YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 23 June 2012

మూడు లక్షల ఎకరాలకు నీరంటూ మూడేళ్లుగా ఉత్తుత్తి మాటలు

* సాగునీటి ప్రాజెక్టులపై సర్కారు చిన్నచూపు
* చివరి దశలో ఉన్న ప్రాజెక్టుల పూర్తిపైనా నిర్లక్ష్యమే
* 7 ప్రాజెక్టులు పూర్తిగా, 17 ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తిచేస్తామని మూడేళ్లుగా చెప్తున్న సర్కారు 
* ఈ 7 ప్రాజెక్టుల పూర్తికి కావలసింది రూ. 300 కోట్లే 
* వాటి కింద లక్ష ఎకరాల వరకూ కొత్త ఆయకట్టుకు నీరు 
* అయినా ఇప్పటివరకూ ఏ ప్రాజెక్టుకూ పైసా విదల్చని వైనం 
* ధరలు పెంచాలని కాంట్రాక్టర్ల డిమాండ్.. ఏడాదిన్నరగా ఫలించని సర్కారు చర్చలు 
* ధరలు పెంచితే ప్రాజెక్టులపై మొత్తం రూ. 10 వేల కోట్ల అదనపు భారమంటూ సర్కారుకు ఈఎన్‌సీ కమిటీ నివేదిక 
* ఆ భయంతో నిర్ణయం తీసుకోకుండా నాన్చుతున్న సర్కారు
* ఈ ఖరీఫ్ సీజన్‌లోనూ కొత్త ఆయకట్టుకు సాగు నీరు అందటం మృగ్యమే
* వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు 
* ఆయన మరణం తర్వాత ఒక్క ప్రాజెక్టూ పూర్తికాని వైనం

హైదరాబాద్, న్యూస్‌లైన్: కేవలం మూడు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తే.. చివరి దశలో ఉన్న ఏడు నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిపోయి.. దాదాపు లక్ష ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందుతుంది.. ఆ మేరకు సాగు విస్తీర్ణం పెరుగుతుంది. ఈ ఏడు ప్రాజెక్టులనూ పూర్తి చేసేస్తున్నాం అంటూ సర్కారు వారు గత మూడేళ్లుగా చెప్తూనే ఉన్నారు. కానీ.. ఆచరణలో మాత్రం అడుగు ముందుకు వేయటం లేదు. ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టును పూర్తి చేయటానికి ఇక అవసరమైంది కేవలం రూ. 95 కోట్లు మాత్రమే. అది పూర్తయితే.. 20,000 ఎకరాలు కొత్త ఆయకట్టుకు సాగు నీరు అందుతుంది. 

అలాగే.. గురురాఘవేంద్ర లిఫ్టును పూర్తి చేయటానికి మరో రూ. 66 కోట్లు ఇస్తే చాలు.. దాని కింద 23,000 ఎకరాల భూమి సాగులోకి వస్తుంది. రూ. 38 కోట్లు ఖర్చు పెడితే భూపతిపాలెం ప్రాజెక్టు పూర్తయి.. 14,000 ఎకరాల భూమిలో సాగు నీరు ప్రవహిస్తుంది. అంతెందుకు.. వంశధార-1, మత్తడివాగు ప్రాజెక్టులను పూర్తిచేయటానికి ఒక్కోదానికి కావలిసింది కేవలం రెండంటే రెండు కోట్లు మాత్రమే. ఆయా ప్రాజెక్టుల కింద ఐదు వేల ఎకరాల చొప్పున భూమి కొత్తగా సాగులోకి వస్తుంది. కానీ.. ఆ నిధులివ్వటానికీ సర్కారుకు మనసు రావటం లేదు. అదిగో ఇదిగో అంటూ ప్రతిసారీ ఖరీఫ్ సీజన్‌కు ముందు.. కొత్తగా 3 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని హామీ ఇవ్వటమే తప్ప దానిని ఆచరణలో పెట్టిన పాపాన పోలేదు. 

నిర్మాణం చివరి దశలో ఉన్న 7 ప్రాజెక్టులను పూర్తిగా, మరో 17 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఉత్తుత్తి మాటలు చెప్పటం తప్ప.. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టటం లేదు. ఇటీవలి ఉప ఎన్నికల నేపథ్యంలో.. ఎన్నికలు జరిగిన నియోజకవర్గాలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు అంటూ ఆగమేఘాల మీద వందల కోట్లు మంజూరు చేసింది. కానీ లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే సాగునీటి ప్రాజెక్టులను.. అందునా తుది దశలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయటానికి రూ. 300 కోట్లు భారమయ్యాయా? అని రైతాంగం, సాగునీటి రంగ నిపుణులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ వైఖరినిబట్టే సర్కారు ప్రాధాన్యాలేమిటన్నది తేలిపోతోందని వారు విమర్శిస్తున్నారు.

