YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 15 February 2013

కాంగ్రెస్‌కు డీసీసీబీ, టీడీపీకి డీసీఎంఎస్... పంచుకున్న పార్టీలు

డీసీసీబీ చైర్మన్‌గా అమాస, డీసీఎంఎస్ చైర్మన్‌గా శ్యామరాజు 
21 మంది ఉన్నా డీసీఎంఎస్‌కు నామినేషన్లే వేయని కాంగ్రెస్ 
కాంగ్రెస్ - టీడీపీల మధ్య రెండేళ్ల కిందట జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదలైన చీకటి పొత్తు చిత్తూరు జిల్లా సహకార ఎన్నికల సందర్భంగా మరింత బలపడింది. టీడీపీ సహకారంతో కాంగ్రెస్ చిత్తూరు డీసీసీ బ్యాంకు ఎన్నికను ఏకగ్రీవం చేసుకుంది. ఇందుకు ప్రతిఫలంగా టీడీపీకి డీసీఎంఎస్ చైర్మన్ పదవితో పాటు పాలకవర్గం మొత్తం అప్పగించేందుకు మార్గం సుగమం చేసింది. 59 సింగిల్ విండోలకు ఎన్నికలు జరగగా వైఎస్సార్ సీపీ మద్దతుదారులు 21 గెలవటం ఆ రెండు పార్టీలకు ఆందోళన కలిగించింది. దీంతో వైఎస్సార్ సీపీకి చెందిన 8 విండోలను డీఫాల్ట్ జాబితాలో చేర్పించిన కాంగ్రెస్ పార్టీ.. నామ్‌కే వాస్తే అన్నట్లుగా టీడీపీకి చెందిన ఒక విండోను కూడా ఇందులో చేర్చింది. టీడీపీ ఎమ్మెల్యేలు గాలిముద్దు కృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అమాస రాజశేఖరరెడ్డి రెండు పార్టీల మధ్య పదవులు పంచుకునే ప్రతిపాదనలపై చర్చలు జరిపారు. 

ఇవి ఫలించటంతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆమోదంతో డీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవిని కాంగ్రెస్‌కు ఇవ్వటానికి ఒప్పందం చేసుకున్నారు. పెద్ద పంజాణికి చెందిన కాంగ్రెస్ సింగిల్ విండో అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి డీసీసీ బ్యాంకు డెరైక్టర్‌గా నామినేషన్ వేయటానికి ప్రతిపాదకుడు తక్కువ పడ్డారు. దీంతో విజయభాస్కర్‌రెడ్డిని కుప్పం నియోజకవర్గం శాంతిపురం సింగిల్ విండో అధ్యక్షుడు శ్యామరాజు ప్రతిపాదించారు. ఏ క్లాస్‌లో 16 డెరైక్టర్ స్థానాలకు రిజర్వేషన్ల మేరకు అభ్యర్థులు అందుబాటులో లేకపోవటంతో 9 కాంగ్రెస్, 3 టీడీపీ పంచుకుని నామినేషన్లు వేయించుకున్నారు. బి క్లాస్‌లోని 5 డెరైక్టర్ స్థానాలకు కాంగ్రెస్ మద్దతుదారులైన ముగ్గురే నామినేషన్ వేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక తర్వాత మిగిలిన డెరైక్టర్లను రెండు పార్టీలు ఒక అవగాహనతో కో-ఆప్షన్ పద్ధతిలో నామినేట్ చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి.

డీసీఎంఎస్ పోటీ నుంచి తప్పుకున్న కాంగ్రెస్

టీడీపీతో కుదిరిన రహస్య ఒప్పందం మేరకు కాంగ్రెస్ పార్టీ డీసీఎంఎస్ పాలకవర్గం ఎన్నికల నుంచి తప్పుకుంది. మొత్తం 10 డెరైక్టర్ పదవులకు రిజర్వేషన్ అభ్యర్థులు అందుబాటులో లేకపోవటంతో టీడీపీ 7 నామినేషన్లు మాత్రమే దాఖలు చేసింది. టీడీపీకి చెందిన శాంతిపురం సింగిల్ విండో అధ్యక్షుడు శ్యామరాజును చైర్మన్ చేయటానికి రంగం సిద్ధం చేసింది. ప్రింటింగ్ ప్రెస్ చైర్మన్ పదవి కూడా టీడీపీకే ఇవ్వటానికి కాంగ్రెస్ సుముఖంగా ఉంది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!