YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 9 June 2012

బాబు, దాడి, రామోజీలకు సాయిరెడ్డి లీగల్ నోటీసులు

* రాజకీయ, వ్యక్తిగత కక్షలోభాగమే ఆ పోస్టర్.. కుట్రలో భాగంగానే రామోజీ దానిని ప్రచురించారు.. అందులో లెక్కలన్నీ అవాస్తవాలు, అభూత కల్పనలే
* జగన్, ఆయనకు సంబంధించిన కంపెనీలు, వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసేందుకే విషపూరిత కథనాలు.. దేని ఆధారంగా ఇందులో నా పేరు లాగారు?
* నెల్‌కాస్ట్‌కు, నాకు సంబంధమే లేదు..ఆ సంస్థ ప్రైవేటుగానే భూములు కొన్నది
* నాకు కేటాయించినట్లు చెబుతున్న భూములు ఎక్కడున్నాయో మీరే గుర్తించండి
* ఆ భూముల విలువలో ఖర్చుల కింద 1 శాతం మొత్తాన్ని చెల్లించండి
* పోస్టర్‌ను ప్రచురించడంలో రామోజీ కనీస పాత్రికేయ విలువలు పాటించలేదు

హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, శాసన మండలిలో టీడీపీ ఫ్లోర్ లీడర్ దాడి వీరభద్రరావు, ఈనాడు దినపత్రిక చీఫ్ ఎడిటర్ సి.హెచ్.రామోజీరావులకు ఆడిటర్ వేణుంబాక విజయసాయిరెడ్డి శనివారం లీగల్ నోటీసులు పంపారు. అవాస్తవాలు, అభూత కల్పనలతో లెక్కలు తయారు చేసి ఘోరీ+గజనీ = జగన్ పేరుతో పోస్టర్ ముద్రించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబుకు, ఆ పోస్టర్‌ను విడుదల చేసి నోటికొచ్చినట్లు మాట్లాడిన దాడి వీరభద్రరావుకు, వాస్తవాలు తెలుసుకోకుండా పోస్టర్‌ను యథాతథంగా ఈనాడు పత్రికలో ప్రచురించిన రామోజీరావుకు ఆయన లీగల్ నోటీసులు జారీ చేశారు. రాజకీయ, వ్యక్తిగత కక్షలో భాగంగా పరువునష్టం కలిగించే విధంగా ఈ పోస్టర్‌ను ముద్రించారని, దానిని చంద్రబాబు ఆదేశాల మేరకు దాడి వీరభద్రరావు పత్రికలకు విడుదల చేశారని, ఓ కుట్రలో భాగంగా రామోజీ ఆయన పత్రికైన ఈనాడులో ప్రచురించారని సాయిరెడ్డి ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 

చంద్రబాబు, దాడి, రామోజీ చర్యలను రాజకీయంగా సమాధి కావడానికి ముందు చేస్తున్న కుట్రలుగా ఆయన అభివర్ణించారు. నేరపూరిత కుట్రలో భాగంగా ఒకరికొకరు సహకరించుకుంటూ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని, ఆయనకు సంబంధించిన కంపెనీలు, వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతో విషపూరిత కథనాలను, అవాస్తవాలను, అర్ధంలేని ప్రకటనలను చేస్తున్నారని తెలిపారు. రాజకీయ భవిష్యత్తు అంధకారంగా కనిపించడంతో చంద్రబాబు, దాడి వీరభద్రరావు చేస్తున్న అర్థంలేని ప్రకటనలను, రామోజీరావు నైతిక విలువలను, పాత్రికేయ విలువలను పక్కనపెట్టి మరీ ప్రచురిస్తున్నారని సాయిరెడ్డి ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి, ఆయనకు సంబంధించిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న దుష్ర్పచారంలో భాగమే పోస్టర్ ముద్రణ, విడుదల, ప్రచురణ అని ఆయన వివరించారు.

మీ ముగ్గురి గురించి ప్రజలకు బాగా తెలుసు
‘‘జగన్, బినామీలు దోచుకున్న రాష్ట్ర సంపద రూ.16,97,335 కోట్లు అంటూ శనివారం ఈనాడులో వార్తా కథనం ప్రచురితమైంది. ఇందులో నెల్లూరు జిల్లా గురించి చెబుతూ నెల్‌కాస్ట్ కంపెనీని ప్రస్తావించారు. నెల్‌కాస్ట్ కంపెనీ - విజయసాయిరెడ్డి - 1,500 ఎకరాలు - రూ.1,200 కోట్లు అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన పోస్టర్‌లో ఆ వివరాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఆ పోస్టర్ సృష్టికర్త అయితే, దానిని విడుదల చేసిన దాడి వీరభద్రరావు పోస్టర్ బాయ్. ఇన్నేళ్లు మీ ముగ్గురి ప్రజాజీవితం ఎలా సాగిందో నాకు తెలుసు. మీ జీవితంలో విలువలు, నిజాయతీ అనే వాటికి కనిష్ట ప్రాధాన్యత అనే విషయం ప్రజలందరికీ బాగా తెలుసు. అబద్ధపు రాతలు విస్తృతిలోకి తీసుకురావడం, వాస్తవాలతో సంబంధం లేకపోవడం, తప్పుడు ప్రచారం చేసే మీ ప్రవృత్తిని ప్రజలు ఇప్పటికే బాగా అర్థం చేసుకున్నారు. మీరు ప్రచురించిన కథనంలో నాపేరును దేని ఆధారంగా లాగారో ఎక్కడా చెప్పలేదు. ప్రభుత్వం నాకు భూములను కేటాయించినట్లు ఆపాదించారు. ఇందుకు సంబంధించి మీరు నాకు బేషరతు క్షమాపణలు చెప్పాలి.’ అని సాయిరెడ్డి తన నోటీసుల్లో డిమాండ్ చేశారు.

