YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 21 June 2012

సీబీఐ జేడీ తీరుతో జగన్ భద్రతకే ముప్పు!

* లీకుల పేరిట విలేకరులను పావులుగా వాడుకుంటున్నారు
* ప్రెస్‌కు లీకులు చేయొద్దని సీబీఐ మాన్యువల్‌లో స్పష్టంగా ఉంది
* సీఆర్‌పీసీ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పులూ ఉన్నాయి
* ఇది తెలిసీ విలేకరులకు ఫోన్లుచేసి లీకులివ్వడం వెనుక పెద్ద కుట్ర దాగివుంది
* రాష్ట్రపతి, ప్రధాని, సీవీసీలకు ఫిర్యాదు చేస్తాం

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘ప్రజా ప్రాధాన్యం కలిగిన కేసుల విచారణలో పురోగతి వివరాలను ప్రజలు తెలుసుకోవచ్చు. అయితే విచారణకు ముందే దానికి ప్రాచుర్యం కల్పించడం, లోతైన దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు ఆ వివరాలు బయటకు రావడం అవాంఛనీయం. అటువంటివి నివారించాలి... అని సీబీఐ మాన్యువల్(నిబంధనావళి)లో స్పష్టంగా ఉంది. అయినప్పటికీ సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ కొన్ని ఎంపిక చేసుకున్న చానెళ్లకు ఫోన్లు చేసి మరీ లీకులివ్వడం దారుణం. ఆయన తీరు వల్ల మా అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతకే ముప్పు ఏర్పడింద’’ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ ఎంవీ మైసూరారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 

జగన్ కేసు విషయంలో కక్ష గట్టిన ఫ్యాక్షనిస్టులా ఆయన విచారణ జరుపుతున్నట్లు కనిపిస్తోందన్నారు. మీడియాకు లీకుల పేరిట విలేకరులనూ ఆయన పావులుగా వాడుకుంటున్నారని పేర్కొన్నారు. దీనివెనుక పెద్ద కుట్ర ఉందనే అనుమానం కలుగుతోందని చెప్పారు. దీనిపై తాము రాష్ట్రపతి, ప్రధానమంత్రితోపాటు కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ)కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఫోన్‌కాల్స్ సంభాషణలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే వాస్తవాలేమిటో నిగ్గు తేలుతాయని చెప్పారు. గురువారం ఆయన ‘సాక్షి’ టీవీలో జరిగిన చర్చలో పాల్గొన్నారు. వీక్షకులడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

సీఆర్‌పీసీ కూడా అదే చెబుతోంది..
ఏదైనా ఒక కేసు విచారణలో ఉండగా మీడియాకు వివరాలు లీక్ చేయడం సీబీఐ మాన్యువల్ (నిబంధనావళి)కే విరుద్ధమని మైసూరారెడ్డి అన్నారు. సీఆర్పీసీలోని 11వ అధ్యాయంలోనూ ఈ విషయం స్పష్టంగా ఉందని, ఆయన దానినీ చదివి వినిపించారు. 1969-70 లో ‘నర్సింహులు వర్సెస్ ఏపీ స్టేట్’ కేసులో సుప్రీంకోర్టు ఈ విషయంపై స్పష్టమైన తీర్పును కూడా వెలువరించిందని చెప్పారు. సీబీఐ జాయింట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న లక్ష్మీనారాయణకు ఇవన్నీ తెలిసినా.. కావాలనే చేస్తున్నట్లు కనిపిస్తోందని, దీనివెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు అనుమానించాల్సి వస్తోందన్నారు. 

పత్రికా పోటీ ప్రపంచంలో సమాచార సేకరణ కోసం విలేకరులు సీబీఐ అధికారులకు ఫోన్ చేయడంలో తప్పు లేదని చెప్పిన మైసూరా.. సీబీఐ జేడీగా ఉన్న లక్ష్మీనారాయణ మాత్రం విలేకరులకు ఫోన్లు చేసి లీకులివ్వడం, ఎస్సెమ్మెస్‌లు పంపడం మాత్రం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఆయన తీరు చూస్తుంటే ఇది ఎంతదూరం పోతుందోననే అనుమానం వస్తోందన్నారు. సీబీఐ జేడీ ఫోన్‌కాల్స్ జాబితాపై సుప్రీంకోర్టు జడ్జి ద్వారా విచారణ జరిపితే వాస్తవాలేమిటో బయటకొస్తాయని అన్నారు.

