ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే చర్చ దాదాపుగా జరగడం లేదు. ఫలితాల గురించి ఎవరికీ అనుమానం లేదు. కాకపోతే... ద్వితీయ స్థానాన్ని ఎక్కువగా దక్కించుకునేది కాంగ్రెసా లేక టీడీపీయా? 2014 వరకు రాష్ట్ర ప్రభుత్వం నెట్టుకురాగలదా? అనే అంశాలపైనే ఊహాగానాలు సాగుతున్నాయి.సీబీఐ, 2014 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలోకి దిగితే మంచిది కామోసు. కొద్దికాలంగా అది రాష్ట్రంలోకెల్లా అత్యంత చురుకైన రాజకీయ శక్తిగా పనిచేస్తోం ది. ఓటర్లు దానికి కూడా కొన్ని ఓట్లు వేస్తారో ఏమో ఎవరికి తెలుసు. ఎన్నికల నిధుల కోసం సీబీఐ ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రచారం సందర్భంగా ఇతర పార్టీల నుంచి తాను స్వాధీనం చేసుకునే కోట్లా ది రూపాయలనే వాడుకోవచ్చు.
1990లలో జోరుగా సాగుతున్న నయా ఉదారవాద ప్రైవేటీకరణను అపహాస్యం చేస్తూ ఆస్ట్రేలియాలో ఓ అభ్యర్థి ఎన్నికల బరిలోకిదిగాడు. మురుగు, పారిశుధ్యాలను ప్రైవేటీకరించాలని డిమాండు చేశాడు. ‘ప్రతివ్యక్తీ తను విసర్జించే వ్యర్థాల బాధ్యతను తానే మోయాలి’ అని నినదించాడు. చివరికి, సరదాగానే పోటీకి దిగానంటూ అతడు తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నా అతనికి కొన్ని ఓట్లు పడ్డాయి. అతగాడిలాగా ఆషామాషీగా పోటీకి దిగిందన్న ముద్రపడకుండా జాగ్రత్తవహిస్తే ఫలితాలపై సీబీఐ ఆశలు పెట్టుకోవచ్చు.
ఏపీలో ఇప్పుడు జరుగుతున్న పద్దెనిమిది శాసనసభ, ఒక లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే చర్చ దాదాపుగా జరగడం లేదు. ఫలితాల గురించి ఎవరికీ అనుమానం లేదు. కాకపోతే... ద్వితీయ స్థానాన్ని ఎక్కువగా దక్కించుకునేది కాంగ్రెసా లేక టీడీపీయా? పోలింగ్ రోజైన జూన్ 12లోగా ఎంత మంది, ఫలితాల తర్వాత ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీలోకి ఫిరాయిస్తారు? రాష్ట్ర ప్రభుత్వంపై ఫలితాల ప్రభావం ఎలా ఉండబోతోంది? 2014 వరకు అది నెట్టుకురాగలదా? ఆధిక్యతలు ఎలా ఉం టాయి? అనే అంశాలపైనే ఊహాగానాలు సాగుతున్నాయి. తక్కువలో తక్కువగా వైఎస్సార్‌సీపీ 14 స్థానాలను గెలుచుకుంటుందని అన్ని పక్షాలు అం చనా వేస్తున్నాయి. పోటీ జరిగేది మిగతా నాలుగు స్థానాలలోనే అని అంతా అంగీకరిస్తున్నారు.
ఉప ఎన్నికల ఫలితాలపైనగాక, ఎన్నికల తదుపరి పర్యవసానాలపైనే ప్రధానంగా చర్చసాగుతోంది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుకు వ్యతిరేకంగా చర్చనడుస్తోంది. వైఎస్సార్ కుమారుడు జగన్‌తో కలిసి ఎందరెందరో ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం చర్చనీయమవుతోంది. విడవక వెన్నాడుతున్న వైఎస్సార్ ప్రభావం కాంగ్రెస్‌ను ఇంచుమిం చుగా విదూషక స్థాయికి చేర్చింది. వైఎస్సార్ అవినీతిని దుయ్యబడుతూ కాంగ్రెస్, తమ కార్యాలయాల్లోని ఆయన కటౌట్లనన్నింటినీ తొలగించింది. గత ఏడాది జరిగిన కడప ఉపఎన్నికల్లో జగన్‌కు వ్యతిరేకంగా పోటీ చేస్తూ అది వైఎస్సార్ వారసత్వం తమదేనని వాదించింది!
