హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘ముఖ్యమంత్రి ఫొటో లేకుండా వాహనాలు ఎలా తిరుగుతాయి? తక్షణమే అంబులెన్సులమీద సీఎం ఫొటో ఏర్పాటు చేయండి. అవసరమైతే డిజైనే మార్చండి’ అంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ‘108’ నిర్వహణా సంస్థ ‘జీవీకే’కు ఆదేశాలు అందడంతో ఆ మేరకు అంబులెన్సులన్నింటి డిజైన్ మార్చడానికి రంగం సిద్ధమైంది.
పస్తుతం ఉన్న 802 అంబులెన్సులతో పాటు కొత్తగా రానున్న 70 అంబులెన్సులపైనా దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ పక్కనే కిరణ్‌కుమార్‌రెడ్డి ఫొటోను ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం ఒక్కో వాహనానికి రూ.9,000 చొప్పున సుమారు రూ.78 లక్షలపైనే ఖర్చు చేస్తున్నారు. ఓవైపు టైర్లు అరిగిపోయి తిరగలేనివి, డీజిల్ లేక ఆగిపోయినవి, ఇంజిన్ రిపేరుకు వచ్చి నడవలేని వాటి గురించి పట్టించుకోవడం లేదుగానీ ముఖ్యమంత్రి ఫొటో కోసం రూ.72 లక్షలు ఖర్చు చేస్తున్నారంటూ సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి.
ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో 6 పాత అంబులెన్సులకు రీ స్టిక్కరింగ్ చేసి సీఎం ఫొటోను పెట్టినట్టు సమాచారం. రెండు మాసాల్లో దశల వారీగా అన్ని వాహనాలపైనా కిరణ్ ఫొటో పెట్టాలని నిర్వహణా సంస్థకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. 108 అంబులెన్సుపై మహానేత వైఎస్ తన ఫొటో పెట్టుకోకున్నా.. దాన్ని చూస్తే వైఎస్‌ను చూసినట్టే జనం భావిస్తున్నారన్న ఉద్దేశంతోనే కిరణ్‌కుమార్‌రెడ్డి తన ఫొటోను పెట్టుకుంటున్నారని ఆ శాఖలో పనిచేసే కొందరు ఉద్యోగులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ భవన్‌పై వైఎస్సార్ పేరు తొలగించారు. ఆరోగ్యశ్రీ కార్డులపైనా ఆ బొమ్మను తీసేశారు. ఇప్పుడు 108 డిజైన్‌నే మార్చేసి తామే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు జనానికి చెప్పాలని సీఎం యత్నిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
No comments:
Post a Comment