ఆయన సోదరుడు, అనుచరులు కూడా వైఎస్సార్ సీపీలో చేరిక
జగన్ ప్రచారంలో పాల్గొనకుండా కాంగ్రెస్, టీడీపీ అడ్డుకున్నాయి: రంగారావు
రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక కాంగ్రెస్ అధిష్టానం టీడీపీతో కుమ్మక్కైంది
జగన్‌పై చేపడుతున్న చర్యలు వేధింపులేనని ప్రజలు నమ్ముతున్నారు
ప్రజల నమ్మకానికి ఆజాద్ వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి
విజయమ్మ, షర్మిలపై కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య
ఉప ఎన్నికల తర్వాత వైఎస్ అభిమాన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా బయటకు వస్తారు
హైదరాబాద్, న్యూస్‌లైన్: విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వి.సుజయ్‌కృష్ణ రంగారావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సభ్యత్వం స్వీకరించారు. ఎమ్మెల్యే సోదరుడు, బొబ్బిలి మున్సిపల్ మాజీ చైర్మన్ బేబి నాయన (ఆర్.వి.శ్వేతా చలపతి కుమార కృష్ణ రంగారావు), వారి అనుచరులు కూడా పార్టీలో చేరారు. పార్టీ నేతలు వై.వి.సుబ్బారెడ్డి, పెన్మత్స సాంబశివరాజు, పీఎన్వీ ప్రసాద్, అవనాపు విజయ్‌కుమార్‌లు వారికి కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రంగారావు మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు రాజకీయాలను ఎండగట్టారు. ‘‘కాంగ్రెస్, టీడీపీలు కలిసి అత్యంత ప్రజాదరణ కలిగిన వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా అడ్డుకున్నాయి. అవి పక్కా ప్రణాళిక ప్రకారం అన్ని శక్తులను ఏకం చేసి జగన్‌ను అడ్డుకున్నాయి. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక కాంగ్రెస్ అధిష్టానం టీడీపీతో కుమ్మక్కైంది. సీబీఐని పావులా వాడుకుంటోంది. జగన్‌పై చేపడుతున్నవి కక్ష సాధింపు చర్యలేనని ప్రజలు బలంగా నమ్ముతున్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు ప్రజల నమ్మకానికి మరింత బలం చేకూరుస్తున్నాయి. జగన్ కాంగ్రెస్‌లో ఉంటే కేంద్ర మంత్రి అయ్యేవారని, ఆ తర్వాత సీఎం అయ్యుండేవారని ఆజాద్ చేసిన వ్యాఖ్యల మర్మమేమిటి? కాంగ్రెస్ నుంచి బయటకెళ్లినందుకే జగన్‌ను వేధిస్తున్నారా? ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌ను నిలువరించేందుకే జగన్‌ను అరెస్టు చేశారని ప్రజలందరూ నమ్ముతున్నారు. విధిలేని పరిస్థితుల్లో విజయమ్మ, షర్మిల ప్రచారం చేస్తుంటే కొందరు కాంగ్రెస్ నేతలు అసంబద్ధ వ్యాఖ్యలు చేయడం చాలా హేయమైన చర్య. వారు చేస్తున్న వ్యాఖ్యలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు’’ అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ చేతిలో అధికారం ఉన్నందువల్లే జగన్‌ను వేధిస్తున్నారని ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. జగన్‌పై వస్తున్న ఆరోపణలకు తొమ్మిది నెలలుగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఇప్పటిదాకా ఒక్క ఆధారం సేకరించలేకపోయిందన్నారు. జగన్‌ను ఎన్ని వేధింపులకు గురిచేసినా ప్రజలు అండగా ఉన్నంత కాలం ఏమీ చేయలేరని, త్వరలోనే ఆయన నిర్దోషిగా బయటకొస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఉప ఫలితాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది
రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికలు సెమీఫైనల్ అని, ఆ తర్వాత కొద్ది కాలంలోనే ఫైనల్స్ వస్తాయని రంగారావు జోస్యం చెప్పారు. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. జగన్‌పై కాంగ్రెస్ అధిష్టానం వేధింపులకు నిరసనగా ఉప ఎన్నికల ఫలితాల తర్వాత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని అభిమానించే ఎమ్మెల్యేలందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలిపారు. ప్రధాన ప్రతిపక్ష బాధ్యతను నెరవేర్చాల్సిన టీడీపీ దాని కర్తవ్యాన్ని విస్మరించి అధికార పార్టీకి బ్రాంచిగా తయారైందని విమర్శించారు. చంద్రబాబు దయాదాక్షిణ్యాల వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఈనెల 15 తర్వాత ఈ విషయం మరింత స్పష్టంగా వెలుగు చూస్తుందని రంగారావు చెప్పారు.
No comments:
Post a Comment