ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమయిన మతాలన్నీ దేవుడిమీద భక్తినే కాదు- భయాన్ని కూడా బోధించాయి. ‘దేవుడంటే భయపడడం వివేకానికి తొలిమెట్టు’ అన్నారు పెద్దలు. కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దలు దేవుడికి పెద్దగా భయపడుతున్నట్లు తోచదు. ఇటీవల టీటీడీ పాలకమండలి సభ్యులుగా నియమితులయినవారిని గమనిస్తే మరోలా ఎలా అనిపిస్తుంది?
తాజాగా నియమితులయిన టీటీడీ పాలకమండలి సభ్యుల్లో సదరన్ రెయ్‌ల్వే మజ్దూర్ యూనియన్ (ఎస్‌ఆర్‌ఎంయూ) నాయకుడు కన్నయ్య ఒకరు. ఈయన తమిళనాడుకు చెందిన వ్యక్తి. సామాన్య రెయ్‌ల్వే ఉద్యోగిగా జీవితం మొదలుపెట్టిన కన్నయ్య చకచకా మెట్లెక్కి మహానాయకుడిగా అవతారమెత్తారు. అయితే, ఆ క్రమంలో ఆయన ఎన్నో ఘోరాలకూ, నేరాలకూ పాల్పడ్డారన్నది కన్నయ్య సహచరులే చేస్తున్న ఆరోపణ. కన్నయ్య ఎదుగుదలకు కారకుడయిన సదరన్ రెయ్‌ల్వే కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి నమశ్శివాయను ఈ శిష్యపరమాణువే పేల్చి, మాయం చేసిందని -ఒకప్పటి- ఆయన సహచరులే ఆరోపిస్తున్నారు. ప్రధాన కార్యదర్శి పదవిపై కన్నేసిన కన్నయ్య, కుట్రపన్ని నమశ్శివాయను అడ్డు తొలగించుకున్నారన్నది వారి ఆరోపణ. అంతేకాదు- ఆ మేరకు కన్నయ్యపై తమిళనాడు సర్కారువారు కేసు కూడా వేశారు. ఆ కేసుపై విచారణ మద్రాస్ హైకోర్టులో ఇప్పటికీ కొనసాగుతోంది. కానీ, టీటీడీ పెద్దలు ఇదేమీ పట్టించుకోకుండా కన్నయ్యను టీటీడీ పాలకమండలి సభ్యునిగా నియమించడం దారుణమని సదరన్ రెయ్‌ల్వే కార్మిక సంఘం నేతలు -మీడియా మీట్ పెట్టి మరీ- దులిపేశారు. దేవుడంటే, టీటీడీ పెద్దలకు భయంగానీ, భక్తిగానీ ఉంటే, కన్నయ్యలాంటి దుర్మార్గుణ్ణి ఇలాంటి పదవిలో నియమించరని వాళ్లు ఘాటుగా విమర్శించారు.
ఇంతకీ కన్నయ్య ఘనచరిత్ర టీటీడీ పెద్దలకు తెలుసో లేదో పాపం? శుభ్రంగా తెలుసంటున్నారు ఎస్‌ఆర్‌ఎంయూ నేతలు. కన్నయ్య తమ యూనియన్‌ను సొంత ఆస్తిలా పరిగణించి దారునంగా దుర్వినియోగం చేశారని వాళ్లు వెల్లడించారు. 1400 కోట్ల రూపాయల మేరకు తమ సొసైటీ డబ్బు దిగమింగాడని వారు కన్నయ్యపై ఆరోపణలు సంధించారు. ఈ విషయంలో తాము ఆరోపణల పత్రం -సాక్ష్యాధారాలతో సహా- సీబీఐకి సమర్పించామని యూనియన్ నేతలు మీడియాకు తెలిపారు.
