‘ఈనాడు’ విశాఖ కార్యాలయం కేసులో కోర్టు తీర్పు
విశాఖ ‘ఈనాడు’ భవనాన్ని 3 నెలల్లో ఖాళీ చేయండి
కోర్టు ఖర్చులు కూడా చెల్లించండి
విశాఖపట్నం (లీగల్), న్యూస్‌లైన్: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. విశాఖ సీతమ్మధారలోని ఈనాడు కార్యాలయాన్ని మూడు నెలల్లో ఖాళీ చేసి స్థల యజమాని ఆదిత్యవర్మకు అప్పగించాల్సిందిగా ఆర్‌సీసీ కోర్టు (అద్దె నియంత్రణ కోర్టు) బుధవారం తీర్పునిచ్చింది. దీంతో ఐదేళ్లుగా కొనసాగుతున్న ఈ స్థల వివాదానికి తెరపడినట్లయింది. ఈ కేసు విచారణ నిమిత్తం రామోజీరావు పలు పర్యాయాలు స్వయంగా కోర్టుకు కూడా హాజరయ్యారు. వివరాలివి.. ఈనాడు అధినేత సీహెచ్ రామోజీరావు 1974లో విశాఖలోని సీతమ్మధారలో మంతెన ఆదిత్యకుమార్ వర్మకు చెందిన 2.78 ఎకరాల స్థలం, 40 వేల చదరపు అడుగులు విస్తీర్ణం కలిగిన నాలుగు పెద్ద భవనాలు 33 ఏళ్ల కాలానికి నెలకు మూడు వేల రూపాయల అద్దెకు తీసుకున్నారు. అద్దె కాలపరిమితి 2007లో పూర్తయింది. గడువు ముగిసినప్పటికీ స్థలాన్ని ఖాళీ చేయకుండా లీజు పొడిగించాలని రామోజీ కోరగా స్థల యజమాని వర్మ తిరస్కరించారు. దీంతో రామోజీ కోర్టును ఆశ్రయించారు. రామోజీ అద్దె కూడా ఇవ్వలేదని పేర్కొంటూ ఆదిత్య వర్మ ఆర్‌సీసీ కోర్టులో రెండు కేసులు (ఆర్‌సీసీ 41/2007, ఆర్‌సీసీ 49/2008) వేశారు.
ఈ కేసుల్లో రామోజీ అద్దె కట్టలేదని పేర్కొంటూ ఆరు మధ్యంతర పిటిషన్లు వేశారు. పిటిషన్లు నిలుపు చేయాలని రామోజీ హైకోర్టుని కూడా ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. తన గుమాస్తా అద్దె డబ్బుతో ఉడాయించడం వంటి కారణాలను రామోజీ న్యాయస్థానం ముందు పెట్టినా రుజువు కాలేదు. దీంతో విశాఖ సీతమ్మధారలోని ఈనాడు కార్యాలయాన్ని మూడు నెలల్లో ఖాళీ చేసి స్థల యజమానికి అప్పగించాలని, మధ్యంతర పిటిషన్లపై కోర్టు ఖర్చులు కూడా ఇవ్వాలని రామోజీరావుని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు బుధవారం విశాఖలోని ఆర్‌సీసీ కోర్టు న్యాయమూర్తి జి.గంగరాజు రెండు కేసుల్లో ఆరు మధ్యంతర పిటిషన్లపై తీర్పు ప్రకటించారు. అన్ని పిటిషన్లలో స్థల యజమాని ఆదిత్యవర్మకు అనుకూలంగా ఆదేశాలు వెలువడ్డాయి. ఆదిత్య వర్మ తరఫున సీనియర్ న్యాయవాదులు బాలాజీ వర్మ, వి.వి.రవిప్రసాద్, జె.రామకృష్ణ, రామోజీరావు తరుపున డి.వి.సుబ్బారావు, డి.వి.సోమయాజులు హాజరయ్యారు.
మరో కేసులో ఏసీబీ దర్యాప్తు
విశాఖ ఈనాడు స్థలానికి సంబంధించి మరో కేసుకు సంబంధించి ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. రామోజీరావు ఈ స్థలాన్ని 1974లో లీజుకు తీసుకోగా 1984-85లో 289 చదరపు మీటర్లు రోడ్డు విస్తరణలో పోయింది. అయితే రామోజీరావు ఈ విషయం భూ యజమానికి సమాచారం ఇవ్వకుండా... ఆ స్థలం తనదేనంటూ దానికి ప్రతిఫలంగా తన కుమారుడు సీహెచ్ కిరణ్ పేరుమీద రేనపువానిపాలెం సర్వే నెంబర్ 52లో 872 చదరపు మీటర్ల స్థలం తీసుకున్నారు. లీజు పొడిగించాలని 2007లో అదనపు జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సందర్భంలో... కోల్పోయిన స్థలానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం నుంచి 872 చదరపు మీటర్ల స్థలాన్ని పొందినట్లు ఆయనే వివరించారు. దీంతో రామోజీ మోసపూరిత కుట్ర వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆదిత్యవర్మ విశాఖ నాలుగవ అదనపు ప్రధాన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసు వేశారు. ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడంతో దర్యాప్తునకు కోర్టు ఆదేశించింది. దీనిపై రామోజీ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఇటీవల హైకోర్టు స్టేను తొలగించడంతో ఏసీబీ దర్యాప్తును తిరిగి ప్రారంభించింది.
No comments:
Post a Comment