YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 9 June 2012

జన కెరటం

= వైఎస్ విజయమ్మ ప్రచార సభకు పోటెత్తిన జనం
= ఒంగోలంటే వైఎస్‌ఆర్‌కు ఎంతో అభిమానం
= జగన్‌కు అండగా ఉన్న బాలినేనిని ఆదరించండి 
= ఓటర్లకు వైఎస్‌ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పిలుపు 
= వాసుమామకు ఓటేయాలన్న షర్మిల 
= విజయమ్మ ముందు సోనియా బలాదూర్ అన్న బాలినేని

ఒంగోలు నియోజకవర్గ ప్రజలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు జేజేలు పలికారు. ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని కోరుతూ శనివారం ఆమె కుమార్తె షర్మిలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక చర్చిసెంటర్ వద్ద జరిగిన రోడ్‌షోలో జనం పోటెత్తారు. చర్చిసెంటర్ జనసంద్రంగా మారింది. జోహార్ వైఎస్‌ఆర్..జై జగన్, బాలినేని నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. 



ఒంగోలు కార్పొరేషన్, న్యూస్‌లైన్: ‘ఒంగోలు అన్నా..ప్రకాశం జిల్లా అన్నా వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఎంతో అభిమానం. ఆయన ఈ జిల్లా గురించి ఎప్పుడూ ఆలోచించేవారు. ఒంగోలులో మెడికల్ కళాశాల నిర్మాణం, ప్రజల దాహా ర్తి తీర్చేందుకు రోజూ తాగునీటి పథకం, వరద ముంపు నుంచి విముక్తి చేసేందుకు పోతురాజు కాలువ ఆధునికీకరణ పను లు, గుండ్లకమ్మ రిజర్వాయర్, వెలిగొండ ప్రాజెక్టు, ఉలిచి చెక్‌డ్యాం, రామతీర్థం రిజర్వాయర్, యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం ఇలా ఒంగోలుకు, జిల్లాకు ఆయన చాలా చేశారు. ఇంకా చాలా చేయాలని చెప్పేవారు. ఆయన మరణం తరువాత జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తున్నారు. ఆయన సాయం పొందినవారు చాలా మంది మాకు దూరంగా ఉన్నారు. ఓ 17 మంది ఎమ్మెల్యేలు మాత్రం మా వెంట ఉన్నారు. రైతుల కోసం పదవులు పోగొట్టుకున్నారు. వారిలో మా వాసు(బాలినేని శ్రీనివాసరెడ్డి) కూడా ఉన్నాడు.

వాసు మొదటి నుంచి జగన్‌బాబుకు తోడున్నాడు. ఆయనతోపాటు వైవీ సుబ్బారెడ్డి కూడా మా కుటుంబానికి అండగా నిలిచి అన్నీ చేస్తున్నారు. మీకు, నాకు మనందరికీ ఓ బాధ్యత ఉంది. వైఎస్‌ఆర్‌ను ప్రేమించే వారిగా పదవులు కోల్పోయిన వారందరినీ తిరిగి వారి పదవుల్లో నిలబెట్టాలి. ఆ దిశగా ఉప ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓటేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నుంచి వైఎస్ జగన్ బలపరిచిన అభ్యర్థులను మనం గెలిపిం చుకోవాలి’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఒంగోలు నియోజకవర్గ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈనెల 12న జరిగే ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ ఒంగోలు నియోజకవర్గ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని కోరుతూ విజయమ్మ శనివారం ఒంగోలులో ఎన్నికల ప్రచా రం నిర్వహించారు.

