YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 15 October 2012

అప్పుడేం చేశారు బాబూ ?

- రుణాల మాఫీపై చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రశ్న 
- తొమ్మిదేళ్ల అధికారంలో వ్యవసాయం దండగన్నారు 
- రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా కనీస సానుభూతి చూపలేదు 
- పరిహారం ఇస్తే.. దానికోసం చనిపోతారని అవమానించారు 
- రుణాలు మాఫీ చేయించాలని నాడు వైఎస్ కోరినా స్పందించలేదు 
- ఇప్పుడు రైతుల రుణాలు రద్దు చేస్తామంటే ప్రజలు నమ్ముతారా? 
- అసలు ఉచిత విద్యుత్‌పై మీ వైఖరేమిటో స్పష్టంగా చెప్పగలరా? 
- రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసానికీ జగన్ బెయిలుకూ లింకేమిటి?
- {పభుత్వాన్ని పడగొట్టబోమని కేంద్రంతో లాలూచీ పడ్డారా? 
- పాదయాత్రలో షర్మిల చెప్పే ప్రతి మాటా పార్టీదేనని స్పష్టీరణ 

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘చంద్రబాబునాయుడు తొమ్మిదేళ్ల అధికారంలో ఉండగా వ్యవసాయం అనే పదాన్ని ఉచ్ఛరించటానికి కూడా ఇష్టపడని వ్యక్తి మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల రుణాలను రద్దు చేస్తారా? ఈ మాటలు జనం నమ్ముతారా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణ తాల రామకృష్ణ ప్రశ్నించారు. దేశ ప్రధాని, రాష్ట్రపతి ఎంపిక తన కనుసన్నల్లోనే జరిగిందని, తననే ప్రధాని పదవి తీసుకోవాలని కోరినా వద్దన్నానని చెప్పుకున్న బాబు.. ఆ రోజున కేంద్రానికి చెప్పి రైతుల రుణాలను ఎందుకు రద్దుచేయించలేక పోయారని నిలదీశారు. ‘‘అప్పట్లో రాష్ట్రం నుంచి టీడీపీ మిత్రపక్షాలకు 36 ఎంపీలు ఉన్నా కూడా.. కేంద్రం నుంచి రైతులకు ఎలాంటి మేలు చేయించలేదు.

రుణాల రీషెడ్యూలు చేయలేదు, మాఫీ చేయించలేదు, ఇన్‌పుట్ సబ్సిడీ తీసుకు రాలేదు, వడ్డీలు తగ్గించలేదు. గిట్టుబాటు ధరను రైతులకు ఇప్పించారా అంటే అదీ లేదు. నైరాశ్యంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం సానుభూతి కూడా చూపలేదు. పైగా వ్యవసాయం దండగన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తే ఆ డబ్బు కోసమే ఆత్మహత్యలు చేసుకుంటారని అవమానకరంగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు’’ అని ఆయన ఎండగట్టారు. కొణతాల సోమవారం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులుతో కలిసి పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాబు పాదయాత్ర చేయటం మంచిదేనని.. అయితే ఆయన మాటల్లో చిత్తశుద్ధి కొరవడిందని ఆయన విమర్శించారు. 

2001-2004 మధ్య కాలంలో రాష్ట్రంలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడినపుడు రైతుల రుణాలను రీషెడ్యూలు చేయాలని, కేంద్రంతో చెప్పి రుణాలు రద్దు చేయించాలని.. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోని చంద్రబాబు.. ఇపుడు తనకు మళ్లీ ప్రజలు ఓట్లు వేసి అధికారంలోకి తెస్తే రుణాలు మాఫీ చేస్తూ తొలి సంతకం చేస్తానని చెప్పటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రుణాల రద్దు, ఎస్సీ ప్యాకేజీ, బీసీ ప్యాకేజీ, మైనారిటీ ప్యాకేజీ అంటూ చంద్రబాబు కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారని.. ఆయన ఎన్ని చెప్పినా ప్రజల్లో ఆయనకు విశ్వసనీయత లేదని.. ఓ రాజకీయ నాయకుడు అధికారంలో ఉండగా ఏం చెప్పారు, ఏం చేశారనేది ప్రజలు సునిశితంగా గమనిస్తున్నారని కొణతాల పేర్కొన్నారు. 

ఉచిత విద్యుత్‌పై నీ వైఖరేమిటి? 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తాను పాదయాత్ర ఎందుకు చేయాల్సి వచ్చిందో స్పష్టంగా ప్రకటించారని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్యంలో ఉన్న అసెంబ్లీ స్తంభన, ధర్నా, నిరాహారదీక్ష వంటి సంప్రదాయిక పద్ధతులన్నీ అనుసరించి మొద్దు నిద్రపోతున్న బాబు ప్రభుత్వాన్ని నిద్ర లేపటంలో విఫలమయ్యాం కనుక పాదయాత్రతో ప్రజలకు ధైర్యం చెప్పటానికి వారి వద్దకు వెళుతున్నాని చెప్పారని కొణతాల గుర్తు చేశారు. ఆ ప్రకారమే వైఎస్ తాను అధికారంలోకి వచ్చీ రాగానే ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేశారని, రూ. 1,300 కోట్ల విద్యుత్ బకాయిలను రద్దు చేశారన్నారు. ‘‘అసలు ఉచిత విద్యుత్‌పై బాబు వైఖరి ఏమిటి? పాదయాత్రకు వెళ్లడానికి తానూ ఉచిత విద్యుత్ ఇస్తానని మాట్లాడారు. తీరా పాదయాత్రలో చేస్తున్న ప్రసంగాలు చూస్తే ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలారేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆనాడే చెప్పానంటున్నారు. దీనర్థం ఏమిటి?’’ అని ప్రశ్నించారు. 

