YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 15 February 2013

ఒక కుక్కను చంపాలంటే పిచ్చికుక్కగా ముద్రవేయాలనేది సామెత

నష్టాల్లేని పరిశ్రమను ఖాయిలా తీయించిన చంద్రబాబు ‘పాలసీ’లు
రైతులు, షేర్ హోల్డర్లకు తెలియకుండానే 2002లో అమ్మకానికి
చంద్రబాబు కనుసన్నల్లోనే బిడ్డింగ్ ప్రక్రియ
కలెక్టర్, ఆడిట్ విభాగం అంచనా వేసిన ధరకంటే అతి తక్కువకే నామాకు అప్పగింత
షేర్ హోల్డర్లకు డబ్బులూ ఇవ్వలేదు

 ఒక కుక్కను చంపాలంటే పిచ్చికుక్కగా ముద్రవేయాలనేది సామెత..
ప్రభుత్వరంగ సంస్థలను తన వారికి తెగనమ్మాలంటే వాటిని ఖాయిలా పరిశ్రమలుగా మార్చాలనేది చంద్రబాబు పాలసీ..

చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్క దానిని కూడా బతకనీయలేదు. వాటిని ఆయన అనుయాయులకు కట్టబెట్టేందుకు కుట్రపూరిత ప్రణాళికలతో ఖాయిలా పరిశ్రమలుగా మార్చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘ఇప్లిమెంటేషన్ సెక్రటేరియట్’ను స్థాపించారు. ప్రతి ప్రభుత్వ పరిశ్రమనీ కారుచౌకగా అనుయాయులకు అప్పగించారు. సొంత హెరిటేజ్ డెయిరీ కోసం ప్రభుత్వ డెయిరీనే నాశనం చేసిన బాబు.. మిగతా ప్రభుత్వరంగ సంస్థలకూ ఇదే గతి పట్టించారు.

ఎగుమతులు లేక రాష్ట్రంలో చక్కెర నిల్వలు పేరుకుపోయి షుగర్ ఫ్యాక్టరీలు తీవ్ర నష్టాల్లో ఉన్న సమయంలో.. రెండు లక్షల టన్నుల చక్కెర దిగుమతి చేసుకొని రాష్ట్ర పరిశ్రమలను కోలుకోని విధంగా దెబ్బతీశారు. వస్త్ర పరిశ్రమలపై పన్నులు పెంచి స్పిన్నింగ్ మిల్లులను పెను సంక్షోభంలోకి నెట్టారు. చంద్రబాబు విధానాలతో రాష్ట్రంలోని ప్రభుత్వరంగ సంస్థలు తీవ్రంగా దెబ్బతిని, నష్టాల ఊబిలోకి కూరుకుపోయాయి. ఆ వెంటనే వాటిపై ఖాయిలా ముద్ర వేసి, తన పని కానిచ్చేశారు. ఇలా నష్టాల సాకుతో 71 సహకార చక్కెర, స్పిన్నింగ్ మిల్లులను దశలవారీగా ప్రైవేటు పరం చేసేందుకు ప్రణాళిక రచించారు. దాదాపు రూ.1,500 కోట్ల విలువ చేసే 20 మిల్లులను కేవలం రూ.300 కోట్లుకు అమ్మేశారు. వీటిలో ఖమ్మం జిల్లాలోని పాలేరు షుగర్స్ కూడా ఒకటి. ఎటువంటి నష్టాలు లేకుండా నడుస్తున్న ఈ పరిశ్రమను ముందుగా ఖాయిలా పడేలా చేశారు. ఆ తర్వాత బిడ్డింగ్ డ్రామాతో బాబుకు సన్నిహితుడైన నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ సంస్థ చేతుల్లో పెట్టారు. రైతులు, షేర్ హోల్డర్లకు, కనీసం సహకార సంఘం సభ్యులకు కూడా చెప్పకుండా ఈ మంత్రాంగమంతా నడిపించేశారు. రూ. 22 కోట్లు విలువైన కర్మాగారాన్ని కేవలం రూ. 9.58 కోట్లకే ధారాదత్తం చేశారు.

