరచి, ప్రతాపం చూపిన పోలీసులు తాజాగా ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశా రు. తమపై దౌర్జన్యానికి పాల్పడిన మహిళా ఎస్సైపై ఆయన ఫిర్యాదు చేస్తే ఒకే ఒక్క సెక్షన్ నమోదు చేసిన పోలీసులు.. ఆ ఎస్సై చేసిన ఫిర్యాదుకు స్పందిస్తూ కృష్ణదాస్‌పై ఆరుసెక్షన్లు నమోదు చేశారు. గతనెల 31న శ్రీకాకుళంలో శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియపై పోలీసులు అమాంతంగా విరుచకుపడ్డారు. రోడ్డుపై నడచివెళుతున్న ఆమెను మహిళా ఎస్సై నారీమణి తన సిబ్బందితో అడ్డుకుని కింద పడేశారు. బలవంతంగా ఈడ్చుకువెళ్లి పోలీస్ జీపులో పడేశారు. పరుష పదజాలంతో దూషించారు.
జీపులోనే పలు పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పారు. విషయం తెలుసుకున్న పద్మప్రియ భర్త కృష్ణదాస్ పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఎస్సై నారీమణిని నిల దీశారు. ఎస్సై, ఆమె సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో కృష్ణదాస్ చేతి వేలికి గాయమై తీవ్రంగా రక్తం కోల్పోయారు. దీనిపై ఆరోజే ఆయన కలెక్టర్ సౌరభ్ గౌర్, ఎస్పీ కె.వి.వి.గోపాలరావులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఎస్సై తప్పులను ప్రశ్నించినందునే తమపై ఈరోజు దౌర్జన్యం చేశారని వివరించారు. ఆమెపై చర్య తీసుకోవాలని కోరుతూ పార్టీ నేతలు నేతలు, కార్యకర్తలు అదే రోజు ధర్నా చేయగా, విచారణ జరిపి తగిన చర్య తీసుకుంటామని ఎస్పీ గోపాలరావు హామీ ఇవ్వడంతో విరమించారు. ఎమ్మెల్యేగా తన హక్కులకు భంగం కలిగిందని కృష్ణదాస్ అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. మరోవైపు ఎస్సై నారీమణి కూడా ఎమ్మెల్యే కృష్ణదాస్‌పై ఫిర్యాదు చేయడం గమనార్హం.
ఎదురు కేసులు: ఎమ్మెల్యే కృష్ణదాస్ ఫిర్యాదుపై స్పందించని పోలీసులు నారీమణి ఇచ్చిన ఫిర్యాదుకు మాత్రం ప్రాధాన్యమిచ్చారు. సోమవారం కృష్ణదాస్‌తోపాటు మరో ఇద్దరిపై 352, 353, 341, 224, 225, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎస్సై నారీమణిపై ఒక్క సెక్షన్ 324 కిందే కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. ఈ ఉదంతంపై వైఎస్సార్సీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నాయి.
పోరాటం సాగిస్తాం: కృష్ణదాస్
ఎమ్మెల్యే కృష్ణదాస్ స్పందిస్తూ అక్రమ కేసులపై న్యాయపరంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం సాగిస్తామన్నారు. తమ ఫిర్యాదు పట్టించుకోకపోగా.. తిరిగి తమపైనే కేసులు బనాయించడం ప్రజాస్వామ్య హక్కులకు భంగకరమన్నారు. దీనిపై ప్రజలు, పార్టీ శ్రేణుల మద్దతుతో పోరాటం చేస్తామన్నారు.
No comments:
Post a Comment