YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 21 June 2012

‘జగన్ కేసుల విచారణ నుంచి సీబీఐ జేడీని తప్పించాలి’

జగన్ కేసుల దర్యాప్తులో ఆద్యంతమూ కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్న సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణను తక్షణం విచారణ నుంచి తప్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యా నిర్వాహక మండలి సభ్యుడు అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఆయన గురువారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్థన్, అధికార ప్రతినిధులు వాసిరెడ్డి పద్మ, జనక్ ప్రసాద్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లక్ష్మీ నారాయణ ఒక ఉన్నత స్థానంలో ఉంటూ కీలకమైన కేసులను దర్యాప్తు చేస్తూ విచారణకు సంబంధించిన విషయాలను లీకుల రూపంలో వెల్లడిస్తున్నారని ధ్వజమెత్తారు. అసలు విచారణ వివరాలను లీకుల పేరుతో వెల్లడించడం సీబీఐ మాన్యువల్ (నియమావళికి) విరుద్ధమనీ ఇందుకు సంబంధించి హైకోర్టు తీర్పులు కూడా ఉన్నాయనీ ఆయన అన్నారు.

గత రెండు మాసాలుగా జేడీ పదే పదే పత్రికా విలేకరులతోనూ, పత్రికాధిపతులతోనూ మాట్లాడిన ఫోన్ల వివరాలను తమ పార్టీ వెల్లడించిందనీ ఆయన అన్నారు. తమ పార్టీకి బద్ధ వ్యతిరేకి అయిన ఆంధ్రజ్యోతి అధిపతి రాథాకృష్ణతో కూడా జేడీ మాట్లాడారని ఆయన వెల్లడించారు. ‘పత్రికల, చానెళ్ల విలేకరులు విచారణ వివరాలు తెలుసుకునేందుకు సీబీఐ జేడీకి ఫోన్ చేయడాన్ని మేం ప్రశ్నించడం లేదు...కానీ జేడీ స్వయంగా కొన్ని ఎంపిక చేసుకున్న పత్రికలు, చానెళ్ల విలేకరులతో మాట్లాడటాన్ని మేం ప్రశ్నిస్తున్నాం...అంతే కాదు వాసిరెడ్డి చంద్రబాల అనే మహిళతో జేడీ ఫోన్‌లో మాట్లాడారు. ఆ తరువాత ఆమె మాకు వ్యతిరేకి అయిన రాథాకృష్ణతో మాట్లాడారు. ఇలా ఎందుకు జరిగిందో రామాయణంలో పిడకల వేటలాగా ఆ చంద్రబాల ఎవరో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో లక్ష్మీ నారాయణ సమాధానం ఇవ్వాలి’ అని ఆయన అన్నారు.

ఈ చంద్రబాల గ్రేహౌండ్స్ అధిపతితో ఎందుకు మాట్లాడిందో కూడా తేలాలని ఆయన అన్నారు. విలేకరులు ఎన్ని లక్షల సార్లు లక్ష్మీనారాయణకు ఫోన్ చేసినా ఎవరికీ అభ్యంతరం లేదనీ అయితే ఆయనే స్వయంగా విలేకరులతో మాట్లాడ్డం తప్పు అని అంటున్నామనీ తమను విలేకరులు అపార్థం చేసుకోరాదనీ ఆయన అన్నారు. అసలు జగన్ కేసులపై విచారణ మొదలైనప్పటి నుంచీ ఆ వివరాలన్నీ ఈనాడుతో సహా కొన్ని పత్రికల్లో పూసగుచ్చినట్లు వస్తున్నాయని తాము చెబుతూనే ఉన్నామనీ ఇపుడు ఫోన్‌కాల్స్ ద్వారా అది అక్షరాలా నిజమనేది వెల్లడైందనీ రాంబాబు అన్నారు.

తాను స్వయంగా ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో సాక్షిగా సీబీఐ ముందు హాజరైతే అక్కడ జరిగిన విషయాలన్నీ సవివరంగా ఈనాడు పత్రికలో వచ్చాయి. అంతే కాదు, సీబీఐ కోర్టు న్యాయమూర్తి నాగమారుతీ శర్మ బదిలీ అవుతున్న విషయం కూడా ముందుగా ఒక తోక పత్రికలో వచ్చిందనీ సీబీఐ అధికారులు ఉద్దేశ్యపూర్వకంగా లీక్ చేయక పోతే ఇవన్నీ ఎలా వచ్చాయో లక్ష్మీనారాయణ సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. జగన్ కేసుల విషయంలో నిష్పాక్షికంగా విచారణ జరుగడంలేదనీ ఎంత సేపూ ఆయన్ను ఏదో విధంగా ఇరికించాలనే విధంగా జరుగుతోందని ఆయన అన్నారు.

ముఖ్యమైన కేసులు దర్యాప్తు చేసే ఒక రాజ్యాంగ సంస్థలో బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తిగా లక్ష్మీనారాయణ పత్రికలకు లీకులు ఇవ్వడం ముమ్మాటికీ తప్పు, ఆయన ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు అని ఆయన అన్నారు. విచారణ వివరాలు చెప్పదల్చుకుంటే పత్రికా విలేకరుల సమావేశం పెట్టి చెబితే తప్పు లేదని కూడా ఆయన అన్నారు. తమ వద్ద టెలిఫోన్ వివరాలన్నీ ఉన్నాయనీ వాటిని తాము త్వరంలో ప్రధాని రాష్ట్రపతి ముందుంచుతామనీ కేంద్రానికి జేడీ వైఖరిపై ఫిర్యాదులు చేస్తామనీ రాంబాబు తెలిపారు. కేసుల దర్యాప్తు నిష్పాక్షికంగా కాకుండా ఒక రాజకీయ కుట్రలో అంతర్భాగంగా జరుగుతోందని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ పార్టీ ఫోన్ కాల్స్ జాబితాను విడుదల చేయడం ఏమాత్రం తప్పుగా భావించడం లేదనీ వారికి ఎక్కడి నుంచైనా బెదిరింపు కాల్స్ వస్తూ ఉంటే తాము తీవ్రంగా ఖండిస్తామనీ విలేకరులకు అండగా ఉంటామనీ రాంబాబు స్పష్టం చేశారు. రిపోర్టర్లను వివాదంలోకి లాగుతున్నామనే విమర్శలను ఆయన తోసి పుచ్చుతూ విలేకరుల ఫోన్ నెంబర్లను వెల్లడించడంలో ఏ మాత్రం తప్పు లేదనీ అవి రహస్యమేమీ కాదనీ బహిరంగంగా చెప్పవచ్చనీ వివరించారు. తాము విడుదల చేసిన ఫోన్ల జాబితాపై జేడీ ముందుకు వచ్చి వివరణ ఇస్తారని భావించామనీ అలా కాకుండా పత్రికా విలేకరులు ముందుకు వచ్చి మాట్లాడ్డం చూస్తే ఆయన తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా అర్థం అవుతోందనీ బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. అయినా విలేకరులుగా పనిచేసే వారు పిరికి వారు కాదనీ విధి నిర్వహణలో వారు భయపడితే వారు విలేకరులుగా ఉండటానికే అనర్హులని ఆయన అన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!