YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 14 October 2012

టీడీపీ మ్యాచ్‌ఫిక్సింగ్‌పైనే ఈ నిరసన

‘మరో ప్రజా ప్రస్థానం’పై యాత్ర కమిటీ సభ్యుడు భూమన వెల్లడి
ఈ మేరకు షర్మిల యాత్రలో నల్లబ్యాడ్జీ ధరిస్తారు
రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది
ధరలు, చార్జీలతో ప్రజల్ని పీల్చి పిప్పిచేస్తోంది
దానిపై అవిశ్వాసం పెట్టాల్సిందిపోయి టీడీపీ కాంగ్రెస్‌తో కుమ్మక్కైంది
ఈ సమయంలో ప్రజలకు ధైర్యం చెప్పి, భవిష్యత్తుపై భరోసా కల్పించాలని జగన్ భావిస్తున్నారు
ఆయన తరఫున సోదరి షర్మిల ప్రజల్లోకి వస్తున్నారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల చేపడుతున్న ‘మరో ప్రజా ప్రస్థానం’ ఒక నిరసన పాదయాత్ర అని యాత్ర సమన్వయ, కార్యాచరణ కమిటీ సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి, అలాంటి ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి పడగొట్టే అవకాశమున్నా అలా చేయకుండా నాటకాలాడుతున్న టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా ఈ యాత్ర చేపడుతున్నారని చెప్పారు. ఇది భారత దేశ రాజకీయ యవనికపై ఒక నూతనాధ్యాయానికి శ్రీకారం చుట్టబోతోందన్నారు. ప్రజాద్రోహానికి పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టకుండా టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్రకు వెళ్లడం ప్రజలను మోసగించడమే అవుతుందని విమర్శించారు. ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో కమిటీ సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, తలశిల రఘురామ్, యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాపరెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ప్రజల్ని ప్రభుత్వం పీల్చి పిప్పి చేస్తోంది...

‘‘రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ప్రజల ఆకాంక్షలను ఏ మాత్రం తీర్చకుండా నిరంతరం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోంది. నిత్యావసర సరుకుల ధరల పెంపుదలకు కారణమైంది. 13 వేల కోట్ల రూపాయల మేరకు విద్యుత్ చార్జీలు, ఇంధన సర్‌చార్జీల భారాన్ని ప్రజలపై మోపింది. మూడు సార్లు ఆర్టీసీ చార్జీలను పెంచింది. విద్యార్థులను అయోమయానికి గురి చేస్తూ వారి భవిష్యత్తుతో చెలగాటం ఆడేలా ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకం పట్ల వ్యవహరిస్తోంది. కార్మిక, రైతు, వ్యవసాయ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోంది. సమాజంలో ఏ ఒక్క వర్గ ప్రజల జీవితాలు ఈ ప్రభుత్వ హయాంలో సంతోషంగా లేని పరిస్థితి నెలకొంది. దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తన పాలనలో దాదాపు 75 లక్షల మందికి తెల్లకార్డులు ఇస్తే ఇపుడున్న ప్రభుత్వం వాటిలో 25 శాతానికి పైగా తీసేసింది. వృద్ధుల, వికలాంగుల పెన్షన్లను భారీగా తొలగించింది. వారికి 3, 4 నెలలకు ఒకసారి కూడా పెన్షన్లు రాని పరిస్థితి. ఇలా ప్రజల జీవితాలను, వారి మూలుగులను ప్రభుత్వం పీల్చి పిప్పి చేస్తోంది’’ అని భూమన విమర్శించారు.

అవిశ్వాసం పెట్టకుండా ప్రతిపక్షం కుమ్మక్కైంది..

‘‘ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మెడలొంచాల్సిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆ పార్టీతో కుమ్మక్కైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి రోజు రోజుకూ పెరుగుతున్న ప్రజాదరణను చూసి భయపడుతున్న టీడీపీ అధికారపక్షంతో మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకుని అవిశ్వాస తీర్మానం పెట్టకుండా లాలూచీ పడుతోంది. ప్రధాన ప్రతిపక్షం పైపైకి ప్రకటనల్లో మాత్రమే విమర్శలు గుప్పిస్తూ ఆచరణలో మాత్రం అధికారపక్షంతో కలిసిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేయాలనే ఆలోచనలతో ప్రతిపక్షం ప్రభుత్వంతో సయ్యాటలాడుతోంది. ఇలాంటి ప్రజా కంటక ప్రభుత్వ వైఖరికి, ప్రతిపక్ష లాలూచీ రాజకీయాలకు నిరసనగా వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యురాలు షర్మిల నల్ల బ్యాడ్జీ ధరించి పాదయాత్ర చేస్తున్నారు’’ అని కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

జైల్లో ఉన్నా జనం గురించే జగన్ ఆలోచన...

‘‘ఈ అధికారపక్ష, ప్రతిపక్షాల వైఖరులపై నిరసన తెలపడంతోపాటు, ఇలాంటి సమయంలో ప్రజలకు ధైర్యం చెప్పేం దుకు, భవిష్యత్తుపై భరోసా ఇచ్చేందుకు పార్టీ తరఫున ప్రజల తో మమేకం కావాలనే భావనతో జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారు. జైల్లో ఉంటూ కూడా జగన్ నిరంతరం ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు, పార్టీ సూచనల మేరకు షర్మిల ఈ యాత్రకు పూనుకున్నారు. ప్రజల కష్టాలను, కన్నీళ్లను తుడుస్తూ వారికి భవిష్యత్తు మీద భరోసా ఇచ్చేందుకే ఆమె వస్తున్నారు. 

