YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 1 September 2012

టీడీపీకి చెంగల గుడ్‌బై.అక్టోబర్ 15 తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరతా

కులాలు, ప్రాంతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారు
ఎస్సీ వర్గీకరణ పేరుతో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు
ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నారు.. తర్వాత సమైక్యవాదం పేరుతో
సీమాంధ్ర నేతలను రెచ్చగొట్టారు.. ఇప్పుడు తెలంగాణ పాట పాడుతున్నారు
నందమూరి వారసులను అణగదొక్కుతున్నారు

నక్కపల్లి/పాయకరావుపేట (విశాఖపట్నం), న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు శనివారం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అక్టోబరు 15 దాటిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. శనివారం పాయకరావుపేట లక్ష్మీ ఫంక్షన్ హాల్‌లో ఆయన నియోజక వర్గ స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీలో తనకు జరుగుతున్న అవమానం భరించలేక, చంద్రబాబు నాయుడి వైఖరి నచ్చక పార్టీని వీడుతున్నానన్నారు. అందుకు దారితీసిన పరిస్థితులను తన అనుచరులకు వివరించి, టీడీపీని వీడుతున్నట్టు ప్రకటించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కులం కార్డును ఉపయోగించి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

బాబూ అధికారంలో ఉన్నపుడేం చేశారు?

ప్రస్తుతం బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్న చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదని చెంగల ప్రశ్నించారు. బీసీలపై అంత ప్రేమ ఉన్నప్పుడు రాజ్యసభ సీటును బీసీలకు చెందిన యనమల రామకృష్ణుడికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిని చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణను తెరపైకి తెచ్చిన చంద్రబాబు కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మాలలు టీడీపీకి ఓటేయలేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇచ్చి తిరిగి సీమాంధ్ర నాయకులను రెచ్చగొట్టి సమైక్యవాదం పేరుతో ధర్నాలు, ఆందోళనా కార్యక్రమాలను ప్రోత్సహించారని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు తెలంగాణ పాట పాడుతున్నారని విమర్శించారు. 

తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్‌టీఆర్ కుటుంబాన్ని అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారని, వారసుడిగా తన కుమారుడినే ప్రతిపాదిస్తున్న చంద్రబాబు, పార్టీ వ్యవస్థాపకులైన ఎన్‌టీఆర్ కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించడంలేదన్నారు. చంద్రబాబును ప్రజలు రెండు పర్యాయాలు తిరస్కరించారని, ఆయన నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం పోయిందన్నారు. ఎన్‌టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ బతికి బట్టకట్టాలంటే బాలకృష్ణను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్‌తో చంద్రబాబు మ్యాచ్‌ఫిక్సింగ్..

కాంగ్రెస్‌ను ఎన్‌టీఆర్ ఆగర్భ శత్రువుగా చూశారని, అదే పార్టీతో చంద్రబాబు మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నారని చెంగల ఆరోపించారు. కాంగ్రెస్‌తో చేతులు కలిపి వైఎస్సార్ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు పన్నినా జగన్ తన సచ్ఛీలతను నిరూపించుకుంటారన్నారు. 2014లో జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 220 స్థానాలు కైవసం చేసుకుని అధికారంలోకి రావడం ఖాయమన్నారు. చంద్రబాబు అవలంబిస్తున్న విధానాల వల్ల పార్టీ నానాటికీ దిగజారిపోతోందన్నారు. త్వరలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు కాంగ్రెస్‌లో విలీనం చేయడం ఖాయమన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!