రెండు కళ్ల సిద్ధాంతంతో రెంటికి చెడ్డ రేవడిగా తయారైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఒంటికన్ను 'ఆపరేషన్'కు సిద్ధం అయ్యారు. రెండుకళ్ల సిద్ధాంతం రెండు ప్రాంతాల్లోనూ పార్టీ డిపాజిట్లను గల్లంతు చేయడంతో కనీసం ఒక ప్రాంతంలోనైనా పార్టీని నిలుపుకోవాలనే పట్టుదలతో టీడీపీ ఉంది. దాంతో ప్రత్యేక తెలంగాణా కోరుతూ లేఖ ఇచ్చే దిశగా టిడిపి ఆలోచిస్తోంది. సీమాంధ్రలో తాము ఏంచేసినా పార్టీకి భవిష్యత్ కనిపించదని, తెలంగాణా ప్రాంతంలోనైనా పార్టీ పట్టు నిలుపుకోవాలనే దిశగా తెలుగు తమ్ముళ్లు కసరత్తు చేస్తున్నారు.
దీంట్లో భాగంగానే ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా గతంలో ప్రణబ్‌ముఖర్జీ కిచ్చిన లేఖను మళ్లీ కేంద్ర హోంశాఖకు ఇవ్వాలని నిన్న ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో జరిగిన ఆపార్టీ ఎమ్మెల్యేల సమావేశం నిర్ణయించింది. తెలంగాణకు మద్దతుగా ఈ నెల రెండో వారంలో కేంద్రానికి మళ్లీ లేఖను ఇవ్వనున్నట్లు టీడీపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించి సీమాంధ్ర నేతలతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణపై లేఖ అంశాన్ని తెలంగాణా తెలుగు తమ్ముళ్లు ఏడాది నుంచీ చెబుతున్నా ఈసారి మాత్రం సీమాంధ్ర నేతలూ ఈ విషయాన్ని బలపరుస్తున్నారు. తెలంగాణ లేఖ ఇచ్చాకే సెప్టెంబర్ 17తెలంగాణా విమోచన దినోత్సవం నాడు ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాన్ని ప్రకటిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు.
మరోవైపు చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి సీమాంధ్ర నేతలను తెలంగాణ విషయంలో ఒప్పించేందుకు మంతనాలు జరుపుతున్నారు. అయితే ప్రణబ్‌కిచ్చిన లేఖనే మళ్లీ ఇవ్వడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఆ పార్టీ సీనియర్ నేతలు చెప్పటం విశేషం. రానున్న ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు టీడీపీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. దీంతోపాటు మధ్యంతర ఎన్నికలు ఏ క్షణమైనా రావచ్చనే ఊహాగానాల నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. అక్టోబర్ రెండో తేదీ నుంచి ఆయన సుదీర్ఘమైన యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం.
బీసీలకు వంద సీట్లు అంటూ బీసీ డిక్లరేషన్ ఇచ్చామని, ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపి దానికీ స్ఫష్టత ఇచ్చామని, ఇక తెలంగాణకు మద్దతుగా త్వరలోనే లేఖ రాసి తెలంగాణ పట్ల కూడా పార్టీ వైఖరి తేల్చుతామని చంద్రబాబు చెప్పటం విశేషం. అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణలో తమ వైఖరిని స్పష్టం చేయటంతో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెక్ పెట్టాలని బాబు ఎత్తులు వేస్తున్నారు. రెండుకళ్ల సిద్దాంతంతో ఇప్పటికే పార్టీ క్యాడర్ ను పోగొట్టుకోవటంతో పాటు... నాన్చుకుంటూ పోతే మొదటికే మోసం వస్తుందని ఆలస్యంగా అయినా గ్రహించి కొంతమేరకు నష్టపోయినా.... అంతిమంగా లాభం జరుగుతుందని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏది ఏమైతేనేమీ.... మొత్తానికి చంద్రబాబు తెలంగాణ కన్నుకు ఆపరేషన్ మొదలు పెట్టారు. అయితే రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ సమీకరణాల కోసమే టిడిపి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తుందా అనే అనుమానాలు రాజకీయ విశ్లేషకులలో నెలకొన్నాయి. ఇక బాబుగారి మాటలో క్లారిటీ రాగానే మిగిలిన సీమాంధ్ర నేతలు ఏమంటారో వేచిచూడాలి.
No comments:
Post a Comment