YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 30 August 2012

బంద్‌కు కార్మిక సంఘాలు, రైతు సంఘాల మద్దతు

* బంద్‌కు కార్మిక సంఘాలు, రైతు సంఘాల మద్దతు 
* పలు కళాశాలలు, విద్యాసంస్థల స్వచ్ఛంద సెలవు 
* ఆర్‌టీసీ ముందస్తు చర్యలు.. పోలీసుల బందోబస్తు 
* జేఎన్‌టీయూ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా
* శాంతియుత బంద్ పాటించాలని వైఎస్సార్ సీపీ విజ్ఞప్తి

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఒకవైపు పారిశ్రామిక రంగం, మరోవైపు వ్యవసాయ రంగం విద్యుత్ కోతలతో సంక్షోభంలో కూరుకుపోతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం బంద్ నిర్వహిస్తోంది. నీరు లేక ఎండిపోతున్న పంటలను చూసి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కారులో స్పందన కరువైందని ఆ పార్టీ ధ్వజమెత్తింది. విద్యుత్ కోతలు, పవర్ హాలిడేల కారణంగా పరిశ్రమలు దివాలా దశకు దిగజారుతున్నా.. లక్షలాది మంది కార్మికులు ఉపాధిలేక పస్తులుంటున్నా.. సర్కారులో చలనం లేకపోవటంపై వైఎస్సార్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర విద్యుత్ సంక్షోభంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆందోళనకు మద్దతుగా శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చింది. 

బంద్ జరపటానికి ముందు గత మూడు రోజులుగా వివిధ రూపాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, దీక్షలు చేపట్టింది. శుక్రవారం నాటి బంద్‌కు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని పార్టీ నేతలు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ తలపెట్టిన బంద్‌కు పలు కార్మిక సంఘాలు, పరిశ్రమల సమాఖ్యలు, రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. రాష్ట్రంలో పలు చోట్ల కళాశాలలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్‌టీసీ) కూడా ముందస్తు చర్యలు చేపట్టింది. బంద్‌ను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. 

జేఎన్‌టీయూ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా
వైఎస్సార్ కాంగ్రెస్ తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్ కారణంగా.. జేఎన్‌టీయూహెచ్ పరిధిలో శుక్రవారం జరగాల్సిన ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, బీఫార్మసీ పరీక్షలను వాయిదా వేశారు. ఎంబీఏ సెకండ్ సెమిస్టర్, ఎంసీఏ మూడో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు సెప్టెంబర్ 1న, బీటెక్, బీఫార్మసీ పరీక్షలు 4 న నిర్వహించనున్నట్లు డెరైక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్ తెలిపారు.

కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయి: వాసిరెడ్డి పద్మ
విద్యుత్ సంక్షోభంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టనున్న బంద్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా సమాచారం అందిందని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హింసను, విధ్వంసాన్ని ప్రేరేపించటానికి అసాంఘిక, రాజకీయ శక్తులు పథకం పన్నినట్లు సమాచారం ఉన్న నేపథ్యంలో కార్యకర్తలు, ప్రజలు శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా మాత్రమే తీవ్ర నిరసన తెలపాలని ఆమె ఒక ప్రకటనలో కోరారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!