YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 8 June 2012

మీరే సరైన న్యాయ నిర్ణేతలు


పరకాలలో ప్రజలకు వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి

ఎక్కడా న్యాయం దొరక్క ఈ రోజు మీ ముందుకొచ్చా
భర్తను పోగొట్టుకున్నాను.. జగన్‌ను అక్రమంగా జైల్లో పెట్టారు
కాంగ్రెస్ నుంచి బయటకొచ్చినందుకు మమ్మల్ని వేధిస్తున్నారు
కాంగ్రెస్‌లోనే ఉంటే జగన్‌ను సీఎంను చేసేవారమని అంటున్నారు
తెలంగాణ ఇచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది
మాకు అభ్యంతరం లేదని జగన్ ప్లీనరీలోనే చెప్పాడు
తెలంగాణపై తేల్చకుండా కేంద్రం చోద్యం చూస్తోంది
పైసా పన్ను వేయకుండా పాలించిన ఘనత వైఎస్‌ది మాత్రమే
ఆ సువర్ణయుగం మళ్లీ తెచ్చుకునే ఎన్నికలివి
మన్నన లేని ప్రభుత్వాలకు మీ ఓటుతో బుద్ధి చెప్పండి

వరంగల్, న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘‘భర్తను పోగొట్టుకున్నాను.. బిడ్డను అక్రమంగా జైల్లో పెట్టారు. ఎక్కడా న్యాయం దొరక్క ఈ రోజు న్యాయం కోసం నేను మీ దగ్గరకొచ్చాను. మీరే సరైన న్యాయ నిర్ణేతలు.. విజ్ఞులు.. మీరే న్యాయం చెప్పండి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రజలను అభ్యర్థించారు. 25 ఏళ్లపాటు కష్టపడి ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డిని ఇప్పుడు ఆ పార్టీ పెద్దలే దోషిగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇచ్చిన మాట తప్పనందుకు, ఆ మాట కోసం కాంగ్రెస్‌ను వదిలి బయటకు వచ్చినందుకు జగన్‌మోహన్‌రెడ్డిని కేసులతో వేధిస్తున్నారని అన్నారు. ‘‘జగన్ బాబు ప్రజల్లో ఉంటే ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లూ గెలుచుకుంటుందన్న భయంతో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై జైల్లో పెట్టించాయి. కానీ లోపల పెట్టినా.. వైఎస్‌ను అభిమానించే, జగన్‌ను ప్రేమించే ప్రతి హృదయం స్పందిస్తుందని, గెలిపిస్తుందని వారికి అర్థం కావట్లేదు’’ అని ఆమె ధీమా వ్యక్తంచేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కుమార్తె షర్మిలతో కలిసి విజయమ్మ శుక్రవారం వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో పర్యటించారు. కోనాయిమాకుల, పరకాలలో రోడ్‌షోలకు వేలాదిగా జనం తరలివచ్చారు. వరంగల్, నర్సంపేట మెయిన్ రోడ్డు దాదాపు నాలుగు గంటల పాటు జన సందోహంతో కిక్కిరిసిపోయింది. విజయమ్మను ప్రజలు ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రచార రథంపై విజయమ్మ తెలంగాణ అమర వీరులకు, వైఎస్ మరణానంతరం గుండె పగిలి చనిపోయిన వారికి నివాళిగా నిమిషం పాటు మౌనం పాటించారు. అనంతరం మాట్లాడుతూ.. మహానేత మరణాన్ని తట్టుకోలేక రాష్ట్రంలో అత్యధికంగా వరంగల్ జిల్లాలో 78 మంది చనిపోయారని, ఇది తెలిసి తన గుండె తరుక్కుపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.

కేంద్రం చోద్యం చూస్తోంది..

‘‘రాజశేఖరరెడ్డి వ్యక్తిగతంగా అందరూ కలిసి ఉంటే అభివృద్ధి చెందుతుందని ఆశించి ఉండవచ్చు.. అయితే ఆయన ఎప్పుడూ ప్రజల మనోభావాలను, ఆకాంక్షలను గౌరవించే వ్యక్తి. ఆయన సీఎల్పీ లీడర్‌గా ఉండగా.. చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి చెందిన 41 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ కోసం ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణ ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని, వారు ఇస్తే మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదని జగన్‌బాబు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో చెప్పాడు. ఇక్కడ ఇటీవల ఆరు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ మనోభావాలను గౌరవిస్తూ ఆయన పోటీ కూడా పెట్టలేదు. ఈ రోజు తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఏ విషయమూ తేల్చకుండా చోద్యం చూస్తోంది’’ అని విజయమ్మ దుయ్యబట్టారు.

పైసా పన్నులేని పాలన వైఎస్‌దే..

