YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 11 February 2013

బాబును వెంటనే అరెస్టు చేయాలి


‘సాక్షి’ గుంటూరు నగర కార్యాలయంపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేసేలా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రోత్సహించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ‘సాక్షి’ కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, నేతల వలసలను భరించలేక ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర అసహనంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీనిపై ‘సాక్షి’లో వస్తున్న కధనాలను ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. ‘సాక్షి’లో వచ్చిన కథనాలు అవాస్తవాలని బాబు నిరూపించగలరా అని సవాలు చేశారు. పాదయాత్రలో భాగంగా చంద్రబాబు చేస్తున్న ప్రసంగాల్లో ‘సాక్షి’ దినపత్రికను తీవ్రంగా విమర్శిస్తున్నారని, తద్వారా ‘సాక్షి’పై దాడులు చేసేలా టీడీపీ కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజల పత్రికగా ఉండి కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న ‘సాక్షి’పై చంద్రబాబు తీవ్ర అక్కసు పెంచుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎల్లో మీడియా తప్ప మరే ఇతర మీడియా ఉండకూడదనే లక్ష్యంతో ఈ తరహా దాడులను బాబు ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ‘సాక్షి’ కార్యాలయంపై దాడికి చంద్రబాబే ప్రత్యక్ష కారకుడని, తక్షణమే ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు యాత్రలో ఉండి దాడులకు పాల్పడిన టీడీపీ వలంటీర్లు, స్థానిక నేతల్ని అరెస్ట్ చేయాలన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!