YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 30 August 2012

టీడీపీ నిజస్వరూపం మరోసారి బయటపడింది

* ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు 
* అత్యవసరాలకు మినహాయింపు: జూపూడి

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో తీవ్రస్థాయిలో ఉన్న విద్యుత్ సంక్షోభాన్ని ఎలుగెత్తి చాటి, ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు శుక్రవారం నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. బంద్ నుంచి అత్యవసరాలైన పాలు, నీళ్లు, మందులు సరఫరా చేసే వాహనాలకు మినహాయింపు ఉంటుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు తెలిపారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

‘‘రాష్ట్రాన్ని కనీవినీ ఎరుగని విద్యుత్ సంక్షోభం చుట్టుముట్టింది. కోతలతో మొదలై అసలు కరెంటే లేని పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ, పారిశ్రామిక, వ్యాపార రంగాలతోపాటు మొత్తం జన జీవితాన్నే అతలాకుతలం చేస్తోంది. ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వానికి, అందుకు సహకరిస్తున్న ప్రధాన ప్రతిపక్షానికి తగిన బుద్ధి చెప్పాలి. విద్యుత్ సంక్షోభాన్ని ఎలుగె త్తి చాటేందుకు శుక్రవారం జరిగే రాష్ట్రవ్యాప్త బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని, విజయవంతం చేయాలి’’ అని కోరారు. 

ప్రజల అవసరాలను గుర్తించి, ప్రజల కోసం చేపట్టిన ఈ బంద్‌ను విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తన శ్రేణులకు చేస్తున్న విజ్ఞప్తి అని చెప్పారు. బంద్‌లో విద్యా సంస్థలు, కార్మికులు, రైతులు అన్ని వర్గాల వారు పాల్గొనాలని, శాంతియుతంగా నిర్వహించే బంద్‌లో పోలీసులు అతిచేయవద్దని జూపూడి కోరారు.

టీడీపీ నిజస్వరూపం మరోసారి బయటపడింది
రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యపట్ల ప్రభుత్వంలో చలనం తెచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని టీడీపీ చెప్పడంతో ఆ పార్టీ నిజ స్వరూపం మరోసారి బయటపడిందని జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. విద్యుత్ సంక్షోభం కారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ ఇచ్చిన బంద్‌ను అడ్డుకోవాలని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పడం సరైందికాదన్నారు. 

ప్రభుత్వం చేయాల్సిన ప్రకటనను ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ చేయడం దురుదృష్టకరమన్నారు. టీడీపీకి చేతనైతే ప్రభుత్వం మెడలు వంచడానికి ఎలాంటి ప్రజా ఉద్యమాలు చేపట్టాలో ఆలోచించాలని చెప్పారు. ప్రజా సమస్యలపట్ల ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ వైఖరేమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకుల వైఖరి కారణంగా ఆ పార్టీ సర్వనాశనమైందని ఇండియాటుడే, ఎన్డీటీవీ, ది హిందూలు జరిపిన సర్వేలు రుజువు చేస్తున్నాయని జూపూడి తెలిపారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!