అన్నీ ఆర్భాటపు ప్రకటనలే... 
మూడేళ్లుగా సాగునీటి రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఖరీఫ్ నాటికి కొత్తగా మూడు లక్షల ఎకరాలకు నీరందిస్తామని నాలుగు నెలల కిందట మరోసారి ఆర్భాటంగా ప్రకటించింది. కానీ.. అది కూడా అమలు చేయలేకపోయింది. నిర్మాణం చివరి దశలో ఉన్న వంశధార-1, భూపతిపాలెం, ముసురుమిళ్లి, గురురాఘవేంద్ర లిప్టు, గుండ్లకమ్మ, మత్తడివాగు, చౌటుపల్లి హన్మంతరెడ్డి లిప్టు ప్రాజెక్టులను ఖరీఫ్ నాటిని పూర్తి చేస్తామని ఏడాది కిందట ప్రకటించారు. వాస్తవానికి ఈ ఏడు ప్రాజెక్టులకూ కలిపి రూ. 300 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. 

అలాగే మరో 17 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి వాటి ద్వారా కూడా నీరు అందిస్తామన్నారు. వీటిని కూడా కలిపితే.. సుమారు రూ. 4,000 కోట్లు అవసరం ఉంటుందని అంచనా వేశారు. కానీ వీటిని పూర్తి చేయటంలో ప్రభుత్వం విఫలమైంది. పనులు జరిగే సీజన్‌లో నిధుల కొరత అంటూ సమస్య సృష్టించారు. నిధుల విడుదల ఆలస్యం అవుతున్న కొద్దీ సిమెంటు, ఇనుము తదితరాల ధరలు పెరగటంతో.. పెరిగిన ధరలను తమకు వర్తింపజేయాలని కాంట్రాక్టర్లు డిమాండ్ పెట్టారు. సాధారణంగా ఈపీసీ ప్రకారం.. స్టీలు, సిమెంటు, ఫ్యూయల్ వంటి వాటికే పెరిగిన రేట్లు వర్తిస్తాయి. అయితే.. వీటితో పాటు చాలా రకాల ధరలు పెరిగాయని, ముఖ్యంగా కూలీ రేట్లు, ఇతర వ్యయం భారీగా పెరిగిందని.. కాబట్టి వాటికి కూడా రేట్లు పెంచాలని కాంట్రాక్టర్లు పట్టుపడుతున్నారు. పైగా ఒప్పంద కాలం కూడా అయిపోయింది కాబట్టి కొత్త ధరలు నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటివరకు నిర్మాణాలు చేపట్టబోమని తేల్చిచెప్తున్నారు. కానీ.. అందుకు ప్రభుత్వం ధరలు పెంచేందుకు అంగీకరించటం లేదు. 

దాంతో రాష్ట్రంలో ప్రాజెక్టుల పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. గత ఏడాదిన్నర కాలం నుంచి ఇదే అంశంపై ప్రభుత్వానికి, కాంట్రాక్టర్లకు మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి.. తప్ప పనులు మొదలుపెట్టే దిశగా అడుగులు పడలేదు. ఈ సమస్యపై ఇఎన్‌సీ (ఇంజనీర్స్ ఇన్ చీఫ్) కమిటీ ఒక నివేదికను కూడా ప్రభుత్వానికి అందించింది. పెరిగిన ధరలను వర్తింప చేస్తే.. సర్కారుపై దాదాపు రూ. 8,000 నుంచి 10,000 వరకూ అదనపు భారం పడుతుందని ఆ నివేదిక పేర్కొంది. అంతేగాక.. ఈ ధరల పెంపును అన్ని కాంట్రాక్టులకూ వర్తింప చేయాల్సి ఉంటుంది. ఈ భయంతో సర్కారు ఒక నిర్ణయం తీసుకోలేకపోతోంది. 

మరోవైపు.. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు కూడా కాంట్రాక్టర్లకు సర్కారుపై నమ్మకం సన్నగిల్లేలా చేశాయి. తాము పనులు చేసినా ప్రభుత్వం బిల్లులు చెల్లింస్తుందన్న ఆశలు వారిలో అడుగంటాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది. కనీసం చివరి దశకు చేరుకున్న ప్రాజెక్టులైనా పూర్తయి.. ఎంతోకొంత కొత్త ఆయకట్టుకు నీరందటం అనేది ఇప్పట్లో కార్యరూపం దాల్చే పరిస్థితి కనిపించటం లేదు. 

ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే ప్రయోజనం పొందే ప్రాంతాలివీ

నెట్టెంపాడు (మహబూబ్‌నగర్) 
ఈ రిజర్వాయర్ పరిధిలో మొదటి లిఫ్టు ద్వారా 6,000 ఎకరాలకు తొలి దశలో నీరివ్వాల్సి ఉంది. ధరూరు మండలంలో ద్యాగదొడ్డి, ఉప్పేరు, మాల్‌దొడ్డి, నీలహళ్లి, మీర్జాపురం గ్రామాలకు ప్రయోజనం కలగనుంది.

కల్వకుర్తి ఎత్తిపోతలు (మహబూబ్‌నగర్) 
ఎల్లూరు రిజర్వాయర్, సింగోటం శ్రీవారి సముద్రం పరిధిలోని మొత్తం 14 గ్రామాల్లో 13,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. సింగోటం, ఎన్మన్‌బెట్ల, మాచినేనిపల్లి, జావాయిపల్లి, తాళ్లనర్సింహ్మాపూర్, చౌటబెట్ల, రామాపురం, నర్సింగరావుపల్లి, ఎల్లూరు, కొల్లాపూర్, కుడికిళ్ల, అంకిరావుపల్లి, చుక్కాయిపల్లి, నార్లాపూర్ గ్రామాలకు మేలు జరిగేది.

బీమా ప్రాజెక్టు (మహబూబ్‌నగర్) 
మక్తల్ మండలంలో సంగంబండ రిజర్వాయర్ ద్వారా మాగనూరు మండలంలో మొత్తం పది గ్రామాలకు సాగునీరు లభించాల్సి ఉంది. వీటిలో నేరడ్‌గం, వర్కూర్, మాగనూరు, కున్సి, హిందుపూర్, నేరడ్‌గందొడ్డి, మందీపల్, గజరందొడ్డి, పర్మాన్‌దొడ్డి తదితర గ్రామాల రైతులకు ప్రయోజనం కలుగుతుంది. మక్తల్ మండలంలో కర్ని, ఖానాపూర్, పంచలింగాల్, రుద్రసముద్రం, గోలపల్లి, మంథన్‌గోడ్, యర్నాగన్‌పల్లి, కాట్రేవ్‌పల్లి; బూత్‌పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా నర్వ మండలంలో యాంకి, రాయికోడ్, నర్వ, రాంపూర్, రాజ్‌పల్లి, పెద్దకడ్మూర్, కల్వాల, చిన్నకడ్మూర్, నాగల్‌కడ్మూర్ తదితర గ్రామాలకు సాగునీరు లభిస్తుంది. 

భూపతిపాలెం ప్రాజెక్టు (తూ.గో.) 
ఈ ప్రాజెక్టు ద్వారా నీరందించే ఆయకట్టును 14,000 ఎకరాలకు కుదించారు. రంపచోడవరం మండలంలో 16 గ్రామాలు, గంగవరం మండలంలో 8 గ్రామాలకు నీరందని పరిస్థితి. సకాలంలో నీటిని అందిస్తే.. రంపచోడవరం మండలంలో రంప, చెరువూరు, పందిరిమామిడి, తాటివాడ, గోగుమిల్లి, బందపల్లి, టి.బూరుగుబంద, ఐ.పోలవరం, బీరంపల్లి, ఉసిరజొన్నల, మునిచిడుగుల, జగమెట్లపాలెం, నల్గొండ, బి.వెలమలకోట, ధరమడుగుల, ఊట్ల; గంగవరం మండలం గంగవరం, గార్లపాడు, వి.రామన్నపాలెం, కుసుమరాయి, పండ్రపొట్టుపాలెం, లక్కొండ, కొత్తాడ, ఆముదాలబంద గ్రామాలు ప్రయోజనం పొందనున్నాయి.

ముసురుమిల్లి ప్రాజెక్టు (తూర్పుగోదావరి)
మురుసుమిల్లి ప్రాజెక్టు ద్వారా రెండు మండలాలకు సాగునీరు ఇచ్చేందుకు ప్రతిపాదించగా, ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో దేవీపట్నం మండలం ఇందుకూరుపేట, దేవారం, పోతవరం, శరభవరం, రామన్నపాలెం, కోరుకొండ మండలం గరగలంపాలెం; గోకవరం మండలం తంటికొండ, గోపాలపురం గ్రామాలలోని ఆయకట్టుకు నీరందదు.

తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం
తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం కింద తూర్పుగోదావరిలోని రౌతులపూడి, శంఖవరం, గొల్లప్రోలు, పిఠాపురం, తొండంగి, తుని మండలాల్లో ఆయకట్టు ఉంది. అయితే.. ఖరీఫ్‌కు నీరు అందే పరిస్థితి కనిపించటం లేదు. 

వెంకటనగరం పంపింగ్ స్కీమ్ (తూర్పుగోదావరి) 
నీరు అందక మొత్తం ఆయకట్టులో 40 శాతం ఆయకట్టు పరిధిలో భూములను రైతులు రియల్ ఎస్టేట్ కోసం ప్లాట్‌లుగా మార్చేశారు. గోదావరిపై నిర్మిస్తున్న నాలుగో వంతెన పరిధిలోకి కొన్ని భూములు వెళ్లటంతో దానికి భూ సేకరణ చేశారు. మిగిలిన కోరుకొండ మండలం గాడాల, రాజమండ్రి రూరల్ కోలమూరు గ్రామాల ఆయకట్టుకు నీరందటం లేదు. 

తాడిపూడి (పశ్చిమగోదావరి) 
జిల్లాలోని గుండంపల్లి, వెంకటరామగూడెం, ద్వారకాతిరుమల, డుండ్లపల్లి, లక్ష్మీపురం, దండాపురం, దేవరపల్లి వంటి గ్రామాల్లోని రైతులకు ప్రయోజనం కలగనుంది.

వంశధార (శ్రీకాకుళం) 
అనుకున్న విధంగా పూర్తి చేసినట్టయితే.. శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా తిమ్మాపూర్, అక్కిలిపేట, కాలపర్తి, లక్ష్మడ్‌పేట, తుంకరపేట, నెల్లిపర్తి, కొత్తవలస వంటి గ్రామాలకు మేలు జరిగేది. 

కొమరం భీమ్ (ఆదిలాబాద్) 
ఈ ప్రాజెక్టు పనులు పూర్తయినా.. డిస్ట్రిబ్యూటరీల పనులు పెండింగ్‌లో ఉండటంతో రైతులకు నీరు అందటం కష్టంగా మారింది. నీరు ఇచ్చినట్టయితే.. కాగజ్‌నగర్, వాంకిడి, సిరిపూర్ వంటి మండలాల్లోని సుమారు 25 గ్రామాలకు మేలు జరగనుంది. 

మత్తడివాగు (ఆదిలాబాద్) 
కేంద్ర ఆటవీశాఖ నుంచి అవసరమైన అనుమతులు రాకపోవటం ఈ ప్రాజెక్టు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ప్రాజెక్టు వల్ల వద్దాడి, బండనగర్‌పూర్, కంపర్ల, జామిడి, సవర్‌గాం, గంగాపూర్, ఘాట్‌కూర్, దోరజ్ వంటి గ్రామాలకు మేలు జరిగే అవకాశం ఉండేది. 

గొల్లవాగు (ఆదిలాబాద్) 
ఈ ప్రాజెక్టు ద్వారా జైపూర్ మండలంలోని కొత్తపల్లి, మద్దిగల్, ఎల్ కేశారం, బీమారం, చెన్నూరు మండలంలోని చెన్నూరు, దుగిలపల్లి, రాయపూర్, కుంజర్ల వంటి గ్రామాలకు మేలు. 

ఏఎంఆర్‌పీ (నల్లగొండ) 
సియాపల్లి, పెద్దాపూర్, అనుమాడ, కలకల్లు, గుర్రంపోడు వంటి ప్రాంతాలకు మేలు జరిగే అవకాశం ఉంది. 

చౌటుపల్లి హన్మంతరెడ్డి (నిజామాబాద్) 
మోర్తాడు మండలంలోని రామన్నపేట, సుంకేట్, డోన్‌పాల్ గ్రామాలతో పాటు, కమ్మరిపల్లి మండలంలోని బషీరాబాద్, కొనసముందర్, నర్సాపూర్ గ్రామాలకు మేలు జరిగేది.

