YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 8 June 2012

మళ్లీ కస్టడీ అడుగుతున్నారు.. ఈ పది నెలలు ఏం చేశారు?న్యాయస్థానానికి కథలు చెప్పొద్దు

ప్రతిసారీ అవే కథలు వినిపిస్తున్నారు
మళ్లీ కస్టడీ అడుగుతున్నారు.. ఈ పది నెలలు ఏం చేశారు?
జగన్‌ను ఐదు రోజులు కస్టడీకిచ్చాం.. అదేమీ తక్కువ సమయం కాదు
ఐదు రోజుల్లో చేయలేనిది.. ఈ మూడు రోజుల్లో ఏం చేస్తారు?
అసలు దర్యాప్తును ఎంతకాలం కొనసాగిస్తూ పోతారు.. 
వీలైనంత త్వరగా పూర్తి చేయండి
దర్యాప్తు మొదలు పెట్టింది నిన్నో, మొన్నో కాదు.. పది నెలల నుంచీ చేస్తున్నారు
ఎఫ్‌ఐఆర్‌లో అన్నీ స్పష్టంగా ఉన్నాయిగా అంటూ సీబీఐని నిలదీసిన న్యాయమూర్తి
చివరకు జగన్ కస్టడీని రెండు రోజులు పొడిగించిన హైకోర్టు

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెట్టుబడుల వ్యవహారంలో కోర్టు ముందు ఏ పిటిషన్ దాఖలు చేసినా, ‘కొత్త విషయాలు వెలుగు చూశాయి’ అని చెప్పడం అలవాటు చేసుకున్న సీబీఐ అధికారులను హైకోర్టు మందలించింది. ‘ప్రతిసారీ కోర్టు ముందు అవే కథలు వినిపిస్తున్నారు. కోర్టులకు కథలు చెప్పడం మానండి’ అంటూ చురకలు వేసింది. జగన్ కస్టడీని మరో మూడు రోజుల పాటు పొడిగించాలని కోరిన సీబీఐని హైకోర్టు గట్టిగా నిలదీసింది. ‘‘మరో మూడు రోజులు కస్టడీకి అడుగుతున్నారు.. ఈ 10 నెలలుగా ఏం చేశారు? అసలు ఎంతకాలం దర్యాప్తు కొనసాగిస్తూ పోతారు? మీరు దర్యాప్తు చేస్తున్నది నిన్నటి నుంచో, మొన్నటి నుంచో కాదు. దాదాపు 10 నెలల నుంచీ చేస్తున్నారు. అది జరిగింది, ఇది జరిగిందని చెబుతారు. ఎఫ్‌ఐఆర్‌లో అన్నీ వివరాలు స్పష్టంగా ఉన్నాయి కదా! ఏం జరిగిందో అందులో స్పష్టంగా ఉంది. మరి ఈ 10 నెలలూ మీరేం చేశారు? జగన్‌ను ఈ కోర్టు ఇప్పటికే ఐదు రోజుల కస్టడీకిచ్చింది. అదేమీ తక్కువ సమయం కాదు. ఐదు రోజుల్లో చేయలేనిది ఇప్పుడు మరో మూడు రోజుల్లో ఏం చేస్తారు?’’ అని సీబీఐని నిలదీసింది. దర్యాప్తును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పదేపదే గట్టిగా నొక్కిచెప్పింది. చివరకు జగన్ కస్టడీని మరో రెండు రోజుల పాటు పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. కస్టడీ విషయంలో ప్రస్తుతమున్న షరతులన్నీ యథాతథంగా అమలవుతాయని స్పష్టం చేశారు.

జగన్‌ను సీబీఐ కస్టడీకిచ్చేందుకు నిరాకరిస్తూ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులివ్వడం, వాటిని సవాలు చేస్తూ సీబీఐ అధికారులు గత వారం హైకోర్టులో పిటిషన్ వేయడం, కోర్టు ఆయనను ఐదు రోజుల కస్టడీకివ్వడం, ఆ మేరకు రోజూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదింటి వరకు విచారించడం తెలిసిందే. జగన్ ఐదు రోజుల కస్టడీ గురువారంతో ముగియడంతో, దాన్ని పొడిగించాలంటూ సీబీఐ గురువారం హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ తరఫున సీనియర్ న్యాయవాది అశోక్‌భాన్, జగన్ తరఫున సీనియర్ న్యాయవాది సి.పద్మనాభరెడ్డి వాదించారు.

కొత్త విషయాలు తెలిశాయి.. కస్టడీ పొడిగించండి
ఐదు రోజుల విచారణలో కొత్త, కీలక విషయాలు తెలిశాయని భాన్ చెప్పారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు కస్టడీ పొడిగింపు కోరుతున్నామన్నారు. దాంతో.. ప్రతిసారీ ఇవే కథలు విన్పిస్తున్నారంటూ న్యాయమూర్తి ఆగ్రహించారు. కోర్టుకు కథలు చెప్పడం మానాలన్నారు. పది నెలలుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దర్యాప్తు ప్రారంభించింది నిన్ననో, మొన్ననో కాదని గుర్తు చేశారు. దర్యాప్తు రాష్ట్రానికే పరిమితం కాలేదని భాన్ బదులిచ్చారు. ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలతో పాటు లగ్జెంబర్గ్ వంటి దేశాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు. న్యాయమూర్తి తిరిగి స్పందిస్తూ.. ‘మీరు చెప్పేవన్నీ ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టంగా ఉన్నాయి కదా! మరి ఈ పది నెలలూ మీరేం చేశారు?’’ అంటూ సీబీఐని నిలదీశారు. జగన్‌పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని, రాష్ట్రం ఆవల కూడా దర్యాప్తు సాగుతోందని భాన్ మళ్లీ చెప్పడంతో, ఈ కేసులో ఎంతకాలం దర్యాప్తు చేస్తూ పోతారని న్యాయమూర్తి ప్రశ్నించారు. దర్యాప్తును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రెండు మూడుసార్లు గట్టిగా నొక్కిచెప్పారు. అదే ఉద్దేశంతో ఉన్నామని, అందుకు కొంత సమయం అవసరమని భాన్ బదులిచ్చారు. నిందితునిగా ఉన్న జగన్‌కు సైతం సీఆర్పీసీ సెక్షన్ 167 (2) వర్తిస్తుందని న్యాయమూర్తి చెప్పారు. కస్టడీకివ్వాలా, వద్దా అన్నది మేజిస్ట్రేట్ విచక్షణపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. 

