
విద్యుత్ సమస్యపై వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో మహాధర్నాలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో చీకట్లు
రైతుకు కనీసం రెండు, మూడు గంటలు కూడా సక్రమంగా అందని విద్యుత్.. 5 వేల నుంచి 10 వేల పరిశ్రమల మూత
విద్యుత్ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడంలో ప్రభుత్వం విఫలం
పులివెందుల (వైఎస్‌ఆర్ జిల్లా) న్యూస్‌లైన్ : ‘‘మొద్దు నిద్రలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని మేల్కొలపాలి. విద్యుత్ సమస్యపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగే బంద్‌ను అన్ని వర్గాల ప్రజలు, పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలి’’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు. విద్యుత్ కోతలకు నిరసనగా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లెలో విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో విజయమ్మ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బాధ కలుగుతోంది. సర్కారు నిర్లక్ష్యంతో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయికి చేరుకున్న విద్యుత్తు సమస్యపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు కలిసిరావాలి. గురువారం జరిగే ధర్నాలు, శుక్రవారం నిర్వహించే బంద్ ద్వారా ప్రజా నిరసనను సర్కారుకు వినిపించాలి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ పార్టీ కాదు. ప్రజా పార్టీ. ప్రజా సంక్షేమం కోసం యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో ఉద్యమాలు చేశారు. వైఎస్‌లో ఉన్న మనస్సు జగన్‌బాబులో ఉంది. ప్రతి ఒక్కరూ జగన్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి. అకుంఠిత దీక్షతో ఉద్యమించాలి. మన ప్రభుత్వం వచ్చేవరకు పోరాటం చేయాలి’’ అని పిలుపునిచ్చారు.

ఉచిత విద్యుత్‌పై చంద్రబాబు ప్రగల్భాలు
ఉచిత విద్యుత్ అంటే దుస్తులు ఆరేసుకోవడానికేనని వ్యాఖ్యానించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈనాడు ఏడు గంటలు కాదు.. 12 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. అధికారంలోకి వస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కూడా అమలు చేస్తానంటూ చంద్రబాబు మాట్లాడుతున్న తీరు చూస్తే ‘ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతాను’ అన్న చందంగా ఉందని విమర్శించారు. చంద్రబాబు చాలాసార్లు కరెంటు చార్జీలు పెంచారని, అందుకు నిరసనగా వైఎస్‌ఆర్ బషీర్‌బాగ్ వద్ద 11 రోజులు నిరాహార దీక్ష చేసినా స్పందించలేదని అన్నారు. పైగా, నిరసన తెలిపిన వారిపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపించి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పలువురిని పొట్టన పెట్టుకుందని విమర్శించారు
No comments:
Post a Comment