YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 21 June 2012

సీబీఐ మాన్యువల్‌లో ఏముంది?

మీడియా విషయంలో సీబీఐ ఎలా వ్యవహరించాలన్న అంశాన్ని దర్యాప్తు సంస్థ మాన్యువల్ (నియమావళి)లో స్పష్టంగా పేర్కొన్నారు. అందులోని ఐదు పేజీల్లో ఈ వివరాలు ప్రత్యేకంగా పేర్కొన్నారు. ‘సీబీఐ అనేది ఒక బహిరంగ సంస్థ కాదు, అదే సమయంలో అదేమీ గోప్యతతో కూడుకున్న సంస్థ కూడా కాదు. అది ప్రభుత్వానికీ, కోర్టులకూ, పార్లమెంటుకూ, చీఫ్ విజిలెన్స్ కమిషనర్‌కూ, ప్రజలకూ, పత్రికలకూ జవాబుదారీగా ఉండాల్సిన సంస్థ. కేసుల దర్యాప్తుతో రాజీ పడకుండా, విచారణ దెబ్బ తినకుండా సీబీఐ.. మీడియా, పత్రికలతో సంబంధాలు నెరపవచ్చు. కాబట్టి, పత్రికలకు సీబీఐ విడుదల చేయదలచుకున్న సమాచారం జాగ్రత్తగా సరిచూసుకున్న తరువాత గానీ విడుదల చేయకూడదు. 

ప్రజాస్వామ్యంలో మీడియా పాత్రను ఈ సందర్భంగా గుర్తించాలి. ప్రజా ప్రాధాన్యం గల కేసుల పురోగతి గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. అదే సమయంలో.. దర్యాప్తు లోతుగా జరుగుతున్న తరుణంలో అది పూర్తి కాక ముందే ప్రాచుర్యం కావాలనుకోవడం ఏ మాత్రం వాంఛనీయం కాదు. దీన్ని కచ్చితంగా నిరోధించాలి’ అని మాన్యువల్‌లోని 24.9 నిబంధన స్పష్టం చేస్తోంది. 

ఇక 24.11 నిబంధనలోని అంశాల ప్రకారం.. తాము ఏదైనా వల పన్ని విజయవంతంగా పట్టుకున్నపుడు, కేసుల రిజిస్ట్రేషన్ చేసినపుడు, ప్రజల దృష్టిలో బాగా కావాల్సిన (మోస్ట్ వాంటెడ్) నేరస్తులను పట్టుకున్నపుడు సీబీఐ మీడియాకు పత్రికా ప్రకటనల ద్వారా తెలియజేయవచ్చు. ఒక కేసులో చార్జిషీటు వేసేటపుడు కూడా తెలియ జేయ వచ్చు. ఏదైనా కేసులో నిందితులకు శిక్ష పడినపుడు ఆ విషయాన్ని కూడా ప్రకటించవచ్చు.

ఏ స్థాయి అధికారి ప్రకటన జారీ చేయవచ్చు?
ఢిల్లీ బయట ఉన్న సీబీఐ కార్యాలయాల నుంచి ఎస్‌పీ హోదా గల అధికారి మాత్రమే పత్రికా ప్రకటనలు జారీ చేయాలి. అవి కూడా స్థానిక ప్రయోజనాలున్న కేసుల కు సంబంధించినవిగా మాత్రమే ఉండాలి. అది కూడా నేరుగా ఎస్‌పీ హోదా గల అధికారి విలేకరుల సమావేశంలో మాట్లాడరాదు. పి.ఐ.బి అధికారుల ద్వారా మాత్రమే పత్రికా ఆహ్వానాలు పంపి అపుడే తాము చెప్పదల్చుకున్న సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. 35.15 ప్రకారం సీబీఐ ప్రధాన కార్యాలయంలోనైతే డిప్యూటీ ప్రిన్సిపల్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్ మాత్రమే సీబీఐ వ్యవహారాలు పత్రికలకు చెప్పడానికి అర్హుడు. 

పత్రికలకు, మీడియాకు సీబీఐలోని డీసీబీఐ, ఎస్‌డీబీఐ, ఏడీసీబీఐ అధికారులు మాత్రమే బ్రీఫింగ్ ఇవ్వాలి. ఒక వేళ సీబీఐ జాయింట్ డెరైక్టర్ పత్రికలతో మాట్లాడాలనుకుంటే ముందుగా ఆయన అదనపు డెరైక్టర్ లేదా సీబీఐ డెరైక్టర్ నుంచి అనుమతి తీసుకుని తీరాలి. డీఐజీ, ఎస్‌పీ లేదా ఆ హోదాకు తక్కువైన అధికారి ఎవరూ కూడా పత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదా పత్రికలతో మాట్లాడ్డం గానీ చేయకూడదు. ఏదైనా ఒక కేసులో ముఖ్యమైన మలుపు ఉంటే దానిని తక్షణం డిప్యూటీ ప్రిన్సిపల్ ఇన్ఫర్మేషన్ అధికారి ద్వారా మాత్రమే తెలియజేయాల్సి ఉంటుంది.

ఖండనలు, వివరణలు
సీబీఐ దర్యాప్తు సమాచారాన్ని ఏదైనా పత్రిక వక్రీక రించి ప్రచురిస్తే లేదా సీబీఐ దర్యాప్తులో వెల్లడైన విషయాలను తప్పుగా ప్రచురిస్తే స్థానిక సీబీఐ ఎస్‌పీ వాటిని సత్వరం డీఐజీ, లేదా జాయింట్ డెరైక్టర్ దృష్టికి తెచ్చి వారి అనుమతితో రిజాయిండర్లు, సవరణలు జారీ చేయవచ్చు. (ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ దర్యాప్తు జరుపుతున్న కేసుల విషయంలో సీబీఐ అధికారులు ఏ మాత్రం ఈ నిబంధనలు పాటించడం లేదనేది సుస్పష్టం)

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!