కంకర, ఇటుక రాళ్లతో విధ్వంసం
గత ఐదు రోజులుగా ‘సాక్షి’పై తీవ్రస్థాయిలో బాబు విమర్శలు బాబు రెచ్చగొట్టే ప్రసంగాలే దాడికి కారణమంటున్న విశ్లేషకులు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అర్బన్ ఎస్పీ రవికృష్ణ ఖండించిన జర్నలిస్టు సంఘాలు, రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సాక్షిగా ‘సాక్షి’ పత్రిక గుంటూరు నగర కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు, వలంటీర్లు కంకర, ఇటుక రాళ్లతో దాడికి పాల్పడ్డారు. బీభత్స వాతావరణాన్ని సృష్టించారు. ఈ ఘటనలో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. ‘వస్తున్నా.. మీకోసం’ అంటూ పాదయాత్ర చేస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిత్యం తన ప్రసంగాల్లో ‘సాక్షి’ పత్రికను ఆడిపోసుకుంటున్నారు. సోమవారం గుంటూరు నగరంలో ఆయన చేసిన ప్రసంగంలో ‘సాక్షి’నే ప్రధాన లక్ష్యంగా చేసుకున్నారు. కార్యకర్తలు రెచ్చిపోవడానికి ఈ ప్రసంగాలే కారణమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ దాడిని పలు పార్టీలు, ప్రజా సంఘాలు, జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ప్రజాస్వామ్యానికే మచ్చ అని వ్యాఖ్యానించాయి. దాడికి పాల్పడినవారిని శిక్షించకుంటే రాష్ట్రస్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పాదయాత్ర గత ఐదు రోజులుగా గుంటూరు జిల్లాలో జరుగుతోంది. సోమవారం ఉదయం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని రింగ్ రోడ్డు, బృందావన్ గార్డెన్స్, అశోక్‌నగర్, కోబాల్డ్‌పేట, బ్రాడీపేట, ఏటీ అగ్రహారం, చుట్టుగుంట మీదుగా సాగింది. బృందావన్ గార్డెన్స్‌లో జరిగిన సభలో ‘సాక్షి’పై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 10 నిమిషాలకు పైగా పత్రికపై విమర్శలు గుప్పించారు. యాత్ర సాయంత్రం 5.10 గంటల సమయంలో బ్రాడీపేట 4వ లైను, 18వ అడ్డరోడ్డు మీదుగా సాగింది. ‘సాక్షి’ పత్రిక గుంటూరు నగర కార్యాలయం కూడా ఇదే రోడ్డులో ఉంది. చంద్రబాబు ‘సాక్షి’ కార్యాలయాన్ని దాటి 200 మీటర్లు ముందుకు వెళ్ళారు. ఆ వెంటనే కొందరు టీడీపీ కార్యకర్తలు, వలంటీర్లు ‘సాక్షి’ కార్యాలయంపై కంకర, ఇటుక రాళ్ళతో దాడి మొదలెట్టారు. చంద్రబాబుకు భద్రత కల్పించే ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు చూస్తుండగానే ఐదు నిమిషాలపాటు భయానక వాతావరణం సృష్టించారు. తీవ్ర అసభ్య పదజాలంతో ‘సాక్షి’ సిబ్బందిని దూషించారు. దాడిలో ‘సాక్షి’ కార్యాలయం ప్రధాన ద్వారం వైపు ఉన్న అద్దాలన్నీ ధ్వంసమయ్యాయి. ‘సాక్షి’ సిబ్బంది వెంటనే గుంటూరు పశ్చిమ డీఎస్పీకి ఫోన్ చేసి దాడిపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే అరండల్‌పేట ఎస్‌హెచ్‌ఓ సీతారామయ్య అక్కడికి చేరుకొని విచారణ ప్రారంభించారు. ఆ తరువాత అర్బన్ ఎస్పీ ఆకే రవికృష్ణ వచ్చి కార్యాలయాన్ని పరిశీలించారు. ఇలా దాడులకు పాల్పడటం సరికాదని ఎస్పీ అన్నారు. దాడికి పాల్పడిన వారు ఎవరైనా ఉపేక్షించబోమని, కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పట్టాభిపురం పోలీసులను ఆదేశించారు. స్థానికంగా ఉన్న ప్రజలతో మాట్లాడి దాడి జరిగిన వైనాన్ని తెలుసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖండన ‘సాక్షి’ పత్రికపై దాడిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. దాడి జరిగిన విషయం తెలిసిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, యువజన విభాగం నగర కన్వీనర్ నసీర్ అహ్మద్‌లు ‘సాక్షి’ కార్యాలయాన్ని పరిశీలించారు. నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. |
Monday, 11 February 2013
బాబు సాక్షిగా‘సాక్షి’పై దాడి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment