YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 20 June 2012

చంద్రబాబూ.. విచారణకెందుకు సిద్ధపడరు?

- చంద్రబాబూ.. విచారణకెందుకు సిద్ధపడరు?: గట్టు
- నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిందిపోయి ఎవరూ ఏమనొద్దంటే ఎలా?
- కోలా ఆరోపణలకు జవాబు చెప్పకుండా సాక్షిని నిందించడమేమిటి?
- ఎదురుదాడే తప్ప రూ.5.10 కోట్లు తీసుకున్నదీ లేనిదీ.. విదేశీ ఖాతాలు 
- మీవో కావో ఎందుకు స్పష్టంగా చెప్పరు?.. 
- అన్నీ సర్దుబాటు చేసుకున్నాక చెబుతారా?

హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అండ్ కోకు మొత్తం 8 విదేశీ ఖాతాలు ఉన్నాయని, భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందంటూ వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించకుండా, విచారణకు సిద్ధపడకుండా.. కోలా కృష్ణమోహన్‌పైనా, సాక్షి పత్రికపైనా ఎదురు దాడి చేయడమేమిటని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు. చంద్రబాబు వాదన వింతగా ఉందని ఆయన విమర్శించారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో గట్టు విలేకరులతో మాట్లాడారు. 

బాబుకు వివిధ విదేశీ బ్యాంకుల్లో 16 ఖాతాలు ఉన్నట్లుగా (బినామీ పేర్లతో), కొన్ని ఖాతాల్లోకి తానే నిధులు ట్రాన్స్‌ఫర్ చేసినట్లుగా కృష్ణమోహన్ స్పష్టంగా చెబుతుంటే.. చంద్రబాబు వాటికి జవాబులు చెప్పకుండా కోలాను 420 అంటూ, సాక్షి మీడియాను తూలనాడుతూ మాట్లాడటంపై గట్టు ధ్వజమెత్తారు. కోలా 420 అని బాబు చెప్పడమేమిటి.. ఆ విషయం అతనే అంగీకరించాడని పేర్కొంటూ, తాను 420 అయితే చంద్రబాబు ‘420 ఁ 10’ అని కృష్ణమోహన్ చెప్పిన విషయం ఆయన గుర్తు చేశారు. తన సహచరుడు, తమ పార్టీ సభ్యుడు, మనీలాండరింగ్‌లో తనతో కలిసి పనిచేసిన వ్యక్తి ఇంత పెద్ద ఆరోపణలు చేస్తే వాటిపై విచారణకు సిద్ధపడి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన చంద్రబాబు.. తనను ఎవరూ ఏమీ అనవద్దనే తీరులో మాట్లాడ్డం తగదని అన్నారు. 

యూరో లాటరీ గెల్చుకున్నాననే విషయం తెలిసి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనను ఇంటికి ఆహ్వానించారని, టీడీపీలో చేరాల్సిందిగా కోరడమే కాకుండా మచిలీపట్నం నుంచి లోక్‌సభ సీటును కూడా ఇవ్వజూపారని, తాను ఆయనకు రూ.5.10 కోట్లు ఇచ్చానని కోలా ఆరోపిస్తుంటే.. అవి నిజమో కాదో బాబు ఎందుకు చెప్పరని గట్టు నిలదీశారు. 

కోలా ఇచ్చింది పది లక్షల రూపాయల చెక్కేననీ దానిని తిరిగి ఇచ్చేశాననీ చంద్రబాబు చెబుతున్నారని.. అంటే తనకు డబ్బులిస్తే పదవులిస్తాననీ, టికెట్లు ఇస్తాననీ ఆయన అంగీకరించినట్లే కదా! అని అన్నారు. బాబుకు తానిచ్చింది రూ.10 లక్షలే కాదని, మరో రూ.4 కోట్లు సింగపూర్ ఖాతాకు బదిలీ చేశానని, మరికొంత ఆయన కుమారునికి ఇచ్చానని కోలా స్పష్టంగా చెబుతున్నారని గట్టు పేర్కొన్నారు. 

తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ అధికారులు అరెస్టు చేసినపుడు కూడా ఈ విషయాలు వెల్లడించానని, అయితే చంద్రబాబు వారిని మేనేజ్ చేశారని కోలా చెప్పిన సంగతి గుర్తుచేశారు. అసలు కోలా వెల్లడించిన ఖాతాలు చంద్రబాబునాయుడివి కాదా?, ఆయన బినామీలవా కావా? స్పష్టం చేయాలని గట్టు డిమాండ్ చేశారు. వాటన్నింటినీ బోగస్ ఖాతాలని చెప్పి చంద్రబాబు దొరికి పోయారని, అవి నిజమైన ఖాతాలు కావని బాబుకు ఎలా తెలుసని గట్టు ప్రశ్నించారు. కోలా ఆరోపణలకు పది రోజుల తరువాత సమాధానం చెబుతానని బాబు చెప్పడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. ఈలోపు అన్నీ సర్దుబాటు చేసుకుని జవాబు ఇవ్వాలనా? అని ఎద్దేవా చేశారు. 

కోలా ఆరోపణలు ్రపసారం చేయకుండా.. చంద్రబాబు వివరణపై స్క్రోలింగ్‌లా?
కోలా కృష్ణమోహన్‌కు ఒక్క ‘సాక్షి’ మాత్రమే రక్షణ ఇస్తుందా? అని బాబు ప్రశ్నించడం అసంబద్ధమని పేర్కొంటూ.. కోలా ఇతర చానళ్లు, పత్రికలకు కూడా తన ప్రకటన పంపినా వారు ప్రచురించలేదని, ఎందుకు ప్రచురించలేదో వారి విచక్షణకే వదలి వేస్తున్నామని గట్టు అన్నారు. బాబుపై వచ్చిన ఆరోపణల విషయంలో కొన్ని మీడియా సంస్థలు వ్యవహరించిన తీరు గర్హనీయమని ఆయన అన్నారు. కృష్ణమోహన్ చేసిన ఆరోపణలను ఒక్క ముక్క కూడా ప్రసారం చేయని కొన్ని టీవీలు చంద్రబాబు చెబుతున్నదానిని మాత్రం స్క్రోలింగ్‌లు ఇస్తున్నాయని చెప్పారు. అవి బాబు బినామీ సంస్థలు కావడమే ఇందుకు కారణమా? ఆని ప్రశ్నించారు. 

బాబుపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని, కాంగ్రెస్‌తో చంద్రబాబుకున్న మ్యాచ్‌ఫిక్సింగే కారణమా? అని సందేహం వ్యక్తం చేశారు. ‘మీరు నన్ను కాపాడండి, మీ ప్రభుత్వాన్ని నేను రక్షిస్తా..’ అన్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం, బాబు వ్యవహరిస్తున్నారన్నారు. బాబుపై వచ్చిన ఆరోపణలపై సీపీఐ నేత నారాయణ, లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌నారాయణ ఎందుకు స్పందించడం లేదు? వారి పేర్లలో కూడా నారా అని ఉన్నందుకేనా? అని గట్టు వ్యంగ్యంగా ప్రశ్నించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!