రైతులు, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరీపురం, అమ్మగూడెం గ్రామాల మధ్య 1976లో పాలేరు చక్కెర కర్మాగారాన్ని నిర్మించారు. 1984లో ఇక్కడ చక్కెర ఉత్పత్తి మొదలైంది. ఈ కర్మాగారంలో 84 శాతం ప్రభుత్వ వాటా కాగా, 16 శాతం రైతుల వాటా ఉంది. అప్పట్లో ఒక్కొక్క షేర్ రూ.500 చొప్పున మూడు వేల మంది రైతులు 4,600 షేర్లు కొనుగోలు చేశారు. 2002 డిసెంబర్‌లో ఈ పరిశ్రమను నామా నాగేశ్వరరావుకు అప్పగించే సమయానికి ఈ షేర్ల విలువ రూ.3 కోట్లు. ఎటువంటి లాభ నష్టాలు లేకుండా నడుస్తున్న ఈ పరిశ్రమ చంద్రబాబు ఆర్థిక విధానాల పుణ్యమా అని నష్టాల్లోకి వెళ్లింది. తొలిసారిగా రూ.2 కోట్ల రన్నింగ్ నష్టం వచ్చింది. ఇదే కారణాన్ని చూపి చంద్రబాబు 2002లో కంపెనీని అమ్మకానికి పెట్టారు. ఈ విషయం ముందుగా రైతులకు, షేర్ హోల్డర్లకు తెలియజేయలేదు. నిజానికి తెలుగుదేశం ప్రభుత్వమే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.సుబ్రమణ్యం చైర్మన్‌గా ఒక ఉన్నతస్థాయి కమిటీని వేసింది.

‘పాలేరు షుగర్స్‌ను నమ్ముకొని ప్రత్యక్షంగా 8 వేల మంది రైతులు, 3 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా మరో 5 వేల మందికి ఉపాధి లభిస్తోంది. ప్రభుత్వం కొద్దిగా చేయూతనందిస్తే ఈ పరిశ్రమ అన్ని సమస్యలను అధిగమించి, మెరుగైన లాభాలను ఆర్జిస్తుంది’ అని ఈ కమిటీ సిఫారసు చేసింది. చంద్రబాబు ఈ సూచనలను పట్టించుకోలేదు. కనీసం స్థానిక సహకార సంఘం అనుమతి కూడా తీసుకోకుండా 280 నుంచి 328 వరకు సర్వే నంబర్లలో ఉన్న 134. 23 గుంటల భూమితో పాటు, యంత్రాల విక్రయానికి నోటిఫికేషన్ ఇచ్చారు. 134 ఎకరాల భూమి విలువ రూ.9.40 కోట్లు, యంత్రాలు, ఇతర వస్తువుల విలువ రూ.12 కోట్లు, మొత్తం రూ.21.40 కోట్లుగా అప్పటి జిల్లా కలెక్టర్ లెక్కించారు. జిల్లా సహకార సంఘం ఆడిట్ విభాగం దీని విలువ రూ.22 కోట్లుగా అంచనా వేసింది. ఇక బిడ్డింగ్ వ్యవహారమంతా చంద్రబాబు కనుసన్నల్లోనే నడిచింది.

ఎవరు బిడ్ వేయాలి, ఎంత సొమ్ము కోట్ చేయాలి, డమ్మీలుగా ఎవరు బిడ్ వేయాలో ముందే నిర్ణయమైంది. ఈ పథకం ప్రకారం నామా నాగేశ్వర్‌రావు రూ.9,58,88,888కు బిడ్ వేయగా, పి.వెంకటేశ్వర్లు రూ.7,77,15,000కు బిడ్ వేశారు. ఇతను డమ్మీ అభ్యర్థి అని అందరూ చెబుతుంటారు. మరో విశేషం ఏమిటంటే ప్రముఖ పారిశ్రామికవేత్త, చంద్రబాబు సన్నిహితుడు గోకరాజు రంగరాజుకు ఒక రకంగా ఖమ్మం జిల్లా ముఖ్య వ్యాపార కేంద్రం. ఆయన వ్యాపారమంతా ఇక్కడే ఉంది. అలాంటిది గోకరాజు పాలేర్ షుగర్స్ కోసం కనీసం బిడ్ కూడా వేయలేదు. దీనినిబట్టి చూస్తే పథకం ప్రకారమే అంతా జరిగిందన్న విషయం బోధపడుతుంది. 2002 డిసెంబర్‌లో పరిశ్రమ నామా నాగేశ్వర్‌రావుకు చెందిన మధుకాన్ సంస్థ పరమైంది. అప్పటికి పరిశ్రమలో 30 వేల క్వింటాళ్ల చక్కెర నిల్వలున్నాయి. వీటి విలువే రూ.2.10 కోట్లు ఉంటుందని అంచనా. రైతుల షేర్ల విలువ రూ.3 కోట్లు. ఈ మొత్తాన్ని ప్రభుత్వంగానీ, నామా నాగేశ్వర్‌రావు గానీ రైతులకు చెల్లించలేదు. ఈ విధంగా జిల్లా కలెక్టర్ అంచనా వేసిన విలువ (21.40 కోట్లు)కన్నా, జిల్లా సహకార సంఘం ఆడిట్ విభాగం అంచనా (22 కోట్లు)కన్నా అతి తక్కువ ధర (రూ.9.58 కోట్లు)కే పాలేరు షుగర్స్ ఫ్యాక్టరీ నామా వశమైంది. ప్రస్తుతం ఆ కర్మాగారం రోజుకు 4 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి, క్రషింగ్ సామర్థ్యంతో పనిచేస్తోంది.