2009లో వైఎస్సార్ మరణం తదుపరి ఆయన కుమారుడు జగన్ సీఎం కావడాన్ని నివారించాలని కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ నేత కె.రోశయ్యను రాష్ట్రంపై ముఖ్యమంత్రిగా రుద్దింది. ప్రజావ్యతిరేకత సద్దుమణగకపోగా, రాష్ట్రంలో పార్టీ పుట్టి మునుగుతుండటంతో ‘అరోగ్యపరమైన కారణాలతో’ ఆయన సీఎం పదవిని త్యజించారు.
సొంత నియోజకవర్గంగానీ, రాష్ట్రంలో పెద్దగా గుర్తింపుగానీ లేని కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నారు. వైఎస్సార్‌సీపీలోకి వలసల ప్రవాహం పెరుగుతుండటంతో ఆయన ప్రభుత్వం భీతావహమైంది. టీడీపీ సైతం నెత్తురోడుతోంది. అత్యంత నిర్భయంగా పోరాడే నేతగా గుర్తింపున్న ఆ పార్టీ నేత ఎంవీ మైసూరారెడ్డి ఇప్పుడు వైఎస్సార్‌సీపీలో ఉన్నారు. 12 నెలల క్రితమే ఆయన కడపలో జగన్‌తో ఎన్నికల పోరు సాగించారు.
మీడియాకు అత్యంత ప్రీతిపాత్రుడైన చంద్రబాబునాయుడు హయాం లో దాదాపు దశాబ్దిపాటు రాష్ట్రం దక్షిణాదిలోకెల్లా అత్యంత అధ్వానమైన రాష్ట్రంగా నిలిచింది. గ్రామీణప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కొడిగట్టాయి. అనేక వేలమంది రైతులు దివాలా తీసి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆకలితో అలమటించే వారికోసం 1983లో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వేతరులు వేలాది గంజి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏవిధంగా చూసినా చంద్రబాబు విఫలమైనా కార్పొరేటు ప్రపంచం, మీడియా ఆయనను కీర్తించాయి. ప్రజలు మాత్రం నేటికీ ఆయనను క్షమించలేదు. అందుకే కాంగ్రెస్ పతనోన్ముఖంగా సాగుతున్నా, టీడీపీ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ ప్రధాన రాజకీయ శక్తిగా అవతరించలేకపోయింది.
చాలా కాలం తర్వాత కాంగ్రెస్‌లో వైఎస్సార్ ఒక ప్రజానాయకునిగా అవతరించారు. వ్యవసాయ రంగపు దయనీయస్థితిపై దృష్టిని కేంద్రీకరించి ఆయన రైతాంగపు గుండె తలుపులను తట్టారు. 2004 ఎన్నికల్లో ఘనవిజ యం సాధించారు. వ్యవసాయ సంక్షోభంపై ఒక కమిషన్‌ను నియమించిన మొట్టమొదటి సీఎం ఆయనే. చక్కటి ఉపాధి హామీ పథకాలను అమలు పరిచారు. చౌక బియ్యంతో ఎన్టీఆర్ వారసత్వాన్ని కొంత సొంతం చేసుకున్నారు. ఇవన్నీ ఆయనకు బ్రహ్మాండమైన ప్రజామద్దతును సంపాదించిపెట్టాయి. అదే ఇప్పుడు ఆయన కుమారుని పట్ల సానుభూతిగా మారింది.
- పి. సాయినాథ్(‘హిందూ’ వ్యాసం నుంచి కొన్ని భాగాలు...)
No comments:
Post a Comment