హైదరాబాద్, న్యూస్‌లైన్: పెరిగిన ధరలకు అనుగుణంగా సంక్షేమ హాస్టళ్ల మెస్ చార్జీలను ప్రభుత్వం పెంచాలని డిమాండ్ చేస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పితాని సత్యనారాయణ నివాసాన్ని ముట్టడించారు. హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు. చెంబులు, పళ్లాలు ప్రదర్శించి నిరసన తెలిపారు. మంత్రి బయటకు రాకపోవడంతో సహనం కొల్పోయిన కొందరు విద్యార్థులు చెంబులు, పళ్లాలను ఆయన నివాసంలోకి విసిరారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి, ఆందోళన చేస్తున్న వారినీ అరెస్టు చేసి అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు.
మెస్ చార్జీలు పెంచాల్సిందే: పుత్తా
రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి చాలా అధ్వానంగా తయారైందని వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా విద్యార్థులు అష్టకష్టాల పాలవుతున్నారని, చదువుపై శ్రద్ధ చూపలేకపోతున్నారని అన్నారు. విద్యార్థుల మెస్ చార్జీలకు ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధులు ఏమూలకూ సరిపోవన్నారు. ‘‘ప్రభుత్వం మూడు నుంచి 5వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.475, 10వ తరగతి వరకు రూ.535, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ తదితర విద్యార్థులకు 520 రూపాయలే ఇస్తోంది. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్న సమయంలో ప్రభుత్వం అందజేస్తున్న నిధులు ఏ మేరకు సరిపోతాయో పాలకులే సమాధానం చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి..
ఈ సందర్భంగా మంత్రి పితానికి పుత్తా కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘‘రాష్ట్రంలో 10 లక్షల మంది హాస్టళ్లలో అర్ధాకలితో మగ్గుతున్న మాట వాస్తవం కాదా? మూడు పూటలకు ఒక్కో విద్యార్థికి ఇస్తున్న 17 రూపాయలు ఒక్కపూట ఆకలినైనా తీరుస్తుందా? గత నాలుగేళ్లలో ప్రీ మెట్రిక్ హాస్టళ్లలో ఒక్క రూపాయి మెస్‌చార్జీ పెంచారా, అయితే ఈ సమయంలో నిత్యావసరాల ధరలు మాత్రం 200 శాతం పెరిగిన మాట నిజం కాదా?’’ అని నిలదీశారు.
No comments:
Post a Comment