జైల్లో రాత్రంతా కరెంటు లేదు..
‘‘జగన్‌ను భద్రత లేని వాహనాల్లో తీసుకెళ్లడం, సీబీఐ అధికారులు జగన్‌ను కస్టడీలోకి తీసుకున్నప్పుడు ఒక్కోరోజు ఒక్కోచోట విచారణ జరపడం, ఏ వాహనంలో ఆయనను తీసుకెళుతున్నారనే విషయం ముందుగానే మీడియాకు లీక్ కావడం, జగన్ ఉన్న జైల్లో నిన్న రాత్రంతా కరెంట్ లేకపోవడం, ముక్కలు ముక్కలుగా చార్జిషీట్లు వే యడం, అలా చేసిన ప్రతిసారీ జగన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉండటం... ఇలాంటి అంశాలను చూస్తుంటే జగన్‌కు భౌతికంగా హాని కలిగే ప్రమాదముందనే ఆందోళన కలుగుతోంది. పైగా చంద్రబాల అనే మహిళ నుంచి వందల కాల్స్ సీబీఐ జేడీకి వెళ్లడం, ఆయన నుంచి మళ్లీ ఆమెకు వందల సంఖ్యలో ఫోన్లు వెళ్లడం... ఆమే జగన్ ప్రత్యర్థులకు ఫోన్ చేసి మాట్లాడటం చూస్తుంటే జగన్‌పై ఏదో కుట్ర చేస్తుందనే అనేక అనుమానాలు కలుగుతున్నాయి’’ అని మైసూరారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. సున్నితమైన జగన్ కేసు విషయంలో ఎంతో నిబద్ధతతో వ్యవహరించాల్సిన సీబీఐ జేడీ ఇంతమంది వ్యక్తులకు ఫోన్లు చేయాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు.

సుప్రీంకోర్టు వద్దన్నా నార్కో పరీక్షలా?
నార్కో అనాలసిస్ పరీక్ష అశాస్త్రీయమని సుప్రీంకోర్టే చెప్పిందని, డోస్ ఎక్కువైతే కిడ్నీలు, మెదడు దెబ్బతిని ప్రాణాపాయం జరిగే ప్రమాదముందని మైసూరారెడ్డి తెలిపారు. ఈ విషయాలు తెలిసి కూడా సీబీఐ హైకోర్టులో పిటిషన్ వేసిందంటే ఏమనుకోవాలో అర్థం కావడం లేదన్నారు. జగన్‌కు ప్రాణహాని కలిగించాలనే కుట్రతోనే నార్కో పరీక్ష చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. సీబీఐ వాళ్లు ఎవరిని విచారించినా జగన్ పేరు చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. జగన్ తప్పు చేయనప్పుడు మేమెట్లా ఆయన పేరు చెబుతామని విచారణ ఎదుర్కొన్న వాళ్లు అడుగుతున్నారని, ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యను కూడా ఇలాగే ఒత్తిడి చేసిన విషయాన్ని ఆయనే స్వయంగా కోర్టుకు విన్నవించినట్లు తాను విన్నానన్నారు. మొత్తంగా చూస్తే లక్ష్మీనారాయణ పరిధి దాటి, కోర్టు తీర్పును అతిక్రమించి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని, దీనివల్ల సీబీఐకే చెడ్డ పేరొస్తుందని అభిప్రాయపడ్డారు.

లీకులు చేయట్లేదని కోర్టుకు చెప్పారు
సాక్ష్యాలన్నీ సేకరించాక చార్జిషీట్ వేయాల్సిన సీబీఐ వ్యక్తిగత కక్షలతో ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ కక్షగట్టిన ఫ్యాక్షనిస్టులా దర్యాప్తు చేస్తున్నట్లుగా కనిపిస్తోందని, ఆయనిలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని మైసూరా అన్నారు. పైగా కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తానెవరికీ లీకులు చేయలేదని, విలేకరులతో మాట్లాడలేదని చెప్పిన లక్ష్మీనారాయణ ..తాజా ఫోన్‌కాల్స్ జాబితాను చూస్తుంటే ఎంతమందితో మాట్లాడారో తేలిపోయిందన్నారు. హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించేలా సంభాషణలున్నట్లు తెలుస్తోందన్నారు. 

‘ఆయన తీరు చూస్తుంటే నేను ఎవరినైనా తప్పుదోవ పట్టించగలను... నేనెవరిపైనా దర్యాప్తు చేయగలననే భావనతో ఉన్నట్లుగా ఉంది. నేను చెప్పినట్లు చేస్తే నిన్ను కేసులో నుంచి తప్పిస్తాననే స్థాయికి సీబీఐ దిగజారిపోయింది. ఈయన మామూలు వ్యక్తి కాదు. రాజ్యాంగబద్ధ సంస్థలను కూడా బెదిరించే స్థాయికి వెళ్లారు. ఈయనపై విచారణ చే యాల్సి వస్తే సీవీసీని కూడా బెదిరిస్తాడేమో! అందుకే మేం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోరుతున్నాం. అట్లయితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని మేం నమ్ముతున్నాం’’ అని చెప్పారు. 

ఫోన్ కాల్ జాబితాను చూస్తే న్యాయమూర్తులకూ ఫోన్ చేస్తున్నట్లు, జడ్జి చాంబర్‌కు కూడా వెళ్లి మాట్లాడుతున్నట్లు తేలిందన్నారు. ఒక అధికారి దర్యాప్తు చేయాలే తప్ప జడ్జిల దగ్గరకు వెళ్లి మాట్లాడాల్సిన అవసరమేముందో తనకైతే అర్థం కావడం లేదని చెప్పారు. ‘2జీ స్కాం వంటి కేసులో కూడా డీఎస్పీ స్థాయి అధికారి కోర్టులకు హాజరవుతుంటే.. జగన్ కేసులో మాత్రం స్వయంగా ఆయనే హాజరవుతున్నారు ఎందుకో! కోర్టులో ఆయన బాడీ లాంగ్వేజ్‌ను కూడా కొందరు న్యాయవాదులు తప్పుపడుతున్నారు’ అని మైసూరా అన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!