
కోతలతోపాటే పెరుగుతున్న బలవన్మరణాలు
దానికి తోడవుతున్న మోయలేని రుణ భారం
పెట్టుబడి ఖర్చులకూ చాలని ‘గిట్టుబాటు’ ధరలు
10 రోజుల్లోనే మెదక్‌లో నలుగురి విషాదాంతం
గత మూడు నెలల్లో అనంతలో 22 మంది,
కరీంనగర్‌లో 21, ఆదిలాబాద్‌లో 18,
వరంగల్‌లో 11, పాలమూరులో 8 మంది మృతి
కరెంట్ సమస్యపై చేతులెత్తేస్తున్న సర్కారు
వానలు పడి ఉత్పత్తి పెరగాల్సిందేనట!
న్యూస్‌లైన్ నెట్‌వర్క్: ఇది ఒక్క మల్లేశం, రాజిరెడ్డి, సంపత్‌రెడ్డిల విషాదాంతం మాత్రమే కాదు. వేళకు కరెంటు రాక, వచ్చే అరకొర కరెంటుతో సగం మడి కూడా పారక, వేసిన పంట వేసినట్టే ఎండిపోతుంటే చూసి తట్టుకోలేక కొందరు... ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుంటే చేతికొచ్చిన కొద్దిపాటి పంటకూ గిట్టుబాటు ధర దక్కక, చేతికందిన మొత్తం పెట్టుబడి ఖర్చులకైనా చాలని దైన్యంతో ఇంకొందరు.. అంతకంతకూ మేట వేస్తున్న అప్పులు తీరే మార్గం కన్పించక అంతులేని నిరాశకు లోనై మరికొందరు. కారణాలు ఏమైతేనేం.. కష్టాల సేద్యం చేయలేక రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలు మూకుమ్మడిగా బలవన్మరణాల బాట పడుతున్నారు. కోస్తా, రాయలసీమ, తెలంగాణ.. అన్ని ప్రాంతాలదీ ఇదే గాథ. ఎక్కడ చూసినా రైతుది ఇదే వ్యథ. బంగారం పండాల్సిన పంటచేలు నిలువునా నెర్రెలుబారుతున్నాయి. ఫలితంగా పల్లెలన్నీ అన్నదాతల మృత్యుఘోషతో ప్రతిధ్వనిస్తున్నాయి. గత మూడు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా రైతు ఆత్మహత్యల సంఖ్య మిగతా 2వ పేజీలో ఠ
మరింతగా పెరుగుతోంది. అనంతపురంలో 22 మంది, ఆదిలాబాద్‌లో 18 మంది, వరంగల్‌లో 11 మంది, మహబూబ్‌నగర్‌లో 8 మంది.. ఇవన్నీ దారుణ పరిస్థితికి అద్దం పట్టే గణాంకాల్లో కేవలం కొన్ని మాత్రమే. మిగతా జిల్లాల్లోనూ పరిస్థితి ఇందుకు ఏమాత్రం భిన్నంగా లేదు. పైగా నానాటికీ రైతు ఆత్మహత్యల సంఖ్య పెరుగుతోంది. తానున్నానంటూ ధైర్యం చెప్పి, సమస్యల నుంచి గట్టెక్కించాల్సిన ప్రభుత్వమేమో.. దేవుడు దయతలిచి, వానలు పడి కష్టాలు తీరాల్సిందే తప్ప తానేమీ చేయలేనంటూ చేతులెత్తేస్తోంది.