బాబు సంతర్పణలు మరికొన్ని..

రూ.35 కోట్లు విలువచేసే నెల్లూరు స్పిన్నింగ్ మిల్లును కేవలం రూ. 12.33 కోట్లకే చంద్రబాబుకు సన్నిహితుడైన సి.ఎం.రమేష్‌కు చెందిన రిత్విక్ ఎంటర్ ప్రైజెస్‌కు కట్టబెట్టారు. రూ.6 కోట్ల విలువైన గురజాల చక్కెరమిల్లు, రూ.30 కోట్లు పలికే ఇంకొల్లు నూలు మిల్లును కలిపి కేవలం రూ.9.86 కోట్లకే నూజివీడు సీడ్స్‌కు ఇచ్చేశారు. ఈ సంస్థ టీడీపీతో సన్నిహితంగా మెలుగుతుంది. అదేవిధంగా హైదరాబాద్‌లోని రిపబ్లిక్ ఫోర్జ్ కంపెనీని ఏకంగా అప్పటి హోం మంత్రి దేవేందర్‌గౌడ్ తమ్ముడు అశోక్ గౌడ్ కొన్నారు. ఇవే కాకుండా నిజాం షుగర్స్, పాలకొల్లు, నంద్యాల, హిందూపురం చక్కెర మిల్లులు, అదిలాబాద్ స్పిన్నింగ్ మిల్లును కూడా చంద్రబాబు పరివారగణానికి కారుచౌకగా ధారాదత్తం చేశారు.

అక్రమాలపై చర్యలేవీ: కాంగ్రెస్ ఎమ్మెల్సీలు

 నిజాం షుగర్స్ ప్రైవేటీకరణ, ఆస్తుల అమ్మకానికి సంబంధించిన అక్రమాలపై కోర్టులు జోక్యం చేసుకొనేంతవరకు చర్యలు తీసుకోకపోవడం దౌర్భాగ్యమని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు కే యాదవరెడి ్డ, కేఆర్ ఆమోస్ విమర్శించారు. సీఎల్పీ కార్యాలయం వద్ద శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా నిజాం షుగర్స్‌ను, రూ.కోట్ల విలువైన ఆస్తులను కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు విక్రయించారని, ఇందులో అప్పటి మంత్రులు, అధికారులకు కూడా సంబంధముందని ఆరోపించారు. సభాసంఘం సిఫార్సులను అమలు చేయకపోవడానికి కారణాలేమిటో బయటకు రావాలన్నారు. నిజాం షుగర్స్‌ను కొనుగోలు చేసిన వ్యక్తులకు అధికారంలో ఉన్న వారితో బంధుత్వాలు ఉన్న కారణంగానే కమిటీ సిఫార్సులను పట్టించుకోవడం లేద ని ఆరోపణలు వస్తున్నాయన్నారు.

తప్పుడు అప్పులు చూపారు: కేటీఆర్

నిజాం షుగర్స్‌కు తప్పుడు అప్పులు చూపించి అప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు తక్కువ ధరకు అమ్మేశారని టీఆర్‌ఎస్ శాసనసభ్యుడు కె.తారక రామారావు  ఆరోపించారు. ఈ అమ్మకం అతిపెద్ద ఆర్థిక అవకతవకలతో కూడుకున్నదని శాసనసభా కమిటీ తప్పుపట్టిందని, హైకోర్టు కూడా మందలించిందన్నారు. చంద్రబాబుతోపాటు అప్పటి ఆర్థిక, పరిశ్రమలు, చక్కెర శాఖామంత్రులు ఈ ఆర్థిక నేరానికి బాధ్యులని శాసనసభా కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. అనంతరం వైఎస్, రోశయ్య, కిరణ్ సీఎంలుగా ఉన్నా చర్యలు తీసుకోకపోవటానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. ల్యాంకో, జీఎంఆర్ విద్యుత్ సంస్థల నుంచి కరెంట్‌ను ఎక్కువ ధరకు కొనడం తో ప్రజలపై రూ.2 వేల కోట్ల భారం పడిందన్నారు. ల్యాంకో, జీఎంఆర్ నుంచి డబ్బు రికవరీ చేయకుంటే న్యాయపోరాటానికి దిగుతామని హెచ్చరించారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!