YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 11 February 2013

మీ నాయనలెక్క మీరూ మంచిగ జెయ్యాలే

- షర్మిలకు రైతులు, మహిళలు, వృద్ధుల వినతి
- చండూరు మండలం బంగారిగడ్డలో రచ్చబండ
- మిగిలిన నాన్న పనులు.. 
- అన్న తీరుస్తాడు : షర్మిల హామీ 

చౌటుప్పల్/చండూరు : ‘‘రాజశేఖరరెడ్డి అందరికీ అన్నీజేసిండు. ముసలోళ్లకు పింఛన్లు ఇచ్చిండు.. అవిటోళ్లకు రూ.500 ఇచ్చిండు.. రైతుల లోన్లు మాఫీ జే సిండు.. ఉచితంగా కరెంటు ఇచ్చిండు.. ఆయన పోయినంక అన్నీ పెంచుతున్రు. కరెంటు బిల్లు చూస్తే గుండె గుబిల్లుమంటోంది. బస్‌చార్జీలు పెరిగినయ్.. వానలు లేవు.. పంటలు పండుతలేవు.. ఊళ్లన్నీ చిన్నబోయినయ్.. మీ నాయనలెక్క మీరూ మంచిగ జెయ్యాలే.. మంచిపేరు తెచ్చుకోవాలి..’’ ఇవీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలకు రైతుల, మహిళల, వృద్ధుల విన్నపాలు. షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చండూరు మండలం బంగారిగడ్డకు చేరుకున్నాక గ్రామస్తులతో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా గ్రామస్తులు సమస్యలను షర్మిల సావధానంగా విన్నారు. వైఎస్సార్ మా ఊరికి రోడ్డు, బస్సు వేయించిండు. ఆయన పోయిన నెలరోజుల్లోనే బస్సును బంద్ చేసిండ్రు. తిరిగి బస్సు వచ్చేలా చూడమ్మా..అని గొల్లగూడెం గ్రామానికి చెందిన బొడ్డు లింగమ్మ షర్మిలను కోరింది. బెండలమ్మ చెరువు పనులకు వైఎస్సార్ రూ.1.12 కోట్లు విడుదల చేసినా ఆయన బతికునన్నినాళ్లు పనులు చేసి ఆ తర్వాత ఆపేశారని ఆమె షర్మిల దృష్టికి తెచ్చారు.

కల్తీ కల్లు తాగి నాకొడుకు పవన్ చనిపోయిండు.. అధికారులు మాత్రం కల్తీ కల్లు కాదని ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయడం లేదు.. అని బంగారిగడ్డకు చెందిన పవన్ తల్లి జయమ్మ షర్మిలతో చెప్పుకుంటూ బోరున విలపించింది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడూ గ్యాస్ ధరలు పెంచలేదు.. ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం మాటిమాటికీ పెంచుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని మరో మహిళ ఆవేదన వ్యక్తంచేసింది. కొడుకులు తనను సాకడం లేదని అధికారులకు ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా స్పందించడం లేదని మర్రిగూడ మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన కోయ రాజు షర్మిలకు విన్నవించుకున్నాడు. 80 సంవత్సరాల వయసున్నా నాకు పింఛన్ ఇప్పటికీ రావడం లేదని బంగారిగడ్డకే చెందిన లక్ష్మమ్మ తెలిపింది.

తన కొడుకు వికలాంగుడైనా నేటికీ రూ.500 ఇవ్వకుండా రూ.200 పింఛన్ మాత్రమే ఇస్తున్నారని ఆమె షర్మిల దృష్టికి తెచ్చారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కిరణ్, బొత్స సత్యనారాయణలు తమ కుర్చీలను కాపాడుకునేందుకు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓదార్చడం రాదని, అభివృద్ధిని ఏనాడో మర్చిపోయిందని విమర్శించారు. త్వరలో రాజన్న రాజ్యం వస్తుం దని, జగనన్న సీఎం అవుతారని, ప్రజా సమస్యలు తీరుస్తారని షర్మిల భరోసానిచ్చారు.

