YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 8 June 2012

స్పందన అంతంతమాత్రమే ఉండటంతో చిరంజీవి ఒకింత అసహనానికి


కాంగ్రెస్ పార్టీ తమ స్టార్ క్యాంపెయినర్‌గా చెప్పుకున్న సినీనటుడు చిరంజీవి రోడ్‌షోలకు కనీస స్పందన కూడా రావడం లేదు. ఏ గ్రామంలో చూసినా పదులు, అక్కడక్కడా వందలకు మించి జనం హాజరు కావడం లేదు. చిరంజీవి శుక్రవారం పాయకరావుపేట ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్తేరు నుంచి రోడ్డుషో ప్రారంభించారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగుగంటల వరకూ పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్టు ముందుగా ప్రకటించారు. అయితే ఉదయంపూట జరిగిన సభల్లోనే జనం లేకపోవడంతో ఆయన కేవలం ఒక్క పాయకరావుపేట మండలానికే ప్రచారాన్ని పరిమితం చేసి అనంతరం హైదరాబాద్ వెళ్లిపోయారు. 

మండలంలోని పలు గ్రామాల్లో ఎక్కడ పది మంది కనిపించినా ఆగి వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. వైఎస్‌ను కుట్రతో హత్య చేశారని, తన కుమారుడిని జైలు పాల్జేశారని విజయమ్మ ప్రజల్లో సానుభూతి కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. షర్మిల భర్త అనిల్‌కుమార్‌కు వైఎస్ బయ్యారంలో లక్షన్నర ఎకరాల భూమిని గనుల తవ్వకాలకు కేటాయించారని, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రద్దుచేసి నాలుగు మండలాల వారికి ప్రయోజనం చేకూర్చిందని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో మూడేళ్లుగా అభివృద్ధి కుంటుపడిందని చిరంజీవి అంగీకరించారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని చెప్పుకొచ్చారు. వైఎస్ కుటుంబంపై విమర్శలు చేసినప్పుడు జనం నుంచి కనీసస్పందన కూడా రాలేదు. దీంతో జనంలో ఉత్సాహాన్ని నింపేందుకు అక్కడక్కడ తన సోదరుడు పవన్‌కల్యాణ్ నటించిన గబ్బర్‌సింగ్ సినిమాలోని ‘కెవ్వు కేక’ పదాన్ని వల్లెవేశారు. అయినా స్పందన అంతంతమాత్రమే ఉండటంతో చిరంజీవి ఒకింత అసహనానికి గురైనట్టు కనిపించారు.

చిరు అసహనం..మంత్రి గంటా మనస్తాపం

ఆరంభం నుంచి రోడ్‌షోలకు జనం పల్చగా హాజరు కావడంతో చిరంజీవి అసహనం వ్యక్తం చేశారు. పాల్తేరు ప్రచార సమయంలో ఆయన ఈ విషయమై జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావుపై కొంత అసహనం వెలిబుచ్చారు. దీంతో అక్కడ ప్రసంగం ముగిశాక మంత్రి గంటా, ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, వెంకట్రామయ్య, అవంతి శ్రీనివాస్ వెనుదిరిగి వెళ్లిపోయారు. చిరంజీవి మాటలతోనే మంత్రి మనస్తాపం చెందినట్లు ప్రచారం జరిగింది. దీంతో అక్కడ నేతల్లో కలకలం రేగింది. చిరు, పీసీసీ చీఫ్ బొత్సలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో మనస్తాపంతోనే వారు వెళ్లిపోయారని చెప్పుకున్నారు. అయితే ఈ ప్రచారాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు. తాము నియోజకవర్గంలో మిగతా ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్లామే తప్ప మరో కారణం లేదని చెప్పారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!