వైఎస్ హయాంలో ఆర్టీసీ ఛార్జీలు, కరెంటు బిల్లులు, ఇంటి పన్ను ఒక్క రూపాయి కూడా పెరగలేదని, పైసా పన్నులేని పాలన వైఎస్‌దేనని, ఇది దేశ చరిత్రలోనే రికార్డుగా నిలిచిపోయిందని విజయమ్మ గుర్తుచేశారు. ‘‘రాయలసీమలో మాదిరి తెలంగాణలో కూడా సాగునీరు తక్కువ. అందుకే ఈ ప్రాంతానికి సాగునీరు అందించడానికి వైఎస్ ప్రాజెక్టులకు పెద్ద పీటవేశారు. ఎన్నో ప్రాజెక్టులు చేపట్టారు. ప్రాణహిత ప్రాజెక్టు కోసం ఎంతో ప్రయత్నించారు. ఆయన ఉండి ఉంటే.. ఈ పాటికి ప్రాజెక్టు పనులు జరుగుతుండేవి. ఇక్కడ పరిశ్రమలు తీసుకురావాలని, ఇక్కడి వారికి ఉపాధి కల్పించాలని ఆయన తపిస్తే.. కాంగ్రెస్, టీడీపీ నేతలు అవినీతి అంటూ నిందలు వేస్తున్నారు’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘వైఎస్ కుమారుడు అవడమే తప్పన్నట్లు జగన్ బాబుపై సీబీఐ విచారణ చేయిస్తున్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ బాబు ఏమైనా ప్రభుత్వంలో ఉన్నాడా అవినీతికి పాల్పడడానికి? ఆయన సీఎం కాకముందే జగన్‌కు ఆస్తులున్నాయి. పవర్ ప్రాజెక్టులున్నాయి. లక్ష కోట్ల రూపాయల అవినీతి అన్నది టీడీపీ అధినేత చంద్రబాబు సృష్టించిన అభూత కల్పన అని ఆ పార్టీ మాజీ నేత మైసూరా రెడ్డే వెల్లడించారు’’ అని ఆమె అన్నారు.

ఓదార్పు యాత్ర మొదలుపెట్టగానే రైడ్‌లు..

‘‘మహానేత మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను వచ్చి పరామర్శిస్తానంటూ నా బిడ్డ ఆ రోజు నల్లకాలువలో మాటిచ్చాడు. ఆ మాట ప్రకారం ఓదార్పు యాత్ర చేస్తానంటే.. అధిష్టానం వద్దంది. అలా యాత్ర చేయడమే పెద్దలకు నచ్చలేదు. అయినా మాట తప్పకుండా యాత్ర చేసినందుకే వేధింపులు మొదలయ్యాయి’’ అని విజయమ్మ స్పష్టంచేశారు. ‘‘ఓదార్పు మొదలు పెట్టిన వెంటనే ‘సాక్షి’కి ఐటీ నోటీసులు, ఆ వెంటనే 700 మందితో రైడ్‌లు, మొన్నటికి మొన్న ‘సాక్షి’ ఖాతాల సీజ్, ప్రభుత్వ ప్రకటనల నిలిపివేత.. ఇలా వేధింపుల పర్వం కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ పెద్ద గులాం నబీ ఆజాద్ మొన్న స్వయంగా చెప్పారు.. జగన్ కాంగ్రెస్‌లో ఉండి ఉంటే.. చర్యలు ఉండేవి కాదట. బయటకు వచ్చాడు కాబట్టే వేధిస్తున్నారట. కాంగ్రెస్ నేతల ప్రవర్తన చూస్తుంటే.. రాజశేఖరరెడ్డి మరణంపై నాకు అనుమానాలు బలపడుతున్నాయి. నాకే కాదు.. రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ మరణంపై ఎన్నో అనుమానాలున్నాయి. వాటన్నింటినీ నివృత్తి చేయాలని మీరందరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయండి’’ అని ప్రజలను కోరారు.

రాజకీయాలే మారిపోతాయి: ఈ ఉప ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ గెలిస్తే.. రాజకీయాలే మారిపోతాయని, రాజన్న సువర్ణయుగం మళ్లీ తెచ్చుకునేందుకు ఈ ఎన్నికలు నాంది అని విజయమ్మ అన్నారు. ప్రజా సంక్షేమ పథకాలను రాజకీయాల కోసం తుంగలో తొక్కిన, మన్నన లేని ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే ఎన్నికలివి అంటూ ‘‘జరుగుతున్న అన్యాయాలన్నీ.. దేవుడు చూస్తున్నాడు.. రాజన్న చూస్తున్నాడు.. మీరు చూస్తున్నారు.... సరైన న్యాయనిర్ణేతలు మీరే.. మీరే తీర్పు చెప్పండి’’ అని కోరారు.

మహానేత రెక్కల కష్టం ఈ ప్రభుత్వం: షర్మిల

మహానేత రెక్కల కష్టం మీద అందలం ఎక్కిన చాలామంది నాయకులు నేడు ఆయన కుటుంబానికి కీడు జరగాలని చూస్తున్నారని, అందుకోసం కుట్రలు పన్నుతున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక వినూత్న పథకాలను ప్రారంభించిన మహావ్యక్తిని నేడు అవినీతిపరుడని చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ‘‘ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జగనన్నకు 14 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని సంతోషంగా చెప్తున్నారు. ఆనాడు మహానేత ఈయన్ని స్పీకర్‌గా చేసి ఉండకపోతే.. సోనియాగాంధీ కళ్లకు కనిపించేవారా? సీఎం పదవి దక్కేదా ?’’ అని ప్రశ్నించారు. హెలికాప్టర్ ప్రమాదం జరిగిన రోజు వాస్తవానికి కిరణ్ కుమార్‌రెడ్డి కూడా నాన్నగారితో ప్రయాణించాల్సి ఉందని, కానీ ఆయన ఎందుకు హఠాత్తుగా తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారని సందేహం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై ఎందుకు సమగ్ర విచారణ జరిపించడం లేదన్నారు. జగనన్నపై జరుగుతున్న సీబీఐ దర్యాప్తు మొత్తం కాంగ్రెస్, టీడీపీ పెద్దల కుట్ర ఫలితమేనని దుయ్యబట్టారు. సీబీఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మ అన్న సంగతి సాక్షాత్తు సీబీఐ మాజీ డెరైక్టర్ జోగిందర్ చెప్పారని గుర్తుచేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!