అంగడిపేటలో హారతులతో నీరాజనం
అంగడిపేట గ్రామానికి పాదయాత్ర చేరుకోగానే గ్రామ మహిళలు బోనాలతో తరలివచ్చి హారతి ఇచ్చి షర్మిలకు ఘనస్వాగతం పలికారు. షర్మిలను చూసేందుకు గ్రామంలోని చిన్నా, పెద్దా అందరూ పెద్ద ఎత్తున తరలివచ్చారు. మేమున్నామంటూ బోనాలతో వచ్చిన గ్రామ స్తులు అడుగులో అడుగేస్తూ కలిసి నడిశారు. గిరిజనులు డప్పుచప్పుళ్లతో, నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొన్నారు.

ఈ పాదయాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ ఇరుగు సునీల్‌కుమార్, మహిళా విభాగం కన్వీనర్ సత్యకుమారి, మైనార్టీ సెల్ కన్వీనర్ ఎండీ సలీం, నిజామాబాద్ జిల్లా పరిశీలకుడు గాదె నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు సిద్ధిపేట శేఖర్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కుంభం శ్రీనివాసరెడ్డి, మేకల ప్రదీప్‌రెడ్డి, ఎరెడ్ల శ్రీనివాస్‌రెడ్డి, గూడూరు సరళారెడ్డి, నకిరేకంటి స్వామి, అలుగుబెల్లి రవీందర్‌రెడ్డి, సిరాజ్‌ఖాన్, యర్నేని వెంకటరత్నం, తిప్పర్తి రుక్మారెడ్డి, వాసుదేవుల జితేందర్‌రెడ్డి, పిట్ట రాంరెడ్డి, నియోజకవర్గ నాయకులు బోయపల్లి అనంత్‌కుమార్, బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి, బోయపల్లి రామచంద్రం, పిట్ట విజయ్‌భాస్కర్‌రెడ్డి, మండల కన్వీనర్లు చెరుపల్లి సత్తయ్య, పంతంగి లక్ష్మణ్‌రావు, వెలగ రాజశేఖరరెడ్డి, సుర్కంటి వెంకటరెడ్డి తది తరులు పాల్గొన్నారు. 

నాన్న మాట ప్రకారం జగనన్న మీ ఊరికొస్తాడు : షర్మిల
మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చండూరు మండలం గొల్లగూడ క్రాస్ రోడ్డు వద్దకు చేరుకోగానే గ్రామస్తులు పెద్ద ఎత్తున షర్మిలను చూసేందుకు తరలివచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 2006లో ప్రజాపథం కార్యక్రమానికి ఇక్కడికి వచ్చారని, బెండలమ్మ చెరువు అభివృద్ధికి రూ.1.12 కోట్లు మంజూరు చేశారని, గొల్లగూడెం- పుల్లెంల రోడ్డు వేసేందుకు రూ.1.47కోట్లు మంజూరు చేశారని గ్రామస్తులు గుర్తు చేశారు. బెండలమ్మ చెరువు పనులు ప్రారంభమై మధ్యలోనే ఆగిపోయాయి. రోడ్డును మాత్రం వేశారు. గ్రామంలో ఉన్న గుడిసెలను చూసి, మీ ఊళ్లో అందరికీ ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తానని వైఎస్సార్ చెప్పారు. గుడిసెలు లేని గ్రామం అయ్యాక మళ్లీ వస్తానని హామీ ఇచ్చారు.. అని గ్రామస్తులు చెప్పారు. షర్మిల మాట్లాడుతూ నాన్నమాట ఇచ్చారు.. దురదృష్టవశాత్తు మన మధ్యలో లేరు. ఆయన మాట ప్రకారం జగనన్న సీఎం అయ్యాక తప్పకుండా మీ ఊరికొస్తాడు.. అని గొల్లగూడ గ్రామస్తులకు షర్మిల హామీ ఇచ్చారు. 

అధికారులు పట్టించుకోలేదు.. మీరే దిక్కు
- బోరున విలపిస్తూ వేడుకున్న బీరే జయమ్మ, బంగారిగడ్డ
నాది బంగారిగడ్డ. ఆశావర్కర్‌గా పనిచేసేదాన్ని. ఏడాది క్రితం కొంతమంది రాజ కీయ నాయకులు నాపై కక్షగట్టి లేనిపోని ఆరోపణలు సృష్టించి అధికారులకు ఫిర్యాదు చేసి నన్ను సస్పెండ్ చేయించిర్రు. నాకు భర్త లేడు. ఇద్దరు పిల్లలు. ఆస్తిపాస్తులు లేవు. పూరిగుడిసెలో ఉంటున్నా. కుటుంబం గడవడం లేదు. నేను ఏ తప్పు చేయలేదని రెండు సార్లువెళ్లి కలెక్టర్‌కు మొరపెట్టుకున్నా.. అయినా న్యాయం జరగలేదు. ఇక నాకు మీరే దిక్కు.. అంటూ బోరున విలపిస్తూ బంగారిగడ్డకు చెందిన బీరే జయమ్మ షర్మిలను వేడుకున్నది. 

