YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 15 February 2013

వైఎస్ జగన్‌తో కలిసి పనిచేస్తా

చంచల్‌గూడ జైల్లో జగన్‌తో ప్రత్యేక ములాఖత్

 తెలుగుదేశం అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతోందని, దీనిపై తాను తీవ్రంగా కలత చెందానని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే పిరాయి సాయిరాజ్ చెప్పారు. పార్టీలో సమస్యలు పరిష్కరించలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారన్నారు. చంచల్‌గూడ జైల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన శుక్రవారం ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి టీడీపీ ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని చెప్పారు. తన రాజకీయగురువు ఎర్రన్నాయుడు అకాలమరణంతో పార్టీలో తన పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు. రాజకీయాల నుంచి వైదొలగుదామని నిశ్చయించుకున్న తరుణంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఏవిధంగా లాభం చేకూర్చాయో గుర్తొచ్చాయని చెప్పారు. అలాంటి ప్రజాసేవకే పూనుకున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి పనిచేసేందుకు తాను నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్యాకేజీలకు అమ్ముడుపోయే వ్యక్తిత్వం తనది కాదని, ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పారు. త్వరలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతానన్నారు. జగన్‌ను కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యే సాయిరాజ్ వెంట నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ తోపాటు శ్రీకాకుళం జిల్లా వైఎస్‌ఆర్ సీపీ కన్వీనర్ పద్మప్రియ కృష్ణదాస్, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు ఉన్నారు. 

ప్రజలను మోసగిస్తున్న బాబు: అధికారం కోసం సొంత మామకే వెన్నుపోటు పొడిచిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తారో స్పష్టం చేయాలని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కలమట మోహన్‌రావు అన్నారు. తన కుమారుడు, టీడీపీ నేత కలమట వెంకటరమణతో కలిసి శుక్రవారం చంచల్‌గూడ జైల్లో జగన్‌ను ఆయన కలిశారు. ఈ సందర్భంగా మోహన్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ తరఫున ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై 2008లో కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పారు. వైఎస్ మృతి తర్వాత ఆయన పథకాలకు కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడిచిందన్నారు. 

విజయమ్మను కలిసిన సాయిరాజ్

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే పి.సాయిరాజ్ శుక్రవారమిక్కడ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ నేతలు కలమట వెంకటరమణమూర్తి, మోహన్‌రావు విజయమ్మతో భేటీ అయ్యారు. వీరి వెంట ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, సుజయకృష్ణ రంగారావు, ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డితో పాటు దర్మాన పద్మప్రియ ఉన్నారు. మరోవైపు విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి ఆంజనేయరాజు శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు. ఆయనను వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆంజనేయరాజుతో పాటు పలువురు నేతలు పార్టీలో చేరారు. వీరి వెంట పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తదితరులున్నారు.



పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేని టీడీపీ సస్పెండ్ చేసింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకున్నశ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం శాసనసభ్యుడు పిరియా సాయిరాజ్‌ను సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున సాయిరాజ్‌పై ఈ చర్యతీసుకున్నట్టు పార్టీ మీడియా కమిటీ ఛైర్మన్ ఎల్వీఎస్సార్కే ప్రసాద్ మీడియాకు పంపిన ఎస్సెమ్మెస్‌లో తెలిపారు. సాయిరాజ్‌తో పాటు శుక్రవారం జగన్‌ను కలుసుకున్న శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి కలమట వెంకట రమణను కూడా సస్పెండ్ చేసినట్లు ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర శాసనసభకు 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున 92 మంది ఎన్నికకాగా, ఇప్పటివరకూ 15 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. ప్రస్తుతం శాసనసభలో టీడీపీకి 77 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ తరఫున ఉన్న ఏకైక శాసనసభ్యుడైన సాయిరాజ్ కూడా పార్టీని వీడటంతో ప్రస్తుతం ఆ జిల్లా నుంచి టీడీపీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!