ఈ సందర్భంగా స్థానిక చర్చిసెంటర్‌లో వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర నాయకుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు అధ్యక్షన ఎన్నికల ప్రచార సభ జరిగింది. ఈ సభలో వైఎస్ విజ యమ్మ మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ద్వారా పెద్ద పెద్ద సాయం పొందినవారు ఎవరూ తమకు అండగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిమంది అయినా తమకు అండగా ఉన్నారని వారిలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకరని గుర్తు చేశారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఉప ఎన్నికల్లో తిరిగితే అన్నీ స్థానాలు గెలుచుకుంటారనే కుట్రతోనే ఆయన్ను జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ప్లీనరీలో చెప్పిన విధంగా ఇచ్చిన ప్రతిమాటను నిలబెట్టుకుంటాడని హామీ ఇచ్చారు.

వాసు మామకు ఓటేయండి: షర్మిల
‘మా కుటుంబం కోసం వాసు మామ చాలా చేశాడు. అధికారం కోసం, పదవుల కోసం చాలా మంది పాకులాడుతుంటే మా కుటుంబం కోసం మంత్రి పదవిని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు రైతుల కోసం ఎమ్మెల్యే పదవినీ వదిలేశారు. మరోవైపు మా కుటుంబం కోసం సుబ్బారెడ్డి బాబాయి తన వ్యాపారాలన్నీ వదులుకొని తిరుగుతున్నారు. వీరు మాకు అండగా ఉన్నారు. మీరు వారికి అండగా ఉండాలి. వాసు మామను ఒంగోలు ఉప ఎన్నికల్లో గెలిపించుకోవాలి’అని దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల ఓటర్లను కోరారు. ఉప ఎన్నికల ప్రచారంలో విజయమ్మతో కలిసి పాల్గొన్న ఆమె చర్చిసెంటర్‌లో చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో పెట్టామని సంబరపడుతున్న వారికి తాను ఒక్కటే చెప్పదలచుకున్నానని, బోనులో ఉన్నా సింహం సింహమేనని వారు గుర్తించాలని హితవు పలికారు. ఫ్యాను గుర్తుకు ఓటేస్తే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్దోషి అనే విషయం దేశమంతా తెలుస్తుందన్నారు. జగనన్న జైల్లో ఉన్నా అదే ధైర్యంతో, గుండె నిబ్బరంతో ఉన్నారని చెప్పారు. ఆయన నిర్దోషిగా త్వరలోనే బయటకు వస్తార ని, సీఎం అవుతారని షర్మిల ధీమా వ్యక్తం చేశారు. 

సోనియా అయినా బలాదూరే...బాలినేని
‘నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చిన తరువాత ఇక్కడికి కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, చిరంజీవి, ఫురంధరేశ్వరి, పనబాకలక్ష్మి అందరూ వచ్చి ప్రచారం చేస్తున్నారు. విమర్శలు చేస్తున్నారు. నేను ఒక్కటే చెబుతున్నా మా విజయమ్మ ప్రచారం ముందు మీ సోనియా గాంధీ ప్రచారమైనా బలాదూరే..’అని వైఎస్‌ఆర్ సీపీ ఒంగోలు నియోజకవర్గ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు ఒంగోలుకు రెండుసార్లు వస్తే ఆయన జగన్ మీద, తనమీద విమర్శలు చేశాడే తప్ప అధికార పార్టీని ఒక్కమాట అనలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు వచ్చినా ఇదే పరిస్థితి కనిపించిందన్నారు. వారిద్దరి అపవిత్ర కలయిక ఏంటనేది ఇక్కడే బయటపడిందని వివరించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జనాల్లో తిరగనిస్తే 18 స్థానాలూ గెలుస్తారని కాంగ్రెస్‌పార్టీ కుట్రచేసి ఆయన్ను జైల్లో పెట్టిందన్నారు.

తిన్నింటి వాసాలు లెక్కబెడుతున్నారు: జూపూడి
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బతికి ఉన్నప్పుడు ఆయన ఇంటికి వెళ్లి విజయమ్మ చేతిమీదుగా ఇంత అన్నం తిన్నవాళ్లు నేడు తిన్నింటి వాసాలనే లెక్కబెడుతున్నారని వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర నాయకుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెటున్నా ప్రజలు మాత్రం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పక్షాన ఉన్నారని స్పష్టం చేశారు. త్వరలోనే జైలునుంచి బయటకు వచ్చి జగన్ సీఎం అవుతారని పేర్కొన్నారు. 

