YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 21 June 2012

శాసనసభా పక్షనేతగా విజయమ్మ

ఉప నేతలు, కార్యవర్గ నియామక అధికారం ఆమెకే
పటిష్టమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని నిర్ణయం
భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు
ఈ మేరకు వైఎస్సార్‌సీఎల్పీ ప్రత్యేక తీర్మానం
మద్దతు ధర పెంచాలని.. కరెంటు, పెట్రో ధరలు, వస్త్రాలపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్
ఇటీవలి దుర్ఘటనల మృతులకు సంతాపం
భేటీ వివరాలను మీడియాకు వెల్లడించిన శోభ
నేడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు గురువారం ఇక్కడ సమావేశమై ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారు. వైఎస్సార్‌సీఎల్పీ ఉప నేతలను, కార్యవర్గాన్ని నియమించే అధికారాన్ని విజయమ్మకు కట్టబెడుతూ సమావేశం మరో తీర్మానాన్ని ఆమోదించింది. రైతులు, రైతు కూలీల పక్షాన నిలిచిన తమను ఆదరించి, భారీ ఆధిక్యతలతో గెలిపించి శాసనసభకు పంపినందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ నూతన ఎమ్మెల్యేలు మరో ప్రత్యేక తీర్మానం ఆమోదించారు. అధికార కాంగ్రెస్ ప్రజా సమస్యలను గాలికొదిలేస్తే, నిలదీయాల్సిన విపక్ష టీడీపీ కూడా ప్రభుత్వంతో కుమ్మక్కయిందని వారు అభిప్రాయపడ్డారు. అందువల్ల ప్రజాపక్షం వహించి పోరాడాల్సిన బాధ్యత వైఎస్సార్ కాంగ్రెస్‌పైనే ఉందని పేర్కొన్నారు. 

ఇక నుంచి అసలైన ప్రతిపక్షంగా చురుకైన పాత్ర నిర్వహించాలని నిర్ణయిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు, నేతలకు విజయమ్మ అల్పాహార విందు ఇచ్చారు. ఎమ్మెల్యేలు డి.కృష్ణదాస్, టి.బాలరాజు, జి.బాబూరావు, మేకతోటి సుచరిత, భూమా శోభానాగిరెడ్డి, ఎ.అమరనాథరెడ్డి, కె.శ్రీనివాసులు, బాలినేని శ్రీనివాస రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కె.చెన్నకేశవరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, బి.గురునాథ్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి భేటీలో పాల్గొన్నారు. 

నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆయన సోదరుడు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఇటీవలే మాతృ వియోగం కలిగినందువల్ల భేటీకి రాలేకపోయారు. శాసనసభాపక్ష భేటీ అనంతరం ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకరరావు, చదిపిరాళ్ల నారాయణరెడ్డి, డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎం.ప్రసాదరాజు, మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి తదితరులు కూడా సమావేశమయ్యారు. ప్రభుత్వంపై ఇకనుంచి గట్టిపోరాటం చేయాలని నిర్ణయించారు. కొత్తగా ఎన్నికైన 15 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు.

విత్తనాలివ్వలేని దౌర్భాగ్య ప్రభుత్వం: రాష్ట్రంలో ప్రతిపక్ష ం నిర్వీర్యమైపోయింది గనుక ఆ స్థానాన్ని భర్తీ చేయాలంటూ ప్రజలు తమను గెలిపించారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తొలకరి ప్రారంభమై రైతులంతా విత్తనాల కోసం ఎదురు చూస్తున్నా అందించలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వముందని దుయ్యబట్టారు. సర్కారు తీరును శాసనసభాపక్షం ఎండగట్టినట్టు తెలిపారు. భేటీ అనంతరం సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రజా సమస్యలను పరిష్కరించడానికి సమయం లేని ముఖ్యమంత్రి, మంత్రులు.. జగన్‌ను ఇబ్బందులు పెట్టడంలో మాత్రం ముందున్నారు. రైతులకు చెల్లించాల్సిన 2010 తాలూకు ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇప్పటిదాకా చెల్లించలేదు’’ అంటూ మండిపడ్డారు. వరి ధాన్యానికి పెరిగిన మద్ద తు ధర ఏ మాత్రం సరిపోదన్నారు. ‘‘పెరిగిన ఎరువుల ధరలకు, కూలీకి అనుగుణంగా దాన్నీ పెంచాలి. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలకు కేంద్రాన్ని నిందించి సరిపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాట్‌ను తగ్గించాలి. వస్త్రాలపై కూడా వ్యాట్‌ను తగ్గించాలి’’ అని ఆమె డిమాండ్ చేశారు.

సీబీఐ వైఖరిని ప్రతిఘటిస్తాం: నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించరాదని ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పట్ల సీబీఐ కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందని శోభ తూర్పారబట్టారు. సీబీఐ వైఖరిని ప్రతిఘటిస్తామని ప్రకటించారు. ‘‘జగన్‌కు ప్రాణహాని ఉం దని ఆయన సతీమణి వైఎస్ భారతీ రెడ్డి ఇప్పటికే కోర్టులో కేసు వేశారు. ఇలాంటి నేపథ్యంలో జగన్‌కు నార్కో అనాలసిస్ పరీక్షలకు అనుమతించాలని సీబీఐ అడగడంలో ఆంతర్యమేమిటి? ఇదంతా మా నాయకునికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో భాగమే. జగన్ కేసులపై సీబీఐ పూర్తి పక్షపాత బుద్ధితో దర్యాప్తు చేస్తోంది. విచారణ కొన్ని పత్రికల నిర్దేశకత్వంలో జరుగుతున్నట్టుగా ఉంది’’ అని అనుమానం వ్యక్తం చేశారు. లక్ష్మీపేట, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉదంతాల్లో, షిర్డీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి, ఆత్మహత్య చేసుకున్న 104 నిరుద్యోగులకు సమావేశం ప్రగాఢ సంతాపం తెలిపిందని వివరించారు.

సానుభూతి నీకు రాలేదేం బాబూ!

సానుభూతి వల్లే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యలపై శోభా నాగిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. 2004 ఎన్నికలకు ముందు అలిపిరి వద్ద నక్సల్స్ దాడి నుంచి బాబు బయట పడ్డాక చిరిగిన బట్టలు, రక్తం మరకలతో ఉన్న ఆయన ఫొటోలను పెద్ద పెద్ద పోస్టర్లు వేసి ఓట్లడిగినా సానుభూతి రాలేదెందుకని సూటిగా ప్రశ్నించారు. ‘‘ప్రజల సానుభూతి చూరగొనాలంటే వారికి మనపై ప్రేమ ఉండాలి. జగన్‌పై ప్రజలకు ప్రేమ ఉంది గనుకే ఆయనకు వారి ఆదరణ లభించింది. బాబుపై ప్రజలకు ఏ మాత్రమూ ప్రేమ లేదు కాబట్టే 2004 ఎన్నికల్లో ఆయనపై సానుభూతి రాలేదు’’ అని వివరించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!