YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 9 June 2012

ఊరూవాడా కదలింది..సింహపురి అభిమానాన్ని చాటింది

ఊరూవాడా కదలింది..సింహపురి అభిమానాన్ని చాటింది.. రాజన్న సతీమణి వైఎస్ విజయమ్మ, కుమార్తె షర్మిలకు నీరాజనం పలికింది.. నేతలంతా ఏకమై కుట్రలు, కుతంత్రాలు చేసినా.. తామున్నామంటూ అక్కున చేర్చుకుంది. కావలి, నెల్లూరు రోడ్‌షోలకు జనం బ్రహ్మరథం పట్టారు. జనహోరుతో కనకపట్నం దద్దరిల్లింది.. సింహపురి జనసంద్రమైంది. న్యాయ నిర్ణేతలు మీరే.. న్యాయం చేయండి అంటూ విజయమ్మ చేసిన విజ్ఞప్తి జనానికి కంటతడి పెట్టించింది. షర్మిల పలకరింపు రాజన్నను జ్ఞప్తికి తెచ్చిందంటూ పలువురు ఈ సందర్భంగా వైఎస్సార్ హావభావాలను గుర్తుచేసుకున్నారు. 

నెల్లూరు, న్యూస్‌లైన్: వైఎస్ విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల ఒంగోలులో ఎన్నిక ప్రచారం ముగించుకుని ప్రత్యేక బస్సులో శనివారం సాయంత్రం 5 గంటలకు కావలి చేరుకున్నారు. అంతకు ముందుకు జిల్లా సరిహద్దులోని రుద్రకోట వద్ద స్థానికులు వారికి స్వాగతం పలికారు. కావలి జాతీయ రహదారి క్రాస్ రోడ్డు వద్ద అపూర్వ స్వాగతం లభించింది. జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్‌ర్ధన్‌రెడ్డి, ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కావలి ఇన్‌చార్జి ప్రతాప్‌కుమార్‌రెడ్డిలతో పాటు పలువురు ప్రముఖనేతలు స్వాగతం పలికారు. ఆమె రాకతో మధ్యాహ్నం రెండు గంటల నుంచి పడిగాపులు కాస్తున్న ప్రజానీకం ఉత్తేజితులై కావలి పట్టణంలోకి కదిలారు.

వైఎస్ జగన్ అభిమానులు 500 మంది మోటార్ సైకిళ్లతో ర్యాలీ ముందు సాగుతుండగా విజయమ్మ, షర్మిల స్థానిక నేతలతోపాటు వారి వెంట ప్రదర్శనగా బయలు దేరారు. వారి ప్రదర్శనకు అడుగడుగునా కిక్కిరిసిన జనవాహని నీరాజనాలు పలుకుతూ అప్యాయతా అనురాగాలు కురిపించింది. అలా ఉదయగిరి బస్టాండ్ వరకూ చిన్నపిల్లల దగ్గరి నుంచి ముసలీముతక వరకు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయమ్మను, ఆయన కుమార్తె షర్మిలను ఆదరించారు. ట్రంకురోడ్డు వెంబడి వ్యాపారులు సైతం వ్యాపారాన్ని తాత్కాలికంగా ఆపేసి విజయమ్మ రాక కోసం ఎదురు చూడసాగారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న కుటుంబాలు వారి ఇళ్లపైకి చేరి విజయమ్మను చూసేందుకు ఆసక్తి కనబరిచారు.

మత్స్యకార గ్రామాల నుంచి 500 మందికి పైగా మహిళలు తరలివచ్చి కర్పూర హారతులు ఇచ్చారు. చిన్న రాముడు పాళేనికి చెందిన మత్స్యకార మహిళలు లత, మల్లమ్మ, నరసమ్మ విజయమ్మ కావలికి వస్తే తెప్ప నమూనాను గుర్తుగా ఇవ్వాలని భావించారు. ఆమె కావలికి వస్తుందని మూడు రోజుల క్రితమే వారికి తెలియడంతో కష్టపడి సంపాదించిన సొమ్ముతో చిన్నపాటి తెప్పను తయారు చేయించుకుని తీసుకువచ్చారు. దానిని ఆమెకు ఇవ్వడానికి కుదరలేదు. అయినా వారు పట్టువదలకుండా విజయమ్మకు కానుకను సమర్పించారు. ఇలా కావలిలో ఉదయగిరి రోడ్డులోని అండర్ బ్రిడ్జి సెంటర్ వరకూ అడుగుడుగునా ప్రజానీకం అపూర్వ ఆదరణ చూపించారు. అక్కడే విజయమ్మ ప్రత్యేక వాహనంపై నుంచే ప్రసంగిస్తారని తెలియడంతో నాలుగురోడ్లు జనసంద్రంతో నిండిపోయాయి. ఆ సెంటర్ చుట్టూ ఉన్న భవనాలుపై కూడా ప్రజానీకం కిక్కిరిసి పోయారు. 