చర్చిసెంటర్‌కు పోటెత్తిన ప్రజలు: ఒంగోలు చర్చి సెంటర్‌లో వైఎస్ విజయమ్మ ప్రచార సభకు వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. మహిళలు పెద్ద సంఖ్యలో కదం తొక్కారు. ఉదయం 10.30 గంటలకు త్రోవగుంట వద్ద విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో ఒంగోలులోకి ప్రవేశించిన విజయమ్మ కొద్దిసేపు లాయర్‌పేటలోని వైవీ సుబ్బారెడ్డి నివాస గృహంలో విశ్రాంతి తీసుకున్నారు. అక్కడనుంచి నేరుగా 10.43 గంటలకు ఆమె సుబ్బారెడ్డి నివాసగృహం నుంచి చర్చి సెంటర్‌కు ప్రత్యేక వాహనంలో బయలు దేరారు. ప్రత్యేక వాహనంపైన బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. 

ఒంగోలు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శింగరాజు రాంబాబు యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో 500 మంది యువకులు మోటారు వాహనాల ప్రదర్శనతో విజయమ్మ ప్రత్యేక వాహనాన్ని అనుసరించారు. లాయర్‌పేట, కొణిజేడు బస్టాండ్, రాజాపానగల్‌రోడ్డు, జయరాం సెంటర్, కోర్టు సెంటర్, సీవీఎన్, మున్సిపల్ కార్యాలయం మీదుగా ప్రత్యేక వాహనం 11.15 గంటలకు చర్చి సెంటర్‌కు చేరింది. మున్సిపల్ కార్యాలయం వద్ద విజయమ్మ, షర్మిలలు ప్రత్యేక వాహనంపైకి ఎక్కారు. ఆపాటికే చర్చిసెంటర్‌లో భారీ జన సందోహం కనిపించింది. ఉదయం 8 గంటల నుంచే చర్చిసెంటర్‌కు ప్రజల తాకిడి మొదలైంది. పదిగంటల సమయానికి ఆప్రాంతంలోని రోడ్లన్నీ నిండిపోయాయి. విజయమ్మ ఆ ప్రాంతానికి చేరుకునే సమయానికి కలెక్టరేట్ రోడ్డు, ట్రంకురోడ్డు, రైల్వేస్టేషన్ రోడ్డు, మున్సిపల్ కార్యాలయం రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. విజయమ్మ ప్రసంగం దాదాపు 20 నిమిషాలకుపైగా సాగింది. షర్మిల పావుగంటకుపైగా మాట్లాడారు. వారిద్దరి ప్రసంగాలను జనం ఎంతో ఆసక్తితో విన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ హావభావాలను ప్రదర్శిస్తూ షర్మిల ప్రజలను ఉత్సాహపరిచారు. 

బాలినేనిని ఆశీర్వదించడానికి సభకు వచ్చిన ప్రతిగుండెకు హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా అంటూ విజయమ్మ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. హాజరైన అశేష ప్రజావాహినికి వైఎస్‌ఆర్ సీపీ ఒంగోలు నియోజకవర్గ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మధ్యాహ్నం గం.12.40కు సభ ముగించుకుని వైఎస్ విజయమ్మ, షర్మిలలు కావలికి తరలి వెళ్లారు. కాన్వాయ్ చర్చి సెంటర్ నుంచి సౌత్ బైపాస్ దాటేంత వరకు ప్రజలు కాన్వాయ్ వెంట నడిచారు. ప్రచార వాహనంపై సినీనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, పార్టీ రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి పద్మ, మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ కొల్లి నిర్మలాకుమారి, వైవీ భద్రారెడ్డి ఉన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!