జగన్ నేతృత్వంలో రాబోయే ప్రభుత్వంలో వైఎస్ సువర్ణయుగాన్ని మళ్లీ చూడవచ్చని, పెద్దాయన ఆశయాలకు కొనసాగింపుగా సంక్షేమ కార్యక్రమాలు పకడ్బందీగా అమలవుతాయని ఆమె పాదయాత్రలో ప్రజలకు భరోసా ఇస్తారు. వృద్ధులకు, వికలాంగులకు వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తామని, ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పక్కా ప్రణాళికతో అమలు చేస్తామని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని, 9 గంటల పాటు వ్యవసాయరంగానికి ఉచితంగా విద్యుత్ నిరాఘాటంగా ఇస్తామని, ఒక్క రూపాయి కూడా అదనపు భారం మోపబోమని భరోసా ఇస్తారు’’ అని కరుణాకర్‌రెడ్డి స్పష్టంచేశారు. ఈ పాదయాత్ర పట్ల తెలుగుజాతి యావ త్తు ఆసక్తితో, ఉత్సాహంతో ఎదురు చూస్తోందని, తామూ భాగస్వాములం కావాలని ప్రజలు తపన పడుతున్నారని అన్నారు.

హంగూ ఆర్భాటాలొద్దు...

పాదయాత్ర సందర్భంగా వైఎస్ అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి హంగులు, ఆర్భాటాలు చేయొద్దని, పూలు చల్లడంలాంటి కార్యక్రమాలు అసలు వద్దని కరుణాకర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముందుగా రూపొందించిన రూట్‌మ్యాప్ ప్రకారమే యాత్ర సాగుతుందని, కొద్దిగా కూడా మార్పులుండవని, ఈ విషయం స్థానిక నాయకులు గుర్తించాలని అన్నారు. చిత్తూరు జిల్లాలో ఈ నిరసన యాత్ర జరపడానికి ప్రత్యేక కారణాలేమీ లేవనీ చంద్రబాబు, ముఖ్యమంత్రి జిల్లా అయినంత మాత్రాన తమ పార్టీకి ఎలాంటి ఇబ్బందులూ అక్కడ లేవని, చాలా పటిష్టంగా ఉన్నామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. టీడీపీ పార్టీ నుంచే తమ పార్టీలోకి భారీగా వలసలు వచ్చే అవకాశం భవిష్యత్తులో ఉందన్నారు. 3,000 కిలో మీటర్ల మేర 16 జిల్లాల్లో సుమారు ఆరు నెలల పాటు ఈ మరో ప్రజాప్రస్థానం సాగుతుందన్నారు.

‘మరో ప్రజా ప్రస్థానం’ సాగేదిలా..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల ఈ నెల 18 నుంచి చేపట్టనున్న నిరసన పాదయాత్రకు సంబంధించిన తొలి ఐదు రోజుల షెడ్యూలును పార్టీ కార్యాలయం ఆదివారం వెల్లడించింది. తొలి రోజున ఉదయం 11 గంటలకు ఇడుపులపాయ వద్ద బహిరంగ సభ అనంతరం షర్మిల వీరన్నగట్టుపల్లె, కుమ్మరాం పల్లె, వేంపల్లె నుంచి నాలుగు రోడ్ల కూడలి, రాజీవ్‌నగర్ కాలనీ వరకూ పాదయాత్ర చేస్తారు. రెండో రోజు రాజీవ్‌నగర్ కాలనీ నుంచి నందిపల్లె, తాళ్లపల్లె, దుగ్గన్న పల్లె, అమ్మయ్యగారి పల్లె, చాగలేరు క్రాస్, వి.కొత్తపల్లె, గొందిపల్లె క్రాస్, వేముల, భూమయ్యగారి పల్లె క్రాస్ వరకూ వెళతారు. మూడో రోజు అక్కడి నుంచి వేల్పుల, బెస్తవారిపల్లె, పులివెందుల ఆర్టీసీ బస్టాండ్, పూల అంగళ్ల మీదుగా పార్నపల్లె రోడ్డు, రింగురోడ్డు సర్కిల్ నుంచి వైఎస్సార్ గృహానికి వెళతారు. నాలుగో రోజు పులివెందుల రింగ్‌రోడ్డు నుంచి చిన్న రంగాపురం, ఇప్పట్ల, చిన్న కుడాల క్రాస్, పెద్ద కుడాల క్రాస్, లింగాల, లోపట్నూతల క్రాస్ వరకూ పాదయాత్ర చేస్తారు. ఐదో రోజున కర్ణపాపయ్య పల్లె, వెలిదండ్ల, నేర్జాంపల్లె, పార్నపల్లె వరకూ యాత్ర కొనసాగుతుంది. ఆ తరువాతి యాత్ర వివరాలు తదుపరి వెల్లడిస్తారు.

http://www.sakshi.com/main/FullStory.aspx?catid=469049&Categoryid=1&subcatid=33

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!