ఏ జిల్లాలో చూసినా కరెంటు కోతలు, అప్పుల బాధ వంటి కారణాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కరీంనగర్‌లో గత మూడు నెలల్లో 21 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలంలోని గోవిందుపల్లికి చెందిన అన్నెడ రాజిరెడ్డి అప్పుల బాధతో ఆదివారం పురుగుల మందు తాగాడు. ధర్మపురి మండలం రాయపట్నానికి చెందిన మూలపలుకుల లింగయ్య తన పత్తి పంట పురుగు సోకి ఎర్రబారడంతో, ఇక అప్పులు తీర్చలేననే మనోవేదనతో ఈ నెల 10న చేలోనే పురుగుల మందు తాగాడు. మహముత్తారం మండలం దుంపిళ్లపల్లికి చెందిన నాంపెల్లి రామయ్య 13న, మంథని మండలం మల్లారానికి చెందిన పర్శ పోచయ్య 14న, విలోచవరానికి చెందిన ఈట శ్రీనివాస్, పెద్దపల్లి మండలం కాసులపల్లికి చెందిన దాసరి సతీశ్ 16న ఇలాగే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముస్తాబాద్ మండలం బందనకల్‌కు చెందిన కస్తూరి నారాయణరెడ్డి ఈ నెల 22న పొలం వద్దే చెట్టుకు ఉరేసుకున్నాడు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన మెట్టెల రమేశ్ (32) అప్పుల భారం భరించలేక జూలై 9న పురుగుమందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. వరంగల్ జిల్లాలో కూడా గత మూడు నెలల వ్యవధిలో 11 మంది రైతులు అప్పుల బాధతో బలిపీఠమెక్కారు. దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన నల్ల సుదర్శన్ తనకున్న ఎకరంతో పాటు రెండెకరాలను కౌలుకు తీసుకుని పత్తి వేశాడు. పంటంతా ఎర్రబారడంతో పెట్టుబడి కూడా రాదనే మనోవేదనతో ఈ నెల 15న పురుగుల మందు తాగాడు. పరకాల మండలం వరికోలుకు చెందిన కంచె భిక్షపత్తి జూలై 19న, అదే గ్రామానికి చెందిన పింగిలి మల్లయ్య ఆగస్టు 26న ఇదేవిధంగా తనువు చాలించారు. శాయంపేట మండలం గట్లకానిపర్తికి చెందిన బొమ్మకంటి సాంబయ్య అనే కౌలు రైతు ఈనెల 16న పురుగుల మందు తాగాడు. ఒక్క బచ్చన్నపేట మండలంలోనే గత మూడు నెలల్లో ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లాలోనైతే కేవలం గత 10 రోజుల్లోనే ఏకంగా నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.




మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం, శిల్వేరుకు చెందిన పిట్టల నాగరాజు (22) అప్పులు చేసి నాలుగెకరాల్లో పత్తిసాగు చేశాడు. వర్షాభావంతో పంట ఎండిపోయే స్థితికి చేరుకోవడంతో ఈ నెల 22న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్యాంకు రుణం రూ.25 వేలకు తోడు ఇతరత్రా అప్పులు రూ.1.5 లక్షలున్నాయంటూ భార్య ఎల్లమ్మ రోదిస్తోంది.

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం అటికెలగుండు గ్రామానికి చెందిన గుజ్జల అర్జునప్ప(40) తన ఐదెకరాలను సాగు చేసేందుకు వరుసగా ఐదు బోర్లు వేయించినా లాభం లేకపోయింది. జూలై చివర్లో అంతంత మాత్రంగానైనా వానలు పడటంతో వేరుశనగ, కంది, ఆముదం వేశాడు. విత్తనాలు మొలకెత్తకపోవడంతో 10 రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కొంపముంచిన వర్షాభావం
గుంటూరు జిల్లా వెల్దుర్తికి చెందిన మల్లా ఆంజనేయులు (27) రెండేళ్లుగా నాలుగెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పండించాడు. వర్షాభావంతో పంటలు పండక రూ.2.4 లక్షలు అప్పు చేశాడు. ఈ ఏడాదీ రెండెకరాల్లో మిర్చి, నాలుగు ఎకరాలలో పత్తి వేశాడు. ఈసారీ వానలు పడక పంటలెండాయి. అప్పులు తీర్చలేనన్న భయంతో ఈ నెల 17న పురుగుమందు తాగాడు.
రుణ భారంతో...
వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలం పొడదుర్తికి చెందిన రైతు గాలి శివయ్య(48) ఐదు ఎకరాల పొలంలో వరి సాగు చేశారు. బోరుబావి ఎండిపోవడంతో మరో బోరు వేయిస్తే అదీ ఎండిపోయింది. మొత్తంమీద రూ.5 లక్షల అప్పు మిగలడంతో మనస్తాపానికి గురై ఆగస్టు 25న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేటకు చెందిన చిన్నబ్బి(45) అరటి,బొప్పాయి సాగు చేశాడు. పంట పోగా రూ.3 లక్షల అప్పు మిగలడంతో జూన్ 19న బావిలో దూకి మరణించాడు.
No comments:
Post a Comment