‘‘జగన్‌ను ఇప్పటికే ఐదు రోజుల కస్టడీకిచ్చాను. అదేమి తక్కువ సమయం కాదు. ఐదు రోజుల్లో చేయలేనిది, మరో మూడు రోజుల్లో ఏం చేస్తారు?’’ అని సీబీఐని ప్రశ్నించారు. ఇప్పటికే కొందరు సాక్షులిచ్చిన వాంగ్మూలాల ఆధారంగా జగన్‌ను విచారించాలనుకుంటున్నట్టు భాన్ చెప్పారు. ‘‘ఐదు రోజలు విచారణలో జగన్ పెద్దగా చెప్పిందేమీ లేదు. అన్ని విషయాలను గుండెల్లోనే దాచుకున్నారు. అంతేకాక ఆయన్ను ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదింటి వరకే విచారించేందుకు కోర్టు అనుమతిచ్చింది. దాంతో సమయం చాలలేదు. కస్టడీకి తీసుకోవడం వల్ల జగన్‌కు వచ్చే ఇబ్బందేమీ లేదు. ఆయన పట్ల సీబీఐ అధికారులు ఎన్నడూ దురుసుగా వ్యవహరించలేదు. ఇద్దరు న్యాయవాదుల సమక్షంలోనే విచారణ సాగుతోంది’’ అని తెలిపారు. పోలీస్‌స్టేషన్లలో మగ్గిపోతున్న వారి విషయంలో పోలీసుల వ్యవహార శైలిపై ఈ సమయంలో న్యాయమూర్తి కాసేపు చర్చించారు. పోలీసులు తమ పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని మార్చేలా పని చేయాలని సూచించారు. తర్వాత భాన్ కేసు లోతుల్లోకి వెళ్లే ప్రయత్నం చేయగా, ఆ అవసరం లేదంటూ సున్నితంగా అడ్డుచెప్పారు. వేటి ఆధారంగా కస్టడీ పొడిగింపు కోరుతున్నారో మాత్రమే చెప్పాలని స్పష్టం చేశారు.

పిటిషన్ విచారణార్హమే కాదు

అసలు కస్టడీ పొడిగింపు కోసం సీబీఐ వేసిన అనుబంధ పిటిషన్ విచారణార్హమే కాదని పద్మనాభరెడ్డి స్పష్టం చేశారు. ‘‘గత వారం సీబీఐ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను హైకోర్టే పరిష్కరించింది. ఒకసారి పరిష్కారమైన కేసులో అనుబంధ పిటిషన్ దాఖలు, దానిపై కోర్టు విచారణ చెల్లదు’’ అని తెలిపారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులను చదివి విన్పించారు. ‘‘సీఆర్పీసీ సెక్షన్ 182 కింద సీబీఐ ఈ అనుబంధ పిటిషన్ వేసింది. అసలిది చెల్లుబాటే కాదు. హైకోర్టుకు విచక్షణాధికారాలుండటం నిజమే అయినా ఒకసారి మూసేసిన కేసును తిరిగి విచారించరాదు. అలా చేయడం తొలి తీర్పును పునఃసమీక్షించడమే. హైకోర్టుకు సంక్రమించిన స్వతఃసిద్ధ అధికారాలు కస్టడీ పొడిగింపునకు ఆధారం కారాదు’’ అని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకించారు. ‘‘మే 25, 26, 27ల్లో జగన్‌ను 30 గంటలకు పైగా విచారించారు. మళ్లీ జూన్ 3 నుంచి 7వ తేదీ దాకా ఐదు రోజుల పాటు. ఇలా మొత్తం 8 రోజులు సుదీర్ఘంగా విచారించారు. ఈ కస్టడీ సరిపోతుంది. దాన్ని మళ్లీ పొడిగించాల్సిన అవసరం లేదు’’ అని వివరించారు.

మీరూ తెలివైనవారే! నవ్వులు పూయించిన న్యాయమూర్తి
ఐదు రోజుల విచారణలో కొత్త విషయాలు వెలుగు చూశాయని, కొత్త సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా జగన్‌ను ప్రశ్నించాల్సి ఉందని సీబీఐ తరఫు న్యాయవాది అశోక్ భాన్ చెప్పారు. విచారణ సమయంలో జగన్ చాలా తెలివిగా వ్యవహరించారన్నారు. దాంతో జస్టిస్ చంద్రకుమార్ స్పందిస్తూ.. ‘ఆయనొక్కడే తెలివైన వ్యక్తి కాదు. అసలు తెలివైన వ్యక్తి కానిదెవరో చెప్పండి. ఆ మాటకొస్తే మీరూ తెలివైన వారే’నని వ్యాఖ్యానించారు. దాంతో కోర్టు హాల్లో నవ్వులు విరిశాయి.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!