ఈమధ్య కొన్నిసార్లు అనిపిస్తోంది - అసలు ఇదంతా ఎలా జరిగింది, ఎందుకు జరిగింది - అని. హాయిగా బెంగళూరులో వున్నప్పుడు జగన్ నాతో, పిల్లలతో ఎంతో సమయం గడిపేవాడు. వ్యాపారాలు చూసుకుంటూ వుండేవాడు. అన్నీ బాగా జరుగుతూ వుండేవి. అటువంటి జగన్ పావురాలగుట్టలో మామ హెలికాప్టర్ క్రాష్ అయిన దగ్గర ఇచ్చిన మాట మా జీవితాలను మార్చేసింది. ఆరోజు మాట ఇచ్చినప్పుడు నేను అనుకోలేదు ఇది ఇంత పెద్దది అవుతుందని. కాని మాట ఇచ్చిన తరువాత దానిని నిలబెట్టుకోవడం కొడుకుగా జగన్ బాధ్యత. ఆ మాట మొదలుకుని ఇవన్నీ ఒకదాని తరువాత ఒకటి మమ్మల్ని పరీక్షిస్తూ వస్తున్నాయి. ఇంత దూరం తీసుకొని వచ్చాయి. జగన్ తాను ఇచ్చిన మాట కాదనుకుని వుంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావు. జగన్‌ను కేంద్రమంత్రిని, ఆ తర్వాత ముఖ్యమంత్రిని కూడా చేసేవాళ్లు. ఇన్ని కేసులు, ఇన్ని కష్టాలు, ఇన్ని పోరాటాలు వుండేవి కావు.
నమ్మినదానికోసం ఇంత గట్టిగా నిలబడ్డాడు నా భర్త అని సంతోషపడాలో, లేక ఇన్ని కష్టాలు పడుతున్నాడు, నాకు - నా పిల్లలకు దూరంగా వున్నాడు అని బాధపడాలో తెలీదు. అందుకే ఎంతో బాధగా వుంటుంది. అందులో కూడా జగన్ నమ్మినదానికి నిలబడ్డాడు అని కొంచెం సంతోషం కూడా ఉంటుంది. ఈ కష్టాలు ఎప్పుడు తీరతాయో అనుకున్నప్పుడు ఎంతో నిరాశ వస్తోంది. జగన్ జైలులో ఉన్నాడు అనే ఆలోచన నిత్యం కృంగదీస్తోంది. కానీ జగన్ నాతో - ‘మనసు నెమ్మది చేసుకో. దిగులు, భయం మనసులోకి రానీయొద్దు. అవి దేవుని మీద మన నమ్మకం నుండి నీ మనసును దూరం చేస్తాయి. దేవుణ్ణి నమ్ము. తప్పకుండా దేవుడు మనకు దారి చూపిస్తాడు. దేవుడు నడిపిస్తాడు. అన్నీ చక్కబడతాయి. మనం ఇంతదూరం వచ్చామంటే కూడా దేవుని దయనే. దేవుడు నడిపిస్తాడు’ అని అంటాడు.
మాట ఇచ్చిన తరువాత ప్రతి మలుపులోను మాకు రెండు మార్గాలు వున్నాయి. ఒకటి - ఇచ్చిన మాటకోసం ఎందాకా అయినా వెళ్లడం. రెండు - రాజీపడి దారి మార్చుకోవడం. ఆ మాటకు కట్టుబడి వుండాలి అంటే ఈ దారి తప్ప వేరే దారిలేదు. ఈ ప్రయాణంలో దేవుని తోడు, మామగారి దీవెన, ప్రజల ప్రేమ మమ్మల్ని నడిపిస్తూ వున్నాయి. ఇకముందు కూడా నడిపిస్తాయని విశ్వసిస్తున్నాను.
- వైఎస్ భారతి, w/o వైఎస్ జగన్
No comments:
Post a Comment