‘రెండువేల ఏళ్ల చారిత్రక ప్రాశస్త్యం కలిగి, మూడు లక్షల మందికి పైగా నివసించే తిరుపతి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిదీ. తిరుపతి శాసనసభ్యునిగా నావంతు ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నాను. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక నా మొట్టమొదటి లక్ష్యం తిరుపతిని మద్యరహిత ప్రాంతంగా చూడడమే. అందుకే తిరుపతిని మద్యరహిత ప్రాంతంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, నేటినుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను నగరంలో పర్యటించినప్పుడు భర్తల తాగుడు కారణంగా పుస్తెలు తెగిపోయాయని, ఇల్లు గుల్లయిందని చాలామంది మహిళలు కన్నీరు పెట్టుకున్నారని చెప్పారు. తిరుపతి పవిత్రతను కాపాడడంతో పాటు మహిళల కన్నీరు తుడవడానికి తాను ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఇది చాలా సున్నితమైన సమస్యని.. మానవీయకోణంలో చూడాల్సి ఉందన్నారు. తిరుపతిలో మద్యం ఏరులై పారుతోందని, ఏడాదికి రూ.190 కోట్లకుపైగా మద్యం వ్యాపారం జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు.
No comments:
Post a Comment