కేంద్రంతో బాబు లాలూచీ పడ్డారా? 
అన్ని రంగాల్లోనూ విఫలమై ప్రజా కంటకంగా మారిన రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని తాము డిమాండ్ చేస్తే జగన్ బెయిల్ కోసమే అడుగుతున్నామనే వితండవాదాన్ని బాబు చేస్తున్నారన్నారు. ‘‘అసలు జగన్‌కు బెయిల్ రావటానికి అవిశ్వాస తీర్మానానికి లింకేమిటి? అంటే జగన్‌కు బెయిల్ రాకుండా ఉండటానికే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టబోమని కేంద్రానికి ఏమైనా బాబు హామీ ఇచ్చారా? తనపై సీబీఐ దర్యాప్తు జరపకుండా ఉంటే ఇక్కడ ప్రభుత్వాన్ని కాపాడతానని కేంద్రంతో లాలూచీ పడ్డారా? ఇందులో క్విడ్ ప్రొ కో ఏమైనా ఉందా?’’ అని రామకృష్ణ అనుమానం వ్యక్తం చేశారు.

రుణాల రద్దు వైఎస్ ఘనతే: సోమయాజులు 
రాష్ట్రంలోనే కాదు, దేశంలోని ఐదు కోట్ల మంది రైతులకు రూ. 74 వేల కోట్ల రుణాలను రద్దు చేయించిన ఘనత దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డిదేనని సోమయాజులు పేర్కొన్నారు. ‘‘2001-04 మధ్య కాలంలో రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని కరువు ఏర్పడింది. వైఎస్ అధికారంలోకి రాగానే కరువు వల్ల రాష్ట్రంలో రైతులు నష్టపోయారని రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ కావాలని పదే పదే ప్రధానికి విజ్ఞప్తి చేశారు.. మీ ఒక్క రాష్ట్రానికే ప్యాకేజీ అంటే ఎలా..? అని ప్రధాని ప్రశ్నించినపుడు దేశవ్యాప్తంగా ఇలాంటి జిల్లాలు ఇంకా ఏమైనా ఉంటే ఎంపిక చేసి వాటికి ప్యాకేజీ ఇవ్వాలని వైఎస్ అడిగారు.

దానివల్లనే దేశవ్యాప్తంగా కరువు పీడిత ప్రాంతాలుగా 31 జిల్లాలను గుర్తించి ప్యాకేజీని ఇచ్చారు. అందులో రాష్ట్రానికి చెందిన 16 జిల్లాలు వచ్చాయి’’ అని ఆయన వివరించారు. రుణాల రీషెడ్యూలింగ్ వల్ల తగ్గిన వడ్డీ భారం రెండు వేల కోట్లు అయితే అందులో వెయ్యి కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించిందని అన్నారు. మళ్లీ 2009 వరకూ ప్రధానిని, శరద్‌పవార్‌ను పలు మార్లు కలిసి కనీసం వంద లేఖలైనా రాసి రుణ మాఫీకి వైఎస్ కారణమయ్యారు. ఈ మాఫీ వల్ల రాష్ట్రంలో రూ. 12 వేల కోట్ల మేర రైతుల రుణాలు రద్దయ్యాయన్నారు. రుణాలు చెల్లించిన రైతులకు కూడా ఎంతో కొంత మేలు చేద్దామనే ఉద్దేశంతో ఐదేసి వేల రూపాయల చొప్పున ప్రోత్సాహకంగా రైతులకు ఇచ్చిన ఫలితంగా రూ. 1,800 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించిందన్నారు. 

ఇన్ని చర్యలు తీసుకున్న ఫలితంగా రాష్ట్రంలో 2009 సంవత్సరం వచ్చే నాటికి ఆహారధాన్యాల ఉత్పత్తి 204 లక్షల టన్నులకు చేరుకుందని ఇదొక రికార్డు అని సోమయాజులు అన్నారు. వైఎస్ చేయగలిగిన ఇన్ని పనులు బాబు ఎందుకు చేయలేక పోయారో ఆయన ప్రజలకు వివరించాలని సోమయాజులు డిమాండ్ చేశారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర సందర్భంగా చెప్పే ప్రతి మాట పార్టీ తరపున చెప్పేదిగానే భావించాలని కొణతాల ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు కనుక ఆయన తరఫున షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారని పార్టీ ప్రతినిధిగా ఆమె ప్రజలకు భరోసా ఇస్తారన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!