రంగారెడ్డి జిల్లా, న్యూస్‌లైన్ ప్రతినిధి: ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు బత్తిన సోదరులు అందజేసే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఈసారి విషాదాన్ని మిగిల్చింది. గతంలో ప్రసాదం కోసం లక్షలాది మంది రోగులు నగరానికి పోటెత్తేవారు. కానీ ఈసారి వారి సంఖ్య 30-40 వేలకు మించలేదు. అయినా గందరగోళం, తొక్కిసలాట. ఫలితంగా గుండెపోటుతో ఓ వృద్ధుడి దుర్మరణం. పలువురికి గాయాలు. చేప ప్రసాదానికి రావాలంటేనే ప్రజలు భయపడిపోయే పరిస్థితి! ఇంత గందరగోళానికి కారణమెవరు? ఈ పాపమెవరిది? ఇంకెవరిది.. సర్కారుదే! తన బాధ్యతలను గాలికొదిలి.. మంత్రులను, మంత్రాంగాన్ని, బలాన్ని, బలగాన్ని, దృష్టిని ‘రాజకీయాల’పైనే కేంద్రీకరించి.. ప్రజలను, పాలనను పూర్తిగా విస్మరించిన కిరణ్ ప్రభుత్వ నిర్లక్ష్యానిదే!!
సర్కారు మొద్దునిద్ర: యథా సీఎం.. తథా మంత్రులు. ప్రజా సంక్షేమాన్ని సీఎం కిరణ్ పూర్తిగా గాలికొదిలి రాజకీయాలపైనే దృష్టి సారించడంతో మంత్రులు కూడా ‘సొంత’ వ్యవహారాల్లోనే బిజీ అయిపోయారు.
చేప ప్రసాదం కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచీ వేలాదిగా జనం వస్తారని తెలిసి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. సాధారణంగా 20 రోజుల ముందే అన్ని ప్రధాన విభాగాల ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించటం ఆనవాయితీ. ఈసారి మాత్రం అలాంటి భేటీ ఊసే లేకుండా పోయింది. ప్రత్యేకంగా ఎలాంటి సమావేశమూ ఏర్పాటు చేయలేదు. సరికదా.. అసలు ఈ కార్యక్రమం విషయంలో ప్రభుత్వం నుంచి అధికారులకు ఎలాంటి సూచనలూ అందలేదంటే.. ఎంత దారుణంగా వ్యవహరించారో అవగతమవుతుంది.
కాళ్లరిగేలా తిరిగినా: బత్తిన సోదరులకు ప్రభుత్వం గతంలోనే రాజేంద్రనగర్‌లో స్థలం కేటాయించింది. కానీ ఐదేళ్లపాటు వినియోగించలేదన్న కారణంతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. కేటాయించినప్పటి మాదిరిగానే ఆ భూమి స్వాధీనానికికూడా ప్రభుత్వ ఉత్తర్వులు తప్పనిసరి. ఇదే విషయాన్ని కలెక్టర్ విన్నవించినా ప్రభుత్వం పట్టించుకున్నది లేదు. చివరికి ఆ స్థలంలో చేప ప్రసాదం పంపిణీకి అనుమతిచ్చే అవకాశం లేదని రంగారెడ్డి జిల్లా అధికారులు ముందుగానే బత్తిన సోదరులకు స్పష్టం చేశారు. మరోవైపు ఏటా ఎగ్జిబిషన్ మైదానంలో కార్యక్రమం కొనసాగుతున్నా ఈసారి మాత్రం అక్కడ నిర్వహించేందుకు హైదరాబాద్ కలెక్టర్ అనుమతివ్వలేదు. రంగారెడ్డి జిల్లాలో స్థలం కేటాయించినందున అక్కడే జరపాలని బత్తిన సోదరులకు గతేడాదే ఆయన స్పష్టం చేశారు. స్థలం విషయంలో ఇంతటి గందరగోళం నెలకొన్నా సర్కారు మాత్రం చివరి నిమిషం దాకా చోద్యం చూస్తూ ఉండిపోయిందే తప్ప ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
దాదాపు నెల క్రితమే బత్తిన సోదరులు రంగారెడ్డి కలెక్టర్ శేషాద్రిని కలిశారు. వారికి గతంలో కేటాయించిన స్థలంలో పంపిణీకి అనుమతివ్వటం లేదని అప్పుడే ఆయన లిఖితపూర్వకంగా వారికి తెలిపారు. దీన్ని వారు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. కనీసం పక్షం రోజులుగా సచివాలయంలోని సీఎం కార్యాలయం, సీఎం క్యాంపు ఆఫీస్ చుట్టూ వారు కాళ్లరిగేలా తిరిగారు. అయినా స్పందన శూన్యం!
చివరి క్షణాల్లో: కాటేదాన్ ఇండోర్ స్టేడియంలో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేయాల్సిందిగా బుధవారం సాయంత్రం రంగారెడ్డి కలెక్టర్‌కు సమాచారం అందింది. అంటే కార్యక్రమం మొదలవడానికి కేవలం ఒకటిన్నర రోజుల ముందు! దాంతో పూర్తిస్థాయి ఏర్పాట్లు చే యడానికి అధికారులకు సమయమే లేకుండా పోయింది.
గతేడాదే చెప్పా: హైదరాబాద్ కలెక్టర్
‘‘చేప ప్రసాదం పంపిణీకి ఎగ్జిబిషన్ మైదానం కేటాయింపు ఇదే ఆఖరని బత్తిన సోదరులకు గతేడాదే స్పష్టం చేశాం. ఇకపై వారికి కేటాయించిన స్థలంలోనే జరుపుకోవాలనీ చెప్పాం’’
అక్కడ అసాధ్యమని నెల క్రితమే చెప్పా: రంగారెడ్డి కలెక్టర్
‘‘చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం రాజేంద్రనగర్‌లో కేటాయించిన భూమిలో ఈసారి కార్యక్రమానికి అనుమతి లేదని బత్తిన సోదరులకు దాదాపు నెల క్రితమే లిఖితపూర్వకంగా స్పష్టం చేశా. అవసరమైతే కాటేదాన్ మైదానాన్ని కేటాయిస్తామన్నా వారు బదులివ్వలేదు. బుధవారం సాయంత్రం జీఏడీ నుంచి ఆదేశాలు రావడంతో అప్పటికప్పుడు ఏర్పాట్లు చేశాం’’
విచారకరం: చంద్రబాబు
చేపమందు పంపిణీలో జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందడం విచారకరం. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో సరైన ఏర్పాట్లు చేయకపోవడమే దీనికి కారణం.
ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: కిషన్‌రెడ్డి
తొక్కిసలాటకు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణం. గాయపడినవారికి, మరణించిన వ్యక్తి కుటుంబానికి పరిహారం చెల్లించాలి.
రద్దుచేయాలని చూసింది: కేటీఆర్
ప్రభుత్వం కొందరి ఒత్తిడితో బత్తిన సోదరుల చేపమందు పంపిణీ కార్యక్రమాన్నే రద్దు చేయాలని చూసింది.
డబ్బులు తిని అడ్డుకుంటున్నారు: మధుయాష్కీ
ఫార్మా కంపెనీల నుంచి డబ్బులు తీసుకుని ప్రభుత్వ అధికారులు, జనవిజ్ఞాన వేదిక సభ్యులు చేపమందు పంపిణీని అడ్డుకుంటున్నారు.
No comments:
Post a Comment