YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 2 September 2012

రాజశేఖరా నిను మరువలేమయా

మనిషి మరణించాక కూడా బతికే ఉండాలని నమ్మిన మహా మనీషి వైఎస్ రాజశేఖరరెడ్డి. దాన్ని జీవితాంతం నమ్మి ఆచరించారు గనుకే జనం గుండెల్లో ఆయన చిరంజీవిగా నిలిచిపోయారు. ఆయన ఓ మంచి నాయకుడు, మంచి తండ్రి, పేదల కోసం తపించిన మనసున్న మహరాజు. మహానేత మనమధ్య నుంచి వెళ్లిపోయి నేటికి మూడేళ్లు... కోట్లాది మంది గుండెల్లో అంతులేని శోకాన్ని మిగిల్చి వెళ్లిపోయారు. తాను వెడలినా, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో వైఎస్ ప్రజల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారు.

నమస్తే అన్నా... నమస్తే అక్క... నమస్తే చెల్లెమ్మా... అంటూ ఆంధ్ర జనులను ఆప్యాయంగా పలకరించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గొంతు మూగబోయి నేటికి మూడేళ్లు. అభయ హస్తం.. ఆరోగ్యశ్రీ.. ఫీజు రీయింబర్స్‌మెంట్.. పీఆర్‌సీ వేతనాల పెంపు... పల్లెబాట... జలప్రభ... తదితర ప్రజా సంక్షేమ పథకాలతో ఇంటింటా ఒక ఆశాదీపం వెలిగించిన ఆంధ్రుల మణిదీపం కొండెక్కినా.. ప్రజల మది ఆకాశంలో నిండు జాబిల్లిగా వెలుగొందుతోంది. 2009 సెప్టెంబర్ 2న ఉదయం చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కర్నూలు జిల్లాలో దారితప్పింది.

విషయం తెలిసి యావత్ రాష్ట్రం కలవరపడింది. పావురాలగుట్ట జనసంద్రమైంది.. ఆయన కోసం నిలువెల్లా కనులు చేసుకొని.. చెట్టూపుట్టా కలియతిరిగారు. ఏదైతే జరగకూడదని ప్రజలు ముక్కోటి దేవుళ్లకు మొక్కుకున్నారో అదే జరిగింది. రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిన మహానేత వైఎస్‌ఆర్‌ను తలుచుకుని రాష్ట్రం మొత్తం దుఃఖసాగరంలో మునిగిపోయింది. తమ కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన రాజన్న తిరిగి రాడా... అంటూ విలపించింది.

మహానేత నల్లమల అడవిలో ఒదిగిపోగా.. నల్లకాల్వ కన్నీటి సాగరమైంది. తెలుగు తల్లి సిగలో నందివర్ధనమై అలరారిన ఆ మహానేత భౌతికంగా దూరమైనా.. ప్రజల గుండె గుడిలో కొలువయ్యారు. ఆ అపురూప మందస్మిత వదనాన్ని తల్చుకుంటూ ప్రతి గుండె వైఎస్‌ఆర్ అమర్ రహే.. అంటూ నినదిస్తోంది.

ఆయన మరణించి మూడు సంవత్సరాలు అయినా ఇప్పటికీ వైఎస్ ను తలుచుకోనివారు ఉండరు. మహానేత భౌతికంగా తమ మధ్య లేకపోయినా... ఆయన అందించిన స్ఫూర్తిని... జీవింతాంతం గుర్తుంచుకునే విధంగా రాష్ట్రంలోని పలు గ్రామాల్లో వైఎస్ ఆలయాలు వెలిశాయి. భగవంతుడితో సమానంగా ఆయన నిత్యం పూజలు అందుకోవటం విశేషం.

మహానేత వైఎస్ శ్వాస, ధ్యాస ప్రజా సంక్షేమమే.... ఊపిరి ఆగిపోయేంతవరకు ప్రజల కోసమే పరితపించారు. అందుకే ఆయన జనహృదయాల్లో దేవుడిలా కొలువు దీరారు. పేదల అభ్యున్నతే లక్ష్యంగా జీవించిన మహానేత వైఎస్‌ఆర్.. జనహృదయ నేతగా, జలయజ్ఞ ప్రదాతగా పేరు గడించారు. అలాంటి మహానేత మనకు దూరమై ఆదివారంతో మూడేళ్లు అయ్యింది. వైఎస్‌ఆర్ భౌతికంగా దూరమైనా ఆయన జ్ఞాపకాలు జనం హృదయూల్లో ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!