గుండ్లకమ్మ (ప్రకాశం) 
స్థానిక రాజకీయ కారణాల వల్ల నీటి విడుదలను నిలుపుదల చేశారు. ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేస్తే.. మద్దిపాడు మండలంలోని మల్లవరం, పలచర్లపేట, వెల్లంపల్లి, మద్దపాడు, రాచవారిపాలెం, ఎనమల నెల్లూరు, నందిపాడు, కీర్తిపాడు, అన్నంగి, గుండ్లపల్లి గ్రామాలతో పాటుగా నాగుఉప్పలపాడు మండలంలోని తక్కెళ్లపాడు, కొత్తకోట, అనుమాపురం, ఎడమనూరు, కోతవరం, కొల్లకుండ, చదలవాడ, మూచారం, అమ్ములబ్రోలు వంటి గ్రామాలకు మేలు జరగనుంది.

హంద్రీ - నీవా (కర్నూలు)
పత్తికొండ నియోజకవర్గంలోని పందికోన, దూదేకొండ, కనకదిన్నె, కోతిరాల, కొత్తపల్లి, మద్దికెర, బురుజుల, పెరవలి, హంప, అగ్రహారం, క్రిష్ణగిరి, పుట్లూరు, అమకతాడు, గోగులపాడు, కంబాలపాడు, గూడెంపాడు, కోయిలకొండ, లక్కసాగరం అదేవిధంగా కర్నూలు, ఓర్వకల్లు మండలాల్లోని గార్గేయపురం, దిగువపాడు, బి.తాండ్రపాడు, ఓర్వకల్లు, నన్నూరు, పూడిచెర్ల, కేతవరం గ్రామాల్లోని పొలాలు కొత్తగా సాగులోకి వస్తాయి.

గురురాఘవేంద్ర (కర్నూలు)
ఈ ప్రాజెక్టు ద్వారా నీరు ఇస్తే ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం, పూలచింత, మాచాపురం, కనకవీడు, సోగనూరు, పేట, టి.యస్.కూలూరు, ఇబ్రహీంపురం, నది కైరవాడి, నాగలదిన్నె, చిలకలడోన గ్రామాల్లోని రైతులు లబ్ధిపొందే అవకాశం. 

దేవాదుల ప్రాజెక్టు (వరంగల్) 
ధర్మసాగర్, ఎలుకుర్తి, రాంపూర్, ఉనికిచర్ల, టేకులగూడెం, మునిపల్లి, మడిపల్లి, మడికొండ, దేవునూర్, సోమదేవరపల్లి; కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం దామోర, గోపాల్‌పూర్, వల్భాపూర్, కోతులనడుమ; భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి, కొప్పూర్, మాణిక్యాపూర్, ఘన్‌పూర్, చాగల్లు, రాఘవాపూర్, పామునూర్, చిన్న పెండ్యాల, తిడుగు, గర్నపల్లి, ఉప్పుగల్, కోనూరు, రఘునాథపల్లి, వెంకటాపూర్ గ్రామాలకు ఉపయోగం. 

ఎస్‌ఆర్‌ఎస్‌పీ - 2 (వరంగల్) 
ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజ్-2 పరిధిలోని 31,000 ఎకరాలకు సాగునీరు వస్తే.. రాయపర్తి మండలం మొరిపిరాళ్ల, కొత్తూర్, రాయపర్తి, కాందార్‌పల్లి గ్రామాలతో పాటు నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సాగునీరు అందించవచ్చు. 

పులిచింతల 
ఈ ప్రాజెక్టు పూర్తయితే.. కృష్ణా డెల్టాలో సుమారు 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం చేకూరుతుంది. 

ఎల్లంపల్లి 
ఈ ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేస్తే.. ఎన్‌టీపీసీకి నీటిని సరఫరా చేయటానికి వీలు కలుగుతుంది. 

ప్రాజెక్టుల నిర్మాణం సాగింది వైఎస్ హయాంలోనే... 
సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ జలయజ్ఞం ప్రారంభించిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయారు. జలయజ్ఞం కింద మొదలు పెట్టిన 86 ప్రాజెక్టుల్లో 12 ప్రాజెక్టులను పూర్తిగా, మరో 21 ప్రాజెక్టులను పాక్షికంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలోనే పూర్తి చేశారు. వీటిద్వారా సుమారు 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించారు. ఆయన మృతి తర్వాత ప్రాజెక్టుల నిర్మాణ పనులు మందగించాయి.

1 comment:

  1. They don't do, don't do and don't do; because if they do, the credit may go either to the Late Great YSR or to YSJMR who per sues always. They decided to ruin the state, under the guidance of the INC supremo to wipe of the name of the GTEAT YSR.
    I think this malafied intension of them is crystal clear. The people of AP are quite unfortunate to loose YSR and to have BRUTAL rule of the centre.

    ReplyDelete

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!