‘‘నెల్‌కాస్ట్ లిమిటెడ్ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్ట్ అయిన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. దీని ప్రమోటర్లు పి.రాధాకృష్ణారెడ్డి, ఇతరులు. ఈ కంపెనీ మొదట్లో ఆటోమొబైల్ పరికరాలు తయారు చేసేది. గత 25 సంవత్సరాలుగా ఈ వ్యాపారంలో ఉంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 1,320 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసే ఉద్దేశంతో నెల్‌కాస్ట్ లిమిటెడ్ 2000 సంవత్సరంలో నెల్‌కాస్ట్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ అనే అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. ఎండీగా ఉన్న రాధాకృష్ణారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు ఇందులో 5 శాతం వాటా ఉంది. నేను భాగస్వామిగా ఉన్న వీఎస్ రెడ్డి అండ్ కంపెనీ నెల్‌కాస్ట్ లిమిటెడ్‌కి 2010 డిసెంబర్ 31 వరకు అంతర్గత ఆడిటర్‌గా, నెల్‌కాస్ట్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చట్టబద్ధ ఆడిటర్‌గా వ్యవహరించింది. 

2010 డిసెంబర్ 31న నెల్‌కాస్ట్ ఎనర్జీ, నాగార్జున పవర్ ప్రాజెక్టులో విలీనమైంది. 2011లో ఈ విలీనానికి చెన్నై హైకోర్టు ఆమోదముద్ర వేసింది. నాగార్జున పవర్ ప్రాజెక్టులో విలీనమైన తరువాత ఆ సంస్థతో నాకు వృత్తిపరంగా, మరో రకంగా ఎటువంటి సంబంధంలేదు. ఆ రోజుకు నెల్‌కాస్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి భూమీ కేటాయించలేదు. లక్ష్య సాధనలో భాగంగా నెల్‌కాస్ట్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ పలువురు వ్యక్తుల నుంచి దాదాపు 743.83 ఎకరాల భూమిని ప్రైవేటుగా సేకరించింది. ఆ కంపెనీకి ప్రభుత్వం భామి కేటాయించపోయినా, కేటాయించినట్లు చెప్పడమే కాకుండా, నాకు కేటాయించినట్లు ఎలా ఆపాదిస్తారు? ఏ భూములనైతే కేటాయించినట్లు చెబుతున్నారో వాటిని ఆ కంపెనీ ప్రైవేటుగా కొనుగోలు చేసింది’’ అని సాయిరెడ్డి ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు.

1 శాతం ఖర్చులుగా చెల్లించండి చాలు..
‘‘పోస్టర్ తయారు చేసిన చంద్రబాబు, దానిని విడుదల చేసిన దాడి వీరభద్రరావు, ప్రచురించిన రామోజీరావు నేరపూరిత కుట్ర, మా ప్రతిష్టను దెబ్బతీసే చర్యల్లో భాగంగానే ఇదంతా చేశారు. పరువు నష్టం కలిగించే, తప్పుడు ఉద్దేశాలతో రామోజీ ఈ కథనాన్ని ప్రచురించారు. మీ బురదజల్లుడు కార్యక్రమంలో భాగంగానే ఇదంతా చేశారు. ఈ విషయం మీకూ స్పష్టంగా తెలుసు. పాత్రికేయ విలువలను పట్టించుకోకుండా ఈనాడు దినపత్రిక తెలుగుదేశం పార్టీ కరపత్రంగా వ్యవహరిస్తోంది. టీడీపీ పోస్టర్‌ను ప్రచురించే ముందు ఓ వార్తా సంస్థ పాటించే కనీస విలువలను కూడా పాటించలేదు. అందులో ఎంత వరకు వాస్తవాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధం. 

ఏదేమైనప్పటికీ ఈనాడు ప్రచురించిన వార్తా కథనం వాస్తవదూరం. నేరపూరిత కుట్ర తప్ప ఇందులో ఏమీ లేదు. రామోజీపై ఏవగింపు కలిగేలా ఉంది. పాత్రికేయ వృత్తిలో ఇప్పటికైనా విలువలను ఆచరించడం రామోజీ నేర్చుకోవాలి. ఈ మొత్తం వ్యవహారంపై చంద్రబాబు, దాడి వీరభద్రరావు, రామోజీరావు బేషరతు క్షమాపణలు చెప్పాలి. ఏ భూములనైతే నాకు కేటాయించినట్లుగా మీరు ఆరోపిస్తున్నారో (ఇందులో మీరు ఇప్పటికే నిష్ణాతులయ్యారు) మీరే వాటిని గుర్తించండి. నా ప్రతిష్టకు భంగం కలిగించినందుకు అలా గుర్తించిన భూముల విలువలో 1 శాతం మొత్తాన్ని నా ఖర్చుల కింద చెల్లించండి. ఈ విషయాన్ని మీ ముగ్గురికే వదిలేస్తున్నా’’ అని విజయసాయిరెడ్డి తన నోటీసుల్లో పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!