అన్యమతస్తులు తిరుమల సందర్శిస్తే, తమ మతపరమయిన అస్తిత్వం గురించి ప్రకటన చెయ్యాలని టీటీడీ ఇటీవల హడావిడి చేసిన సంగతి తెలిసిందే. చిత్రమేమిటంటే, టీటీడీ పెద్దలు కొత్తగా పాలకమండలిలోకి తీసుకున్న కన్నయ్య భార్యామణులిద్దరూ క్రైస్తవులేనట. తన భార్యల విషయంలో కన్నయ్య దగ్గిరనుంచి టీటీడీ ఏమయినా డిక్లరేషన్ తీసుకుందా? అని నిలదీస్తున్నారు మజ్దూర్ యూనియన్ నేతలు. కన్నయ్య ఘనకార్యాలను గురించి సవివరంగానూ, స్పష్టంగానూ టీటీడీ పెద్దలకు తెలియచేశామనీ, అతగాడు టీటీడీ పాలకమండలి సభ్యుడిగా అనర్హుడనీ తాము నాడో చెప్పామనీ వారు వెల్లడించారు. ఇంత తెలిసినా, టీటీడీ పెద్దలు కన్నయ్యను పాలకమండలి సభ్యుడిగా ఎంపిక చెయ్యడం వెనక ఉన్న బలమయిన కారణాలేమిటో శోధించాలని వారు కోరారు.
‘అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న’ అన్నట్లుంది మరో పాలకమండలి సభ్యుడు శివప్రసాద్ వ్యవహారం. ఈ శివప్రసాద్ ఎవరో కాదు- మెగాస్టార్ చిరంజీవికి స్వయానా వియ్యంకుడే ఆయన. ఈ ఏడాది జూన్ నెలలో మన రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా ఈ పెద్దమనిషి వార్తలకెక్కారు. మద్రాస్‌లోని శివప్రసాద్ ఇంటిపై ఆదాయం పన్ను శాఖ చేసిన దాడిలో 35 కోట్ల రూపాయల నగదు దొరికిన సంగతి అందరికీ తెలుసు. ఈ మొత్తం 35 పెట్టెల్లో జాగ్రత్తగా సర్దిపెట్టి ఉండడం విశేషం. ఈ మొత్తానికి సంబంధించి ఇంతవరకూ ఏ విషయం తేలలేదు. కేసు ఇప్పటికీ నలుగుతూనే ఉంది. ఇలాంటి సచ్చరిత్రుడిని తీసుకొచ్చి టీటీడీపాలకమండలి సభ్యుడిగా నియమించడంలోని ఔచిత్యమేమిటని భక్తులు నిలదీస్తున్నారు.
రాజకీయ నిరుద్యోగులకు టీటీడీని పునరావాస కేంద్రంగా మారుస్తున్నారన్న విమర్శ ఏనాటినుంచో ఉంది. సాక్షాత్తూ టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు విషయంలోనే ఈ విమర్శ ఎదుర్కోవలసి వచ్చింది. కేంద్రంలో మంత్రిపదవి ఇప్పించమని వేధిస్తున్న బాపిరాజు పీడ విరగడ చేసుకోడానికే ఆయన్ను టీటీడీ పదవిలో నియమించినట్లు గతంలో విమర్శలొచ్చాయి. ఈ మధ్యన ఆయన పదవీకాలం పొడిగించడం వెనక కూడా ఇలాంటి -రాజకీయ- కారణాలే ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు, కన్నయ్య- శివప్రసాద్ లాంటి నేరస్తులను తీసుకెళ్లి టీటీడీ పాలకమండలి సభ్యులుగా నియమించడంతో ఈ విమర్శలు మిన్నంటుతున్నాయి. గతంలో డాలర్ శేసాద్రి తదితరుల కుంభకోణాల కారణంగా టీటీడీ అప్రతిష్టపాలయింది. ఇప్పటికీ డాలర్ శేసాద్రి టీటీడీ వ్యవహారాల్లో కీలకమయిన ప్రాధాన్యం కలిగి ఉండడం -టీవీ చూసేవాళ్లందరికీ- తెలిసిందే.
టీటీడీ పెద్దలు భగవంతుడికే పంగనామం దిద్దుతున్నారని బాధపడే భక్తుల సంఖ్య నానాటికీ పెరగడానికి ఇలాంటి చర్యలే కారణమవుతున్నాయి.
No comments:
Post a Comment