రాజన్నను కలువలేకపోయిన
- కోటగోని కృష్ణయ్య, లెంకలపల్లి 
నాది మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామం. కూలి పనిచేస్తూ పూట గడుపుకుం టున్నా. నా కుమారుడు నగేశ్‌కు 2006లో తలకు చీము వచ్చింది. ఆపరేషన్ చేయించుకునే స్థితిలో లేను. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డిని కలిసి సమస్యను వివరించాను. వెంటనే పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రికి పంపించారు. ఆ తర్వాత వైద్యులు ఆపరేషన్ చేస్తే గ్యారెంటీ లేదని చెప్పారు. అయినా ఆపరేషన్ చేయించిన. సక్సెస్ అయ్యింది. తర్వాత రాజ న్నను కలుద్దామని అనుకున్నా.. దురదృష్టవశాత్తు కలువలేకపోయాను.. మీలో ఆయన్ను చూసుకుంటున్న.. అని లెంకలపల్లికి చెంది న కోటగోని కృష్ణయ్య తెలిపాడు. 

నడిపిస్తున్న అభిమానం.. 
చెప్పులు వదిలేశాడు.. క్షౌరం మానేశాడు.. రెండు నెలలు దాటింది.. సుమారు 900 కిలోమీటర్లు దూరం.. ఇలా షర్మిల పాదయాత్రలో పాల్గొం టున్నాడు గజ్జల వెంకటకృష్ణారెడ్డి. ఆయనది గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం మాచవరం స్వగ్రామం. ఆయనకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే వల్లమాలిన అభిమానం. ఆ మహానేత ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథ కం ద్వారా పునర్జన్మ పొందాడు. ఆ రుణం తీర్చుకోవడానికే ఈ పాదయాత్రలో దీక్షతో పాల్గొం టున్నానంటున్నాడు. చెప్పులు ధరించకుండా, క్షౌరం చేయించుకోకుండా, కాళ్లకు బొబ్బలెక్కినా, శరీరం సహకరించకపోయినా వెనుకడుగు వేయడం లేదు. 

తనకు చేసిన సాయం కంటే ఇది చిన్నదేనని చెప్పడం వైఎస్సార్‌పై ఆయనకున్న అభిమానానికి నిదర్శనం. పాదయాత్ర మొదలైన వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి వెంకటకృష్ణారెడ్డి షర్మిల వెంట నడుస్తున్నాడు. ఆయన కుటుంబం కూడా సహకరించడం విశేషం. ఇచ్ఛాపురం వరకు నడుస్తామని గట్టిగా చెబుతున్న ఆయన అక్కడికి చేరుకున్నాకే చెప్పులు ధరిస్తానని, క్షౌరం చేయించుకుంటానని ధృడ సంకల్పంతో చెప్పాడు. అవసరమయ్యే డబ్బు కోసం ఎవర్నీ అడిగే అల వాటు అతనికి లేదు. భోజనం మినహా అన్ని ఖర్చులూ తన సొంత డబ్బులతోనే భరిస్తున్నాడు. నెలనెలా కుటుంబ సభ్యులే బ్యాంకు ఖాతాలో వేసిన డబ్బులనే వినియోగించుకుంటున్నాడు. మరో విశేషమేమంటే గతంలో మహానేత వైఎస్సార్ చేపట్టిన పాదయాత్రలోనూ ఈయన 500 కిలోమీటర్లు నడిచాడు. ‘‘రాజన్న ప్రవేశపెట్టిన పథకాలు అమలు కావాలన్నదే నా కోరిక. అది ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ద్వారానే సాధ్యమవుతుందని నా నమ్మకం.’’ అని ఆయన చెప్పాడు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!