ఆయన నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం. నిజాయితీ ఆయన ఇంటిపేరు. ఆరునూరయినా సరే నిజం మాత్రమే మాట్లాడాలనే సంకల్పశుద్ధికి అసలుపేరు. అధికార రాజకీయాలకు ఆయన ఆమడ దూరంలో ఉండేవారు. పదవులకోసం గోతులు తీసేవారంటే ఆయనకు అసహ్యం. బతికుండగానే సొంతమనుషులకు -చందాలు పోగేసి మరీ- సమాధులు కట్టే ధూర్తులంటే ఆయనకు వెలపరం.
ఇంతకీ ఎవరాయన? మన జాతిపిత మహాత్మ గాంధీ. తన పుట్టిన రోజున చంద్రబాబు నాయుడు పాదయాత్ర ప్రారంభించడం చూసి ఆయన -రాజ్‌ఘాట్‌లోని సమాధిలో- విలవిల్లాడుతున్నారు. గాంధీజీ నిరాడంబరతకూ, చంద్రబాబు ఆడంబరాచారానికీ చుక్కెదురని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉదాహరణకు ప్రస్తుతం బాబు చేపట్టిన పాదయాత్ర బడ్జెట్ ఎంతో తెలుసా? కేవలం 100 కోట్ట రూపాయలు!
గాంధీజీ ఇంటిపేరుగా మారిపోయిన నిజాయతీకీ చంద్రబాబుకూ కడుదూరపు చుట్టరికమయినా లేదు. తొమ్మిదేళ్లకు కొద్దిగా తక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన పాలనలో అనుసరించిన విధానాలనే ఇప్పుడు నిత్యం విమర్శిస్తున్న సంగతి ఓ బహిరంగ రహస్యం. సత్యవాక్పాలన గాంధీజీ అసలుపేరుగా ప్రపంచం గుర్తించి ఆరతులెత్తింది. కానీ, నిజానికీ చంద్రబాబుకూ ఆజన్మవైరం. ఆయన నిజం మాట్లాడిన ఉత్తర క్షణం తలపగిలిపోతుందని ఎవరో ముని శాపమిచ్చాడని చెప్తారు.
అధికార రాజకీయాలంటే గాంధీజీ ఆమడ దూరంలో ఉండేవారు. కానీ, పుట్టగానే పరిమళించిన చంద్రబాబుకు మాత్రం అధికార రాజకీయాలే అన్నమూ నీళ్లూను! పదవులకోసం ఇతరులకు హాని తలపెట్టేవారంటే బాపూజీకి అసహ్యం. కానీ, పిల్లనిచ్చిన మావగారినే మూడునిలువుల గోతిలో పాతిపెట్టిన చరితార్థుడు(!) చంద్రబాబు.
ఇక, సొంతమనుషులనే పాతేసి పైకిరావాలనుకునే వారంటే గాంధీ తాతకు వెలపరం. కానీ, మావగారిపై కుట్రకు కలిసొచ్చిన బావ మరుదులకూ, తోడల్లుడికీ మూరెడు మూరెడు నామాలు దిద్ది, జన్మలో లేవకుండా చావుదెబ్బ కొట్టిన ఘనుడు చంద్రబాబు!
అన్నింటికీ మించి- ఎండనకా వాననకా దేశమంతటా కాలినడకన తిరిగినవాడు గాంధీ మహాత్ముడు. కేవలం ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవాలనే ఏకైక లక్ష్యంతో పాదయాత్ర చేపట్టినవాడు చంద్రబాబు. జాతిపితను ఘోరంగా అవమానించాలన్న దురుద్దేశం ఉంటే తప్ప చంద్రబాబులాంటి ధూర్తుడూ, పదవీకాంక్షాపరుడూ, అధికారవ్యామోహీ, అసత్యవాదీ, స్వార్థపరుడూ ఆ మహాత్ముడి జయంతి రోజునే తన అధికార యాత్రకు శ్రీకారం చుడతాడా?
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొణతాల రామకృష్ణ, సోమయాజులు ఇదే ప్రశ్న వేస్తున్నారు. మంగళవారంనాడు -అక్టోబర్ 16న- హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ వారు మరికొన్ని ప్రశ్నలు సంధించారు. అందులో కొన్ని మీ ముందుంచుతున్నాం.
1. తను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక్కరోజుకూడా రైతులగురించీ, వ్యవసాయంగురించీ ఒక్క మంచిమాటయినా అనని చంద్రబాబు ఇప్పుడు ఊకదంపుడు ఉపన్యాసాలు ఎన్ని చేసినా జనం నమ్ముతారా? అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొణతాల రామకృష్ణ, సోమయాజులు నిలదీస్తున్నారు.
2. అధికారంలోకి రాకముందు రెండు రూపాయలకే కిలో బియ్యం అని వాగ్దానం చేసి, పదవిలోకి రాగానే కిలో రేషన్ బియ్యం ఖరీదు రూ.5.25 చేసేసిన చంద్రబాబు మాటలను జనం నమ్ముతారా? అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిలదీస్తున్నారు.
3. ఎన్నికల సమయంలో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ద్యనిషేధం అమలు చేస్తానని చెప్పి పదవిలోకి వచ్చిన తర్వాత ప్రొహిబిషన్‌ను ఎత్తేసిన చంద్రబాబు మాటలను జనం నమ్ముతారా? అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిలదీస్తున్నారు.
4. కేంద్రంలో చక్రం తిప్పాననీ, దేవెగౌడకు ప్రధాని పదవి ‘ఇప్పించాననీ’, ఆయన హయాంలో తానే ఏలుబడి సాగించాననీ లేత సొరకాయలు కోయడం చంద్రబాబుకు అలవాటు. అయితే, ఆత్మహత్యాంధ్రప్రదేశ్‌గా మారిన చేటుకాలంలో సైతం, రైతుల కష్టాల గురించి కేంద్రానికి ఒక్క లేఖకూడా రాయని చంద్రబాబు మాటలను జనం నమ్ముతారా? అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిలదీస్తున్నారు.
5. అస్తవ్యస్త పాలనకు అసలుపేరుగా మారిన నేటి కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మనమయినా ప్రవేశపెట్టలేనని చేతులెత్తేసిన చంద్రబాబు మాటలను జనం నమ్ముతారా? అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిలదీస్తున్నారు.
ఈ అయిదు ప్రశ్నలకూ సమాధానం చెప్పిన తర్వాతే చంద్రబాబు తన యాత్ర కొనసాగిస్తే బాగుంటుందని వెఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సూచిస్తున్నారు. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారూ, తమ చెవిన పడిందా??
http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=50914&Categoryid=28&subcatid=0
No comments:
Post a Comment