అక్కడి నుంచి నెల్లూరుకు బయలు దేరిన విజయమ్మకు జాతీయ రహదారిపైకి కాన్వాయ్ చేరేంత వరకు ప్రతి సెంటర్‌లో ప్రజానీకం ప్రచారరథాన్ని అడ్డుకుని నీరాజనాలు పలికారు. అ తర్వాత గౌరవరం వద్ద జాతీయ రహదారి సెంటర్‌లో దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని స్థానికులు అలంకరించి, విగ్రహం ముందు ఫ్యాన్ గిర్రున తిరిగేలా ఏర్పాట్లు చేశారు. అక్కడ మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి వేచి చూస్తున్న వేలాది మంది ప్రజానీకం విజయమ్మ రావడంతో ఆప్యాయతానురాగాలు కురిపించారు. ఆమె మాట్లాడాలని పట్టుబట్టడంతో షర్మిలతోపాటు, విజయమ్మలు వైఎస్ జగన్‌పై కాంగ్రెస్, టీడీపీలు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను వివరించారు.

ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ జగన్‌ను బలపరచాలని వారిని అభ్యర్థించారు. అక్కడి నుంచి కప్పరాళ్లతిప్ప వాసులు విజయమ్మను చూసేందుకు వందలాది మంది జాతీయ రహదారిపై వచ్చి ఆదరించారు. జన సింహపురి : కావలి నుంచి నెల్లూరుకు చేరుకున్న వైఎస్ విజయమ్మ, షర్మిలకు కోవూరు క్రాస్ రోడ్డు వద్ద స్థానిక నేతలు ఆనం వెంకటరమణారెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అబ్దుల్ అజీజ్‌లతో పాటు పలువురు నేతలు స్వాగతం పలికారు. 

అక్కడి నుంచి ఆత్మకూరు బస్టాండ్, బోసుబొమ్మ మీదుగా గాంధీబొమ్మ వద్దకు వారు, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, గౌతంరెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డితో కలిసి చేరుకున్నారు. ఆత్మకూరు బస్టాండ్ నుంచి కిక్కిరిసిన జనానికి అభివాదం చేస్తూ గాంధీబొమ్మ వద్దకు చేరారు. అక్కడ సాయంత్రం నుంచి వేచి ఉన్న ప్రజానీకం ఒక్క సారిగా విజయమ్మ రాకతో కేరింతలు కొట్టి రెట్టించిన ఉత్సాహంతో జై జగన్ అంటూ చేసిన నినాదాలు సింహపురిని దద్దరిల్లేలా చేశాయి. సింహపురిలో ఏ దారిలో చూసినా ఎక్కడికంటే విజయమ్మ రోడ్‌షోకు అంటూ తరలి వచ్చారు. మినీబైపాస్ రోడ్డు నుంచి మద్రాస్ బస్టాండ్, ఆత్మకూరు బస్టాండ్‌ల వరకూ జనం కిక్కిరిసి ఇసుకేస్తే రాలనంతగా పరిస్థితి తయారైంది. వారంతా ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా సరే విజయమ్మ, షర్మిలను చూసి, వారి ప్రసంగాలు విని ఆశీర్వదించి వెళ్లారు.

కంటతడిపెట్టించిన విజయమ్మ ప్రసంగం
దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రెండు సార్లు కేంద్ర, రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిన విషయం అందరికీ తెలుసు. అలాంటి ఆ మహానేత కుటుంబాన్ని కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై చేస్తున్న కుట్రలు, కుతంత్రాలపై ఆవేదన చెందుతూ వైఎస్ విజయమ్మ చేసిన ప్రసంగం నెల్లూరు, కావలిలలో ప్రజానీకానికి కలిచి వేసింది. ఆమె ప్రసంగాన్ని ఆసక్తిగా విన్న మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. 

షర్మిల తన ప్రసంగంలో చెబుతున్న ప్రతి విషయాన్ని ఆసక్తిగా గమనిస్తున్న ప్రజానీకం ప్రతి విషయం నిజమే నంటూ మద్దతు పలికారు. ఆనం సోదరులు చేసిన ద్రోహం గురించి షర్మిల చెబుతుండగా ప్రజానీకం జోక్యం చూసుకుని అలాంటి నీచుల పేరు ఎత్తవద్దని, వారి సంగతి మాకు తెలుసని చెప్పారు. ప్రచారరథం ఆగిన ప్రతి చోటా సమయం లేదని రాజన్న రాజ్యం రావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్ బాబుకు మద్దతు పలకాలని విజయమ్మ కోరారు. అదే సమయంలో షర్మిల మాట్లాడుతూ అక్కా ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్, అవ్వా ఫ్యాన్ గుర్తుకు ఓటెయవ్వా, తాతా ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్ తాతా అంటూ అభ్యర్థించడం ఆకట్టుకుంది. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!